దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు?

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 544 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (లెక్చరర్‌), ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు.

Published : 29 May 2023 04:16 IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పోస్టులపై సందిగ్ధం
ప్రతిపాదనలపై స్పష్టత ఇవ్వని విద్యాశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 544 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (లెక్చరర్‌), ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. దాదాపు అయిదునెలల క్రితం ఉద్యోగ ప్రకటన వెలువడినప్పటికీ, సాంకేతిక కారణాల పేరిట రెండుసార్లు వాయిదా పడింది. ఉద్యోగ ప్రకటన జారీకి ఖాళీల ప్రతిపాదనలు అందించిన కళాశాల విద్యాశాఖ, పోస్టుల భర్తీకి సబ్జెక్టులు, ఇంటర్వ్యూ తదితర నిబంధనలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ మొదలు కాలేదు. మరోవైపు గురుకుల నియామక బోర్డు ఆధ్వర్యంలో సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 868 లెక్చరర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. త్వరలోనే రాతపరీక్షల షెడ్యూలు వెల్లడికానుంది. కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈ పోస్టులకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 544 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన (నం.33/2022) జారీ చేసింది. లెక్చరర్‌ పోస్టులు 491 ఉంటే, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు 29, లైబ్రేరియన్‌ పోస్టులు 24 ఉన్నాయి. ఈ పోస్టులకు సమగ్ర ప్రకటన జారీకి మరిన్ని వివరాలు కావాలని కమిషన్‌ కోరింది. ఆ ప్రతిపాదనలు ఇవ్వడంలో కళాశాల విద్యాశాఖ ఆలస్యం చేసింది. లెక్చరర్‌ పోస్టులకు మెథడాలజీ వివరాలు ఇవ్వలేదు. తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. కళాశాలల నుంచి వివరాలు రాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మరోసారి మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 9 వరకు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ వివరాలు రాకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని కమిషన్‌ తెలిపింది. ఇప్పటికీ ఆ వివరాలు రాలేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని