పోడు పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి

రాష్ట్రంలో జూన్‌ 24 నుంచి 30 వరకు పోడు పట్టాల పంపిణీ కోసం అధికారులు ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు.

Published : 28 May 2023 03:53 IST

మంత్రి సత్యవతి రాథోడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జూన్‌ 24 నుంచి 30 వరకు పోడు పట్టాల పంపిణీ కోసం అధికారులు ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు. మొత్తం 2845 తండాలు, గూడేల పరిధిలోని 1.5 లక్షల మంది ఆదివాసీ, గిరిజనులకు దాదాపు 4.01 లక్షల ఎకరాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మహిళాశిశు, గిరిజన సంక్షేమశాఖలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. శనివారం ఇక్కడ సచివాలయంలో గిరిజన సంక్షేమశాఖ క్రిస్టీనా, మహిళా శిశుసంక్షేమశాఖ కార్యదర్శి భారతి హోళికేరి, సీఎం కార్యదర్శి స్మితాసభర్వాల్‌, దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ బి.శైలజతో కలసి సమీక్ష నిర్వహించారు. గిరిజన సాంస్కృతిక ఉత్సవాలు, ఆర్ట్‌ ఫ్రేమ్‌ల ప్రదర్శన, గిరిజన ఉత్పత్తుల సదస్సు నిర్వహించాలని మంత్రి సూచించారు. గిరిజన విద్యాలయాలు, గురుకులాల్లో జూన్‌ 12న విద్యార్థులు, తల్లిదండ్రుల్ని భాగస్వామ్యం చేస్తూ జాతీయ పతాకాలు ఆవిష్కరించాలని, రెండోరోజున తెలంగాణ పోరాటాలు, ఏర్పాటు అంశాలపై సెమినార్లు, హరితహారం, గిరిజన విద్యాదినోత్సవం నిర్వహించాలని తెలిపారు.

సీమంతం.. అన్నప్రాశనలు

మహిళా శిశుసంక్షేమశాఖ వారోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కిశోర బాలికలకు పోషకాల కిట్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో హరితహారం, న్యూట్రిగార్డెన్లు ఏర్పాటు చేయాలన్నారు. మహిళల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంటింటికీ ప్రచారం చేపట్టాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని