కాళేశ్వరం 22వ ప్యాకేజీలో మూడు మినీ జలాశయాలు

కాళేశ్వరం ఎత్తిపోతలలోని 22వ ప్యాకేజీ కింద మూడు మినీ జలాశయాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

Updated : 27 May 2023 05:51 IST

1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న నీటిపారుదల శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతలలోని 22వ ప్యాకేజీ కింద మూడు మినీ జలాశయాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని మోతె, గాంధారి, కామారెడ్డి శివారుల్లో 4 టీఎంసీల సామర్థ్యంతో వీటిని నిర్మించేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉన్న చెరువులను విస్తరించి పటిష్ఠం చేయడం ద్వారా వాటి కింద కొత్త ఆయకట్టుకు నీరందించాలనేది లక్ష్యంగా ఉంది. జలాశయాలు, స్ట్రక్చర్లు, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, భూసేకరణ కలిపి దాదాపు రూ.800 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతాయన్న అంచనాలున్నాయి. అయితే ఈ జలాశయాల సర్క్యూట్‌లో మొదట నాలుగు జలాశయాలు ఉండగా.. వాటిలో ఒకటి తొలగించాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసింది.

21వ ప్యాకేజీలోని మంచిప్ప కొండెం చెరువు నుంచి శ్రీరాంసాగర్‌ నీటిని కొత్తగా నిర్మించనున్న 3 జలాశయాలకు అందించనున్నారు. గతంలో మోతె జలాశయాన్ని 1.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని భావించగా.. దీని సామర్థ్యం 2 టీఎంసీలకు పెంచనున్నారు. గాంధారి మండలంలో కాటెవాడి జలాశయం 0.50 టీఎంసీ, కామారెడ్డి మండల పరిధిలో తిమ్మక్కపల్లి జలాశయం 1.50 టీఎంసీలతో నిర్మించనున్నారు. ఈ మూడింటి కింద 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలుగా ప్రధాన పనులతో పాటు పిల్ల కాలువలకు సంబంధించిన మ్యాప్‌లను ముందుగానే రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుని టెండర్లు పిలిచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని