కోర్టులు చెప్పిన ప్రకారమే హిందుజాకు చెల్లించాం

సుప్రీంకోర్టు.. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ).. అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఫర్‌ ఎలక్ట్రిసిటి(ఆప్‌టెల్‌) ఉత్తర్వుల మేరకే హిందుజా నేషనల్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌(హెచ్‌ఎన్‌పీసీఎల్‌)కు రూ.1,234.68 కోట్లు చెల్లించామని ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ పేర్కొన్నారు.

Published : 27 May 2023 06:38 IST

2016 నుంచి పీపీఏ అమల్లో ఉందని ఏపీఈఆర్‌సీ చెప్పింది
ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌

ఈనాడు-అమరావతి: సుప్రీంకోర్టు.. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ).. అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఫర్‌ ఎలక్ట్రిసిటి(ఆప్‌టెల్‌) ఉత్తర్వుల మేరకే హిందుజా నేషనల్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌(హెచ్‌ఎన్‌పీసీఎల్‌)కు రూ.1,234.68 కోట్లు చెల్లించామని ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ పేర్కొన్నారు. విజయవాడలోని విద్యుత్‌ సౌధలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ మొత్తాన్ని చెల్లించడానికి ముందు అడ్వకేట్‌ జనరల్‌, సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నుంచి సూచనలు తీసుకున్నాం. న్యాయ శాఖ కూడా పరిశీలించి ధ్రువీకరించింది. హిందుజా సంస్థ రికార్డులు, కోర్టుల ఉత్తర్వుల మేరకు లెక్కగట్టి చెల్లించాం. ఈ చెల్లింపులకు ఆర్థిక శాఖ అనుమతించింది. ఆ శాఖ చేసిన సూచన మేరకే మంత్రి మండలి నుంచి ఆమోదం తీసుకున్నాం. ఆ సంస్థతో 2016లో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) అమల్లో ఉంటుందని ఏపీఈఆర్‌సీ స్పష్టంగా చెప్పింది. దీని ప్రకారం ప్లాంటు నార్మల్‌ అవైలబులిటి 80 శాతంగా పరిగణనలోకి తీసుకుని స్థిర ఛార్జీలను లెక్కించాం. అది కూడా ఏపీఈఆర్‌సీ నిర్దేశించిన ప్రకారం యూనిట్‌కు రూ.1.06 వంతున లెక్కగట్టాం. వాస్తవానికి 2022 సెప్టెంబరులో హిందుజా సంస్థ రాసిన లేఖలో ప్లాంటు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న రోజులు.. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు భావించిన వ్యవధి (డీమ్డ్‌ అవైలబులిటి) కింద రూ.2,401 కోట్లు చెల్లించాలని కోరింది. కానీ, మేం అన్ని లెక్కలను పరిశీలించి సంస్థ కోరిన మొత్తాన్ని తగ్గించి రూ.1,234 కోట్లు మాత్రమే చెల్లించాం. ఇవి ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ చట్టాల ప్రకారమే ఉన్నాయి. వీటికి ఏపీఈఆర్‌సీ అనుమతి పొందాల్సిన అవసరం లేదు. ట్రూఅప్‌ ప్రతిపాదనలో డిస్కంలు ఈ మొత్తాన్ని చూపుతాయి. అందులో ఎంత మొత్తం అనుమతించాలనే దానిపైనే ఏపీఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంటుంది’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు