గోరంట్ల బుచ్చిబాబు క్రియాశీల కుట్రదారు

దిల్లీ మద్యం విధానంలో సౌత్‌ గ్రూప్‌నకు ఆడిటర్‌గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబు క్రియాశీల కుట్రదారు అని సీబీఐ ఆరోపించింది.

Updated : 28 May 2023 04:37 IST

మద్యం విధాన రూపకల్పనకు తరచూ దిల్లీ ప్రయాణాలు
ముత్తా గౌతమ్‌ ఖాతా ద్వారా అభిషేక్‌ నుంచి రూ.55 లక్షల స్వీకరణ
రెండు ఫోన్లు ధ్వంసం చేసిన మనీశ్‌ సిసోదియా
సీబీఐ అదనపు ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం
సిసోదియా, బుచ్చిబాబు, దల్‌, అర్జున్‌పాండేలకు నోటీసులు

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం విధానంలో సౌత్‌ గ్రూప్‌నకు ఆడిటర్‌గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబు క్రియాశీల కుట్రదారు అని సీబీఐ ఆరోపించింది. ఈ కేసుపై 5,700 పేజీలతో అదనపు ఛార్జిషీట్‌ను సీబీఐ ఏప్రిల్‌ 25న దిల్లీ రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసింది. దీనికి సంక్షిప్తరూపంగా 54 పేజీల నివేదికను శనివారం న్యాయస్థానానికి సమర్పించింది. అదనపు ఛార్జిషీట్‌ను ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నిందితులు మనీశ్‌ సిసోదియా, గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్‌ పాండే, అమన్‌దీప్‌దల్‌ తదితరులకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు నిందితులంతా హాజరుకావాలని ఆదేశించింది.

బుచ్చిబాబుదే ప్రధాన పాత్ర

ఈ కేసులో బుచ్చిబాబు పాత్రను అదనపు ఛార్జిషీట్‌లో సీబీఐ వెల్లడించింది. ‘మద్యం విధాన రూపకల్పనలో సహ నిందితులైన అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ పిళ్లై, ముత్తా గౌతమ్‌లతో కలిసి గోరంట్ల బుచ్చిబాబు క్రియాశీల కుట్రదారు. మద్యం విధానంపై మంత్రుల బృందం నివేదిక తయారు చేసే సమయంలో, ఈ విధానంతో అనుచిత లబ్ధి పొందడంలో బుచ్చిబాబు చురుకైన పాత్ర పోషించారు. ఇందుకోసం రెండుమూడు సార్లు దిల్లీ ప్రయాణించాల్సి ఉందని బుచ్చిబాబు 2021, మార్చి 6న వాట్సప్‌ చాట్‌ చేశారు. ఇందుకు తగ్గట్లే 2021, మార్చి 6 నుంచి 9 వరకు విజయ్‌ నాయర్‌ హైదరాబాద్‌కు ప్రయాణాలు చేశారు. అనంతరం బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ పిళ్లై, శరత్‌ చంద్రారెడ్డి దిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో మార్చి 14 నుంచి 17 వరకు మకాం వేశారు. ఆ తర్వాత నుంచి బుచ్చిబాబు తరచూ దిల్లీ ప్రయాణాలు చేశారు. సౌత్‌ గ్రూప్‌ సూచించిన పలు నిబంధనలు మంత్రుల బృందం తమ నివేదికలో పొందుపర్చినట్లు బుచ్చిబాబు వాట్సప్‌ ఛాట్‌ నుంచి సేకరించాం’ అని సీబీఐ పేర్కొంది.

నిధుల స్వీకరణ....

‘2021 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో బుచ్చిబాబు.. బోయినపల్లి అభిషేక్‌ నుంచి ఇండియా ఎహెడ్‌ డైరెక్టర్‌ ముత్తా గౌతమ్‌ ఖాతా ద్వారా రూ.55 లక్షలు స్వీకరించారు. గౌతమ్‌ ఖాతా నుంచి రూ.15 లక్షలు బుచ్చిబాబు ఖాతాకు జమయ్యాయి. 2021, సెప్టెంబరు 27న అభిషేక్‌ ఖాతా నుంచి గౌతమ్‌ ఖాతాకు రూ.1.30 కోట్లు బదిలీ అయ్యాయి. అదే రోజు బుచ్చిబాబు ఖాతాకు గౌతమ్‌ రూ.40 లక్షలు బదిలీ చేశారు. ఇండియా ఎహెడ్‌ ప్రెసిడెంట్‌గా అర్జున్‌ పాండే ఉన్న సమయంలో ఇండోస్పిరిట్‌కు రూ.70 లక్షలు బదిలీ చేశారు. అనంతరం ఇండో స్పిరిట్‌ నుంచి రూ. కోటి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్‌ ఖాతాకు బదిలీ అయ్యాయి.

* దిల్లీ మద్యం విధానం రూపకల్పనకు ప్రధాన సూత్రధారి మనీశ్‌ సిసోదియా. 2022 జులై 22కు ముందు వాడిన రెండు మొబైల్‌ ఫోన్లను ఆయన ధ్వంసం చేశారు. ప్రైవేటు హోల్‌సేల్‌ వ్యాపారులకు మార్జిన్‌ను 5 నుంచి 12 శాతానికి పెంచారు. కొవిడ్‌ తీవ్రంగా విజృంభించిన సమయంలో హడావిడిగా మద్యం విధాన్ని రూపొందించారు’ అని సీబీఐ ఛార్జిషీట్‌లో వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు