రూ.లక్ష ఆర్థికసాయంపై 29న విధివిధానాల ఖరారు

రాష్ట్రంలో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం త్వరలో దరఖాస్తులు స్వీకరించనుంది.

Updated : 28 May 2023 05:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం త్వరలో దరఖాస్తులు స్వీకరించనుంది. తొలివిడత లబ్ధిదారులను ఎంపిక చేసి రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గాల వారీగా సహాయం పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం లక్షన్నర కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ మేరకు శనివారం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి సమావేశమయ్యారు. నాయీబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి, మేదరి, రజక, పూసల తదితర బీసీ కుల వృత్తిదారులను ఈ పథకంలో చేర్చాలని ప్రతిపాదించారు. రూ.లక్ష ఆర్థిక సహాయం ద్వారా వారికి మెరుగైన ఉపాధికి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ విషయంపై సోమవారం మరోసారి సమావేశమై తుది విధివిధానాలు రూపొందించి సీఎం ఆమోదానికి పంపుతామని మంత్రి గంగుల పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రాణి కుముదిని, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు