నేతన్నల సంక్షేమానికి చర్యలు

నేతన్నల సంక్షేమానికి భారాస ప్రభుత్వం రూ.5,800 కోట్ల వ్యయం చేసిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శనివారం కోకాపేటలో పద్మశాలీ ఆత్మగౌరవ భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Updated : 28 May 2023 05:07 IST

పద్మశాలీ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.150 కోట్ల విలువైన స్థలం ఇచ్చాం
శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు

నార్సింగి, న్యూస్‌టుడే: నేతన్నల సంక్షేమానికి భారాస ప్రభుత్వం రూ.5,800 కోట్ల వ్యయం చేసిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శనివారం కోకాపేటలో పద్మశాలీ ఆత్మగౌరవ భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణానికి రెండున్నర ఎకరాలు, రూ.5 కోట్లు మంజూరు చేసిందన్నారు. ‘అద్భుతమైన భవనాన్ని నిర్మించాలి.. నిధులు సరిపోకుంటే సీఎంను అడుగుదాం. కోకాపేట అంటే చాలా విలువైన ప్రాంతం. ఈ స్థలం విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుంది. చాలా విలువైన స్థలాన్ని ముఖ్యమంత్రి అందించారు’ అని వివరించారు. నేత కార్మికుల రుణాల మాఫీ, హ్యాండ్లూం, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు విద్యుత్తు రాయితీ.. రైతు బీమా తరహాలో నేతన్న బీమా, ఇతర పథకాలు తెచ్చుకున్నామని చెప్పారు. చేనేత కార్మికుల కోసం ఇంకా ఏమైనా చేయాలని సీఎం నిరంతరం ఆలోచిస్తున్నారని వెల్లడించారు. వద్దని ఎంత చెప్పినా వినకుండా కేంద్ర ప్రభుత్వం నూలుపై జీఎస్టీ వేసిందని విమర్శించారు. మన జాతిపిత కొండా లక్ష్మణ్‌ బాపూజీని గౌరవించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు.

కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బలహీనవర్గాల్లో అక్షర చైతన్యం వెల్లివిరియడానికి 310 బీసీ గురుకులాలను నిర్వహిస్తూ ప్రపంచస్థాయి విద్యను అందిస్తోందన్నారు. ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల వారు చదువుకుని డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని ఆలోచించిన నాయకుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ హ్యాండ్లూం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ ఇవ్వాలి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2004కు ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన వారందరికి పాత పెన్షన్‌ ఇవ్వాలని, అందులో భాగంగా రాష్ట్రంలో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని మంత్రి హరీశ్‌రావుకు పీఆర్టీయూ నాయకులు శనివారం విన్నవించారు. శాసనసభ ఆమోదించినందున ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన ఆరోగ్య పథకం అమలు చేయాలని కోరగా త్వరలో ఆయా సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి భిక్షపతిగౌడ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని