ఆయన అసాధారణ వ్యక్తి

సినీ, రాజకీయ రంగాలపై ఎన్టీఆర్‌ తనదైన ముద్ర వేశారని, ఆయన అసాధారణ వ్యక్తి అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, జస్టిస్‌ చలమేశ్వర్‌ అన్నారు.

Updated : 28 May 2023 05:18 IST

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, జస్టిస్‌ చలమేశ్వర్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సినీ, రాజకీయ రంగాలపై ఎన్టీఆర్‌ తనదైన ముద్ర వేశారని, ఆయన అసాధారణ వ్యక్తి అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, జస్టిస్‌ చలమేశ్వర్‌ అన్నారు. ఎన్టీఆర్‌ - ఎ పొలిటికల్‌ బయోగ్రఫీ, ఎన్టీఆర్‌-రాజకీయ జీవిత చిత్రం- ఆత్మకథ అనే ఆంగ్ల, తెలుగు పుస్తకాలను సీనియర్‌ పాత్రికేయులు, ఎడిటర్‌ రామచంద్రమూర్తి రచించారు. వాటిని శనివారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఎమెస్కో పబ్లిషర్స్‌ అధినేత విజయ్‌కుమార్‌, ఎడిటర్‌ డా.చంద్రశేఖర్‌రెడ్డి, పౌర హక్కుల సంఘం నేత ఆచార్య హరగోపాల్‌లతో కలిసి న్యాయమూర్తులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ చలమేశ్వర్‌ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తని, ఆయన్ని దగ్గరి నుంచి చూశానన్నారు.  తన స్వగ్రామంలో నిర్మించిన ఇంట్లో చివరి నాలుగేళ్లు ఉంటానని, తాను 85 ఏళ్లు జీవిస్తానని ఎన్టీఆర్‌ చెప్పారని గుర్తు చేసుకున్నారు. రాముడు, రావణుడు పాత్రలలో మెప్పించారని, దేశ రాజధానిలో తెలుగు వారికి గుర్తింపు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు.

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ... పుస్తకంలో ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితాల్లోని అన్ని అంశాలను అద్భుతంగా వివరించారని అభినందించారు. సినిమాలతో ప్రేక్షకులను రంజింప చేయడమే కాకుండా, రాజకీయ జీవితంలో సంక్షేమ పథకాలతో పేద, బడుగు, బలహీనవర్గాలతో పాటు మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి, వారిని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయించారని గుర్తుచేశారు. పరిపాలనలోనూ ఎన్నో సంస్కరణలు ఎన్టీఆర్‌ తీసుకొచ్చారన్నారు. రామచంద్రమూర్తి మాట్లాడుతూ... మహనీయుడైన ఎన్టీఆర్‌పై మరిన్ని పుస్తకాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్‌ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని పుస్తకాల రూపంలో తీసుకురావడానికి మూడేళ్లు పట్టిందని వివరించారు. ఆయన ప్రజల్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడేవారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు