Raavi Narayana Reddy: పాత పార్లమెంటులో తొలి అడుగు తెలుగు ఎంపీదే

ఏడు దశాబ్దాలకుపైగా మన దేశ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా నిలిచిన పాత పార్లమెంటు భవనంలో ఎన్నో తెలుగు వెలుగులున్నాయి.

Updated : 28 May 2023 09:25 IST

నాడు చరిత్ర సృష్టించిన రావి నారాయణరెడ్డి  
తొలి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఓట్లు పొందినందుకు దక్కిన అవకాశం

ఈనాడు, దిల్లీ- చౌటుప్పల్‌, భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ఏడు దశాబ్దాలకుపైగా మన దేశ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా నిలిచిన పాత పార్లమెంటు భవనంలో ఎన్నో తెలుగు వెలుగులున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక ఎంపీగా ఆ భవనంలోకి తొలి అడుగుపెట్టే అవకాశం తెలుగుబిడ్డ రావి నారాయణరెడ్డికి దక్కడం విశేషం. ఈ నెల 28(ఆదివారం)న పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. స్వాతంత్య్రానంతరం 1951-52లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నెహ్రూ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న రావి నారాయణరెడ్డి అప్పట్లో నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి 3,09,162 ఓట్లు సాధించారు. ఆయన సమీప అభ్యర్థి వి.భాస్కర్‌రావు(కాంగ్రెస్‌)కు 86,882 ఓట్లు వచ్చాయి. రావి నారాయణరెడ్డికి 2,22,280 ఓట్ల మెజారిటీ దక్కింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ (పూల్‌పూర్‌) నుంచి పోటీ చేసిన నెహ్రూకు 2,33,571 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి కేఎంపీపీకి చెందిన బన్సీలాల్‌కు 59,642 ఓట్లు వచ్చాయి. నెహ్రూకు 1,73,929 ఓట్ల మెజారిటీ వచ్చింది. దాంతో నెహ్రూ చొరవతో... రావి నారాయణరెడ్డి నాడు పార్లమెంట్‌లోకి తొలి అడుగుపెట్టారు. ఈ ఘనతను పొందిన రావి నారాయణరెడ్డి సొంతూరు యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామం.

*  ప్రస్తుత లోక్‌సభలో మెజారిటీ పరంగా చూస్తే... 2019 ఎన్నికల్లో గుజరాత్‌లోని నవ్‌సారి స్థానంలో భాజపా అభ్యర్థి సీఆర్‌ పాటిల్‌ అత్యధికంగా 6,89,668 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పాటిల్‌కు 9,72,739 ఓట్లురాగా కాంగ్రెస్‌కు చెందిన డి.బి.పటేల్‌కు 2,83,071 ఓట్లు వచ్చాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని