పదేళ్లలో విద్యుత్ డిమాండ్ రెట్టింపు
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పదేళ్లలో రెట్టింపు కానుంది. ప్రస్తుత ఏడాది(2023-24) రాష్ట్ర విద్యుత్ వినియోగం 70 వేల మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉంటుందని అంచనా.
సరఫరాకు రూ.37,911 కోట్లు అవసరం
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది
ఈఆర్‌సీకి డిస్కంల నివేదికలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పదేళ్లలో రెట్టింపు కానుంది. ప్రస్తుత ఏడాది(2023-24) రాష్ట్ర విద్యుత్ వినియోగం 70 వేల మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉంటుందని అంచనా. ప్రస్తుతం కొరత లేదు. అవసరమైనంత కరెంటు సరఫరాకు ఒప్పందాలున్నాయి. కానీ, 2033-34లో రాష్ట్ర అవసరాలకు లక్షా 40 వేల ఎంయూలకు పైగా కరెంటు అవసరమని, అందులో 25,981 ఎంయూల కొరత ఉంటుందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తాజాగా అంచనా వేశాయి. ప్రతి అయిదేళ్ల కాలానికి ‘కంట్రోల్ పీరియడ్’ పేరుతో భవిష్యత్తు అవసరాలకు అంచనాలు వేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్ల(2024-29) తొలి కంట్రోల్ పీరియడ్, ఆ తరవాత మలి కంట్రోల్ పీరియడ్(2029-34)కి విద్యుత్ డిమాండ్, కొరత, ఎంత అదనంగా కొనాల్సి ఉంటుందనే దక్షిణ, ఉత్తర తెలంగాణ డిస్కంలు అంచనాలను తయారు చేసి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి తాజాగా నివేదికలు అందజేశాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల ఆధునికీకరణకు రాబోయే పదేళ్లలో అదనంగా రూ.37,911 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపాయి. కొత్తగా నిర్మించే విద్యుదుత్పత్తి కేంద్రాలతో ‘విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు’(పీపీఏ) చేసుకోవాల్సి ఉంటుందనీ వివరించాయి.
పెరగనున్న కరెంటు కొరత నేపథ్యంలో పీపీఏలు చేసుకోవడానికి, అవసరమైన కరెంటు కొనడానికి అనుమతించాలని ఈఆర్‌సీని కోరాయి. ఈ నివేదికలను మండలి తాజాగా విడుదల చేసింది. డిస్కంలు వేసిన అంచనాలు, కరెంటు కొనుగోలు లెక్కలపై ప్రజలు అభ్యంతరాలు, సూచనలు జూన్ 4లోగా తెలియజేయాలని ఈఆర్‌సీ కోరింది. ఆ తరవాత విచారణ జరిపి వాటిపై తుది ఆదేశాలు ఇవ్వనుంది.
నివేదికల్లోని ముఖ్యాంశాలు..
* ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఉంది. దీని స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 4 వేల మెగావాట్లు. ఇది పూర్తయితే వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) నుంచి 52,970 ఎంయూల కరెంటు రాష్ట్రానికి సొంతంగా సరఫరా చేయనుంది. ఈ సంస్థ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి సరఫరా సామర్థ్యం 2028-29 నాటికి 58,940 ఎంయూలకు పెరగనుంది. జలవిద్యుత్ కేంద్రాల నుంచి మాత్రం 3,443 ఎంయూలే వస్తుందని అంచనా.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ కేంద్రాలన్నీ కలిపి 2033-34లో లక్షా 14 వేల ఎంయూలు సరఫరా చేయగలవు. కానీ, అప్పటికి రాష్ట్ర అవసరాలకు లక్షా 40 వేల ఎంయూలు అవసరమని, అంతమేర కొనుగోలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి.
* మొదటి కంట్రోల్ పీరియడ్(2024-29)లో రాష్ట్ర అవసరాలకు మించి మిగులు విద్యుత్ అందుబాటులో ఉంటుందని, రెండో కంట్రోల్ పీరియడ్(2029-34)లో మాత్రం ఏటా కరెంటు కొరత పెరుగుతుందని అంచనా. ఈ కొరతను అధిగమించడానికి బహిరంగ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కరెంటు కొనాల్సి ఉంటుంది.
డిమాండ్ ఎందుకు పెరుగుతుందంటే..
రాష్ట్రంలో ఐటీ సహా పలు పరిశ్రమలు పెద్దఎత్తున రానున్నాయి. పాలమూరు-రంగారెడ్డి, సీతారామసాగర్ వంటి ఎత్తిపోతల పథకాలతో పాటు వ్యవసాయ కరెంటు వినియోగం కూడా అధికంగా ఉంటుంది. దీనికితోడు విద్యుత్ వాహనాలు, రైల్వే నెట్‌వర్క్‌కు సైతం అదనంగా కరెంటు అవసరం.
2030 నాటికి 22 వేల మెగావాట్లకు పైగా గరిష్ఠ డిమాండ్
రాష్ట్ర విద్యుత్ డిమాండ్ శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజూవారీ గరిష్ఠ డిమాండ్ 15,500 మెగావాట్లుంది. ఇది 2030 నాటికి 22 వేల మెగావాట్లు దాటుతుందని అంచనా వేశాం. థర్మల్ విద్యుత్ కేంద్రాలను కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేకున్నా కేంద్ర సంస్థల నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొనుగోలుకే కాకుండా పంపిణీ, సరఫరా వ్యవస్థలో భాగంగా కొత్త సబ్‌స్టేషన్లు, లైన్ల నిర్మాణం, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు నిధులు సమకూర్చుకోవాలి. 24 గంటలూ నిరంతర నాణ్యత సరఫరా చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
దేవులపల్లి ప్రభాకరరావు, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్
-
Motkupalli: జగన్.. నీ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు: మోత్కుపల్లి
-
Nara Lokesh: వచ్చేవారం నారా లోకేశ్ ‘యువగళం’ తిరిగి ప్రారంభం..!
-
Yanamala: ప్రభుత్వానివి చందమామ కథలు.. సీఐడీవి చిలకపలుకులు: యనమల
-
UPPAL Stadium: ఆటతో అదిరేలా.. ఉప్పల్ ఊగేలా!
-
Kushi Ott Release: ఓటీటీలోకి ‘ఖుషి’ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?