గలగలా గోదారి.. బిరబిరా కృష్ణమ్మ!

గోదావరి చరిత్రలో అత్యధిక నీరు లభించిన నీటి ఏడాదిగా ఈ నెలాఖరుతో ముగియనున్న 2022-23 సంవత్సరం నిలవనుంది.

Updated : 30 May 2023 07:02 IST

ప్రధాన నదుల్లో నీటి లభ్యతలో ఈ ఏడాది రికార్డు
రెండింట్లో కలిపి ఈసారి సముద్రంలోకి 7,582 టీఎంసీలు
అనూహ్యంగా అడుగంటిన శ్రీశైలం ప్రాజెక్టు

గోదావరి చరిత్రలో అత్యధిక నీరు లభించిన నీటి ఏడాదిగా ఈ నెలాఖరుతో ముగియనున్న 2022-23 సంవత్సరం నిలవనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం నుంచి బంగాళాఖాతంలోకి వదిలిన నీటిని, ఎగువన రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటి వినియోగాన్ని, ప్రాజెక్టుల్లో ప్రస్తుత నిల్వలను పరిగణనలోకి తీసుకొంటే గతంలోని అన్ని రికార్డులను ఈ ఏడాది బద్ధలు కొట్టింది. కృష్ణాలోనూ అత్యధిక నీటి లభ్యతతో ముగియనున్న నీటి సంవత్సరమూ ఇదే కావడం విశేషం. అయితే... కొత్త నీటి సంవత్సరం ప్రారంభం నాటికి కనీస నీటిమట్టం వరకు కూడా నిల్వలు లేని ప్రాజెక్టుగా శ్రీశైలం నిలవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుత నీటి సంవత్సరంలో 2022 జూన్‌ 1 నుంచి ఈ ఏడాది మే 29 వరకు

గోదావరి నుంచి 6,250, కృష్ణా నుంచి 1,332 మొత్తంగా 7,582 టీఎంసీలు బంగాళాఖాతంలోకి వెళ్లాయి. ఇదికాకుండా 1990-91లో 7,749 టీఎంసీలు, 1975-76లో 7094 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. ప్రస్తుత ఏడాది కంటే 1990-91లో గోదావరి నుంచి 249 టీఎంసీలు ఎక్కువగా వెళ్లాయి. అయితే... ఆ ఏడాది నీటి వినియోగం ప్రస్తుతమున్నంతగా లేదు. గోదావరిలో శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరామసాగర్‌ వరద కాలువ, శ్రీరామసాగర్‌ రెండోదశ, మధ్యమానేరు, దేవాదుల, కాళేశ్వరంతోపాటు చిన్ననీటి వనరులు, మిషన్‌ భగీరథ ఇలా వీటన్నింటి కింద జరిగిన వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొంటే గోదావరిలో అత్యధిక నీటి లభ్యత ఉన్న సంవత్సరం ఇదేనని నీటిపారుదల శాఖ వర్గాలు స్పష్టంచేశాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ నుంచే 4,666 టీఎంసీలను దిగువకు వదిలారు.

* ప్రస్తుత నీటి సంవత్సరంలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 405, నారాయణపూర్‌ డ్యాం నుంచి 700 టీఎంసీలు వదిలినా... భీమా, తుంగభద్ర నదులకు భారీ వరద రావడంతో శ్రీశైలంలోకి మొత్తంగా 2,040 టీఎంసీల నీరు చేరి గత రికార్డులను అధిగమించింది. స్థానికంగా కురిసిన భారీ వర్షాలు ఇందుకు దోహదం చేశాయి.

అత్యధిక రోజులు గేట్లెత్తిందీ ఈ సంవత్సరమే..

అన్ని ప్రధాన ప్రాజెక్టుల గేట్లను అత్యధిక రోజులు పైకెత్తి దిగువకు నీటిని వదిలిన సంవత్సరమూ ఇదే. గోదావరిలో... శ్రీరామసాగర్‌, ఎల్లంపల్లి, మేడిగడ్డ, ధవళేశ్వరం, కృష్ణా బేసిన్‌లో... జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల, ప్రకాశం ఇలా అన్ని ప్రాజెక్టుల నుంచి చాలాసార్లు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. సాధారణంగా నదుల్లో ప్రవాహం జులై నుంచి అక్టోబరు వరకు ఎక్కువగా, నవంబరు వరకు సాధారణంగా, డిసెంబరు నుంచి నామమాత్రంగా ఉంటుంది. గోదావరిలో ఈ ఏడాది మార్చి మొదటి వారం వరకు ప్రవాహముంది. జనవరి వరకు రోజూ మూడు, నాలుగు టీఎంసీలు ఉంటే, తర్వాతా ఒకట్రెండు టీఎంసీలు ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు 76 రోజులు శ్రీశైలం గేట్లు ఎత్తారు. అంటే సుమారు రెండున్నర నెలలు శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉన్నట్లు లెక్క. అయితే శ్రీశైలంలోకి 2,040 టీఎంసీల నీరొచ్చినా ప్రస్తుతం 809.80 అడుగులతో అడుగంటిపోయింది. మళ్లీ కొత్తగా వచ్చే నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

 ఈనాడు, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు