కేంద్రం అరాచకాలు పరాకాష్ఠకు

కేంద్ర ప్రభుత్వ ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయని, గవర్నర్‌ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతూ, ఏ పనీ చేయనీయడంలేదని తెలంగాణ, దిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌ ధ్వజమెత్తారు.

Updated : 28 May 2023 05:01 IST

ఎమర్జెన్సీ నాటి దారుణమైన పరిస్థితులు
గవర్నర్‌ వ్యవస్థ దుర్వినియోగం
దిల్లీపై కేంద్రం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాల్సిందే
ఆ బిల్లును పార్లమెంటులో ఓడిస్తాం
తెలంగాణ, దిల్లీ, పంజాబ్‌ సీఎంలు కేసీఆర్‌, కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌
ఈనాడు - హైదరాబాద్‌


‘ఏమిటీ గవర్నర్‌ వ్యవస్థ? అది అలంకారప్రాయమైన పదవి. బడ్జెట్‌ ఆమోదం కానివ్వనని గవర్నర్‌ అంటే ఎలా..? సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్‌ పెట్టుకోవాల్సిన దుస్థితి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా..?’

సీఎం కేసీఆర్‌


కేంద్ర ప్రభుత్వ ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయని, గవర్నర్‌ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతూ, ఏ పనీ చేయనీయడంలేదని తెలంగాణ, దిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌ ధ్వజమెత్తారు. భాజపాయేతర ప్రభుత్వాల వెంటపడుతూ, రకరకాల దాడులతో బెదిరిస్తూ కేంద్రం అనేక దుర్మార్గాలకు పాల్పడుతోందని, ఆర్థికపరమైన పరిమితులు విధించడం సహా పలు విధాలుగా ఇబ్బంది పెడుతోందని తెలిపారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కాలరాసి దిల్లీలో పెత్తనం కోసం ఆర్డినెన్స్‌ తెచ్చిందని, దాన్ని అడ్డుకుంటామని, పార్లమెంటులో ఆమోదం పొందనీయబోమని చెప్పారు. కర్ణాటక ప్రజలు భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రాలేదని పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రగతి భవన్‌లో శనివారం భేటీ అనంతరం ముగ్గురు సీఎంలు విలేకరులతో మాట్లాడారు.

ఎమర్జెన్సీకి ముందు ఇలాగే జరిగింది

‘భారతదేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ నాటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ చాలా ప్రజాదరణ పొందిన పార్టీ. ఇది దేశానికి, ప్రపంచానికి తెలుసు. కేజ్రీవాల్‌ నాయకత్వంలో సామాజిక ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీ. దిల్లీలో వరుసగా మూడుసార్లు అద్భుత విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల దిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ చాలా స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఎన్నో రకాల మాయోపాయాలు పన్నినా.. భాజపాను దిల్లీ ప్రజలు తిరస్కరించి, ఆప్‌నే గెలిపించారు. ప్రజలు గెలిపించిన మేయర్‌ను.. సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే తప్ప ప్రమాణ స్వీకారం చేయనీయలేదు. అది అరాచకమైన పద్ధతి. రెండు జాతీయ పార్టీలను మట్టి కరిపించి అరవింద్‌ కేజ్రీవాల్‌ బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించగా.. కేంద్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ)ని ప్రజాస్వామ్య ప్రభుత్వం నెత్తిన కూర్చోపెట్టి.. ఊపిరాడనీయకుండా చేస్తోంది. కేజ్రీవాల్‌ ప్రభుత్వం చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ప్రధాన న్యాయమూర్తితో కూడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కిందనే అధికారులందరూ పనిచేయాలని.. వారి బదిలీలు, మంచిచెడులు, నియంత్రణ కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతిలో కాదని చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది.

గెలిచిన ప్రభుత్వాన్ని పనిచేయనీయకపోవడమే అరాచకం. దాని మీద ఎల్‌జీని కూర్చోబెట్టడం మరింత నియంతృత్వ వైఖరి. చివరికి సుప్రీంకోర్టు తీర్పునూ కాలరాసేలా.. ఒక ఆర్డినెన్స్‌ తెచ్చారు. అది మరీ దుర్మార్గం. ఏ ఎమర్జెన్సీ గురించి నరేంద్ర మోదీ, భాజపా నాయకులు గొంతు చించి మాట్లాడుతుంటారో ఇవ్వాళ కచ్చితంగా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఆనాడు అలహాబాద్‌ హైకోర్టు తీర్పు తర్వాత, దాన్ని  కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. ఇప్పుడూ అలాగే చేశారు. ఆనాడు జయప్రకాశ్‌ నారాయణ్‌ నేతృత్వంలో మహామహురాలైన ఇందిరాగాంధీనే దేశం పక్కకు తప్పించింది. ఇలాగే వ్యవహరిస్తే ఎవరి పరిస్థితి అయినా అలాగే ఉంటుంది. మొహల్లా క్లినిక్‌లు, విద్య, తాగునీటి వ్యవస్థ, విద్యుత్‌ రంగంలో రాయితీలు, నిరుపేదల బాగు కోసం దిల్లీలో అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి. అలాంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మోదీ ప్రభుత్వం దిల్లీ ప్రజలను అవమానిస్తోంది. వాళ్లు భవిష్యత్తులో భాజపా ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెబుతారు. రైతుల నల్ల చట్టాలను వాపస్‌ తీసుకున్నట్లుగానే ఈ ఆర్డినెన్స్‌నూ ఉపసంహరించుకోవాలి. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమించాల్సి వస్తుంది. లోక్‌సభ, రాజ్యసభల్లో మా శక్తినంతా ఉపయోగించి ఆర్డినెన్స్‌ బిల్లును ఓడిస్తాం’ అని కేసీఆర్‌ హెచ్చరించారు.

మా పోరాటం దేశం కోసం: అరవింద్‌ కేజ్రీవాల్‌

‘కేంద్రం ఆర్డినెన్స్‌ దిల్లీ ప్రజలను అవమానించడమే. సీబీఐ, ఈడీలతో బెదిరించడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి భాజపాయేతర సర్కార్లను కూల్చివేయడం భాజపాకు అలవాటుగా మారింది. దేశవ్యాప్తంగా నేను ప్రజల తరఫున తిరుగుతున్నాను. ఒకవేళ గవర్నరే పాలన చేయాలనుకుంటే, సీఎంని ఎన్నుకోవాల్సిన అవసరమేముంది? విపక్ష పార్టీలన్నీ ఒక్కటైతేనే భాజపాను ఢీకొట్టగలం. స్వాతంత్య్రాన్ని రక్షించుకోవాలంటే మోదీని ఓడించాలి. రాజ్యాంగ పరిరక్షణ కోసం కేసీఆర్‌ మాతో కలిసి రావాలి. మద్దతిచ్చి మా స్థయిర్యాన్ని పెంచిన ఆయనకు కృతజ్ఞతలు’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు యుద్ధం: భగవంత్‌మాన్‌

‘భాజపాయేతర ప్రభుత్వాలను వేధించేందుకు గవర్నర్లను వాడుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు.. ప్రజల హక్కుల కోసం మేం పోరాటం చేస్తున్నాం. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో చూస్తున్నాం. పంజాబ్‌లో బడ్జెట్‌ సమావేశాలు నడిచేందుకు గవర్నర్‌ సహకరించలేదు.. సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కేంద్రం నుంచి మా రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ నిలిపివేశారు. నీతి ఆయోగ్‌ సమావేశం ఈ రోజు దిల్లీలో జరుగుతోంది. అక్కడ చేసేదేమీలేదు.. ఫొటోలు దిగడం తప్ప. అందుకే సమావేశాన్ని బహిష్కరించాం. నీతి ఆయోగ్‌ సిఫార్సులను కేంద్రం పాటించదు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లు వినదు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో ఒకే విధానాన్ని భాజపా ఆశిస్తోంది. అది కుదరదు. దేశం ఒక మాల లాంటిది. అందులో అన్ని రకాల పూలు ఉంటాయని కేంద్రం గుర్తించాలి. తెలంగాణలో చెక్‌డ్యామ్‌లు, నీటి వనరులను చూసి మా రాష్ట్రంలో అమలు చేస్తున్నాం’ అని పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ తెలిపారు.

కేసీఆర్‌తో కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌ల భేటీ

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, ఆప్‌ ఎంపీలు సంజయ్‌సింగ్‌, రాఘవ్‌ చద్దాలు శనివారం హైదరాబాద్‌కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రగతిభవన్‌కు వచ్చారు. సాదరంగా స్వాగతించిన కేసీఆర్‌ వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం దిల్లీ ప్రభుత్వంపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ తదితర పరిణామాలపై 2గంటల పాటు చర్చించారు. తర్వాత  ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం దిల్లీ, పంజాబ్‌ సీఎంలు, ఆప్‌ ఎంపీలు దిల్లీ బయల్దేరి వెళ్లారు.


ఇందిరనే ఓడించారు...

ఇందిరాగాంధీ చేసిన తప్పులతో ప్రజలు జనతా పార్టీని గెలిపించారు. వాళ్లు తప్పులు చేస్తే మళ్లీ ఇందిరను గెలిపించారు. తప్పు జరిగినప్పుడు దేశం తప్పక స్పందిస్తుంది. మీరు (కేంద్ర ప్రభుత్వం) కూడా ఇందిరాగాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ ధోరణిలోనే ఉన్నారిప్పుడు. మీకు, వాళ్లకు ఏం తేడా ఉంది? ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని మేం ప్రధానిని డిమాండ్‌ చేస్తున్నాం. మేమందరం అరవింద్‌ కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలబడతాం. 

 సీఎం కేసీఆర్‌


నా పోరాటం దేశం కోసం

‘నా పోరాటం దిల్లీ కోసం మాత్రమే కాదు.. దేశం కోసం. రాజ్యాంగ పరిరక్షణ కోసం. ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్‌ తెచ్చింది. భాజపా సర్కార్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. దిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా కేంద్రం లెక్కచేయడం లేదు. ఇక న్యాయం కోసం ప్రజలు ఎక్కడికి వెళ్తారు?

 దిల్లీ సీఎం కేజ్రీవాల్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని