పంచాయతీలపై ట్రాక్టర్ల రుణభారం

గద్వాల జిల్లా ఈర్లబండ పంచాయతీలో మూడేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకు నుంచి రూ.6.5 లక్షల రుణం తీసుకొని ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు.

Updated : 29 May 2023 04:37 IST

కిస్తీల చెల్లింపులకు ఇక్కట్లు
807 చోట్ల ఓవర్‌డ్యూ..
ఆదాయం లేదంటున్న సర్పంచులు

గద్వాల జిల్లా ఈర్లబండ పంచాయతీలో మూడేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకు నుంచి రూ.6.5 లక్షల రుణం తీసుకొని ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. ప్రతి నెలా రూ.19 వేల చొప్పున కిస్తీ (ఈఎంఐ) కట్టాలి. దాదాపు మూడు నెలలుగా చెల్లించకపోవడంతో అధికారులు ఓవర్‌డ్యూగా పేర్కొంటూ అప్పు చెల్లించాలని సూచించారు. అదే జిల్లాలోని సింగవరం, డోర్నాల, గార్లపాడు, జాంపల్లి, మానాపూర్‌ తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ ఒక్క జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా 807 గ్రామాలు ఇదే మాదిరిగా ట్రాక్టర్ల అప్పులను చెల్లించలేక అవస్థలు పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల నిధులు సకాలంలో అందకపోవడంతోపాటు సొంత ఆదాయ వనరులు లేకపోవడంతో పంచాయతీలు ట్రాక్టర్ల అప్పుల కిస్తీలను చెల్లించలేక చేతులెత్తేస్తున్నాయి. వస్తు, సరకు, నీటి రవాణా కోసం పంచాయతీలకు సొంతంగా ట్రాక్టర్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయించింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ట్రాక్టర్లు, ట్రాలీలు, నీటి ట్యాంకర్లను కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీలు బ్యాంకులకు దరఖాస్తు చేసుకొని రుణాలు పొందాయి. రూ.6.50 లక్షల నుంచి రూ.పది లక్షల వరకు వీటి కోసం రుణం తీసుకున్నాయి.


528 పంచాయతీలే పూర్తిగా చెల్లించాయి.. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు 5,751 పంచాయతీలు రుణంతో ట్రాక్టర్లు పొందాయి. ఇందులో 528 పంచాయతీలు పూర్తిగా రుణం చెల్లించాయి. మిగిలిన వాటిలో కొన్ని మినహా ట్రాక్టర్లను పొందిన చాలా వాటికి కిస్తీల చెల్లింపులు భారంగా మారాయి. నిధులు లేకపోయినా కొందరు సర్పంచులు చెక్కులను బ్యాంకులకు పంపిస్తున్నారు. ఆ చెక్కులు చెల్లక బ్యాంకులు పంచాయతీలకు నోటీసులు ఇస్తున్నాయి. కిస్తీలు సరిగా చెల్లించని అంశంపై కలెక్టర్లు, రాష్ట్ర పంచాయతీరాజ్‌ అధికారులకు సమాచారం ఇస్తుండగా.. వారి నుంచి గ్రామాలకు లేఖలు వస్తున్నాయి. తాజాగా 807 పంచాయతీలు వెంటనే రూ.2.12 కోట్ల రుణ బకాయిలు, కిస్తీలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిధుల కొరత వల్ల కిస్తీలు చెల్లించలేకపోతున్నామని సర్పంచులు చెబుతున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నెలనెలా పంచాయతీలకు నిధులను విడుదల చేయాల్సి ఉండగా.. మూడు నుంచి ఆరు నెలల జాప్యం జరుగుతోందని వెల్లడిస్తున్నారు. ట్రాక్టర్ల కిస్తీలే కాదు.. ఇతర పనులకూ ఇబ్బందిగా ఉందని పేర్కొంటున్నారు.


జిల్లాలవారీగా ఓవర్‌డ్యూ పంచాయతీల సంఖ్య

సూర్యాపేట జిల్లాలో 75, కామారెడ్డి 74, నిజామాబాద్‌ 67, మహబూబ్‌నగర్‌ 60, ఆదిలాబాద్‌ 58, జనగామ 52, సంగారెడ్డి 52, యాదాద్రి భువనగిరి 44, ఆసిఫాబాద్‌ 41, నిర్మల్‌ 41, నాగర్‌కర్నూల్‌ 36, జోగులాంబ గద్వాల 29,  ఖమ్మం 27, సిద్దిపేట 25, మెదక్‌ 17,  జగిత్యాల 16, కరీంనగర్‌ 16, నల్గొండ 15, జయశంకర్‌ భూపాలపల్లి 10, ములుగు 10, పెద్దపల్లి 9, హనుమకొండ 6, రాజన్న సిరిసిల్ల 5, వికారాబాద్‌ 5, వనపర్తి 5, మహబూబాబాద్‌ 4, వరంగల్‌ 3, నారాయణపేట 2, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మేడ్చల్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.


ట్రాక్టర్ల కిస్తీలు ప్రభుత్వమే చెల్లించాలి

-ఉప్పుల అంజనీప్రసాద్‌, రాష్ట్ర సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షుడు

ట్రాక్టర్లతో సేవలు అందుతున్నా.. వాటి నిర్వహణ పంచాయతీలకు భారంగా మారింది. డ్రైవర్లకు జీతాలు, డీజిల్‌ ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడింది. కిస్తీలు చెల్లించడానికి నిధులు లేవు. వడ్డీలు భారమయ్యాయి. ప్రభుత్వమే కిస్తీలు చెల్లించి.. పంచాయతీలకు రుణభారం నుంచి విముక్తి కలిగించాలి.
- ఈనాడు, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని