గీత బీమా అమలు దిశగా అడుగులు

రాష్ట్రంలో కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు బృంద జీవితబీమా పథకం వర్తింపజేసేందుకు ఆబ్కారీశాఖ కసరత్తు మొదలుపెట్టింది.

Updated : 29 May 2023 04:45 IST

కార్మికుల వివరాల సేకరణలో ఆబ్కారీశాఖ నిమగ్నం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు బృంద జీవితబీమా పథకం వర్తింపజేసేందుకు ఆబ్కారీశాఖ కసరత్తు మొదలుపెట్టింది. రైతు బీమా తరహాలోనే ‘గీత బీమా’ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 2న నిర్వహించిన సమీక్షలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కింద గీత వృత్తిపై ఆధారపడిన కార్మికులు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తారు. ఈ పథకం కోసం  ఆబ్కారీశాఖ ప్రత్యేక కార్యాచరణలో నిమగ్నమైంది. తాటి, ఈతచెట్లు గీయడమే జీవనాధారంగా ఉన్న కార్మికుల వివరాలు సేకరించడంపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వృత్తిలో ఉన్నవారి వివరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. వారిలో ప్రస్తుతం జీవించి ఉన్న వారి వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఈమేరకు ఆబ్కారీశాఖ సంచాలకుడు సర్ఫరాజ్‌ అహ్మద్‌ రెండు రోజుల క్రితం అన్ని జిల్లాల ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 30లోగా గీతకార్మికుల ఆధార్‌, నామినీ వివరాలను సేకరించి ప్రత్యేక ఫార్మాట్‌లో పంపాలని ఆయన ఆదేశించారు.

బార్ల లైసెన్స్‌ ఉత్తర్వుల జారీ...

తెలంగాణలో బార్ల లైసెన్స్‌ విధానంలో సవరణలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. అవి మే 10 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై తొలివిడత రెన్యువల్‌ రుసుం, నాలుగోవంతు బ్యాంకు పూచీకత్తుతోపాటు ట్రేడ్‌ లైసెన్స్‌ను నిర్ధారించే పత్రం సమర్పిస్తే సరిపోతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టర్నోవర్‌తో సంబంధం లేకుండా స్పెషల్‌ బార్‌ ఎక్సైజ్‌ టాక్స్‌ కింద రూ.2లక్షలు ఒకసారి చెల్లించాలని స్పష్టంచేశారు. గతంలో 15.3%గా ఉన్న టర్నోవర్‌ ట్యాక్స్‌శాతాన్ని 10శాతానికి తగ్గించడంతోపాటు టర్నోవర్‌ ట్యాక్స్‌ పరిమితిని 5 రెట్ల నుంచి 7రెట్లకు పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని