సమీకృత మార్కెట్లతో సమస్యలకు చెల్లు

ఇరుకిరుకు మార్కెట్లు.. అధ్వాన పారిశుద్ధ్య పరిస్థితులు.. ఒక్కో ఆహారం కోసం ఒక్కో చోటకు వెళ్లాల్సి రావడం వంటి సమస్యలకు ఇక తెరపడనుంది.

Published : 28 May 2023 04:44 IST

రాష్ట్రంలో వేగంగా నిర్మాణం
ఏడాదిలోగా అన్ని పురపాలక సంఘాల్లో సిద్ధం
కొన్నిచోట్ల శివార్లలో ఏర్పాటుతో వ్యాపారుల అనాసక్తి

ఈనాడు, హైదరాబాద్‌: ఇరుకిరుకు మార్కెట్లు.. అధ్వాన పారిశుద్ధ్య పరిస్థితులు.. ఒక్కో ఆహారం కోసం ఒక్కో చోటకు వెళ్లాల్సి రావడం వంటి సమస్యలకు ఇక తెరపడనుంది. రహదారులపైనే కూరగాయలు, చేపలు, మాంసం విక్రయాలకు కాలం చెల్లనుంది. రాష్ట్రంలోని ప్రతి పురపాలిక పరిధిలో వేగంగా సాగుతున్న సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణాలు ఈ సమస్యలను తీర్చనున్నాయి. రాష్ట్రంలోని 144 ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటికి 14 ప్రాంతాల్లో మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. గజ్వేల్‌, సిద్దిపేట, ఖమ్మం ఇలా పలు మార్కెట్లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఊరికి కాస్తంత దూరంలో నిర్మించడంతో ప్రస్తుతానికి కొంత అనాసక్తత నెలకొంది. భవిష్యత్తు అవసరాలతోపాటు స్థలలభ్యతను బట్టి మార్కెట్లను నిర్మిస్తున్నట్లు మున్సిపల్‌ వ్యవహారాల ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.

కొన్ని ఊరికి దూరం..

నూతనంగా నిర్మించిన కొన్ని మార్కెట్లలో సౌకర్యాలున్నా.. అవి ఊరికి దూరంగా ఉండటంతో వ్యాపారులు ముందుకు రావటంలేదు. ఇప్పటికీ నగర పరిధిలో మార్కెట్లు అందుబాటులో ఉండటంతో నూతన మార్కెట్లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావటం లేదు. తూప్రాన్‌లో 54 దుకాణాలు ఏర్పాటు చేసినా 15 దుకాణాల్లోనే వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయి. అది కూడా పరిమిత సమయంలోనే. నారాయణపేటలో 112 దుకాణాలతో మార్కెట్‌ ప్రారంభిస్తే వేళ్లమీద లెక్కించదగిన దుకాణాలకు మాత్రమే వ్యాపారులు ముందుకు వచ్చారు. మాంసాహారం కోసం 41 దుకాణాలు నిర్మించారు. ఆదివారాల్లో వీటిలో 25-30 దుకాణాలు నడుస్తున్నాయి. మిగిలిన రోజుల్లో పది కూడా తెరుచుకోవు. మధిరలో పరిమిత సమయాల్లోనే వ్యాపారాలు సాగుతున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు మాంసాహారం విక్రయానికి దుకాణాలు కేటాయించలేదు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది.

నిర్మాణంలో 94..

94 మార్కెట్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే 14 అందుబాటులోకి వచ్చాయి. ధర్మపురి (జగిత్యాల జిల్లా), మంథని (పెద్దపల్లి), లీజ (జోగులాంబ), ఖమ్మం, మధిర (ఖమ్మం), తొర్రూరు (మహబూబాబాద్‌), తూప్రాన్‌ (మెదక్‌), నారాయణపేట (నారాయణపేట), రాజన్న సిరిసిల్ల (రాజన్న సిరిసిల్ల), జహీరాబాద్‌ (సంగారెడ్డి), గజ్వేల్‌, సిద్దిపేట (సిద్దిపేట), సూర్యాపేట (సూర్యాపేట), భువనగిరి (యాదాద్రి జిల్లా)లలో మార్కెట్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరో 29 ప్రాంతాల్లో ఇటీవలే స్థల వ్యవహారాలు కొలిక్కి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 12 ప్రాంతాల్లో కసరత్తు చేపట్టాల్సి ఉంది. తుర్కయంజాల్‌, నేరేడుచర్ల, పోచంపల్లి, కొంపల్లిలలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాల్సి ఉంది. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, కరీంనగర్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో అదనంగా ఒక్కొక్కటి చొప్పున నిర్మించేందుకు స్థలాల ఎంపిక చేయాల్సి ఉంది. రానున్న ఆరు నుంచి తొమ్మిది నెలల్లో 70 నుంచి 75 శాతం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా. ఏడాది వ్యవధిలో అన్నింటినీ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.


ఇటు గజ్వేల్‌.. అటు సిద్దిపేట..

నిజాం కాలం నాటి మోండా మార్కెట్‌ ఆదర్శంగా సమీకృత మార్కెట్లకు ప్రభుత్వం బీజం వేసింది. గజ్వేల్‌, సిద్దిపేట మార్కెట్లు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అదే విధంగా ఇతర పట్టణాల్లోనూ మార్కెట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. గజ్వేల్‌ మార్కెట్లు ప్రజలకు చేరువ కావటంతో వ్యాపార లావాదేవీలు గణనీయంగా జరుగుతున్నాయి. ఇక్కడ 240 స్టాళ్లతో ఏర్పాటు చేసిన మార్కెట్‌లో నిత్యం పది క్వింటాళ్ల కూరగాయాలు, నాలుగు క్వింటాళ్ల మాంసం, మూడు క్వింటాళ్ల పూలు, రెండు క్వింటాళ్ల వరకు పండ్లు విక్రయమవుతుండటం విశేషం. ఐఎస్‌వో సర్టిఫికెట్‌ పొందిన మార్కెట్లలో గజ్వేల్‌ మొదటిదైతే సిద్దిపేట రెండోదిగా నిలిచింది. సిద్దిపేట మార్కెట్లోని 217 దుకాణాల్లో వ్యాపారాలు సాగుతుండటం విశేషం. సాధారణ రోజుల్లో సగటున మూడు వేలమంది, ఆదివారాల్లో అయిదారువేల మంది ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని