తెలంగాణ వర్సిటీలో రచ్చ.. రచ్చ
తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ నియామకంపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వానికీ తలనొప్పి వ్యవహారంగా మారింది.
వీసీ నియమించిన రిజిస్ట్రార్‌ను అంగీకరించని ఈసీ
ఈసీ నియమించిన రిజిస్ట్రార్‌ను ఒప్పుకోని వీసీ
రెండేళ్లలో తొమ్మిదిసార్లు మార్పు.. నెల రోజుల్లోనే ముగ్గురు..
తాజాగా కుర్చీ కోసం యాదగిరి, కనకయ్యల వాగ్వాదం
ఈనాడు-హైదరాబాద్, నిజామాబాద్, తెవివి-న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ నియామకంపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వానికీ తలనొప్పి వ్యవహారంగా మారింది. ఉపకులపతి(వీసీ) నియమించిన రిజిస్ట్రార్‌ను పాలకమండలి(ఈసీ) ఒప్పుకోకపోవడం.. ఈసీ నియమించిన రిజిస్ట్రార్‌ను వీసీ అంగీకరించకపోవడం.. ఇలా రెండేళ్లుగా ఇదే తంతుగా సాగుతోంది. వర్సిటీలో రెండేళ్లలో ఏకంగా తొమ్మిదిసార్లు రిజిస్ట్రార్లు మారారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఎప్పుడు, ఎవరు నియమితులవుతారో.. ఎప్పుడు పదవి నుంచి వైదొలుగుతారో తెలియని పరిస్థితి నెలకొంది. వర్సిటీ ఉపకులపతి(వీసీ)గా ఓయూ ఆచార్యుడు రవీందర్ గుప్తా 2021 మే నెలలో నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల్లోనే రిజిస్ట్రార్‌గా ఉన్న ఆచార్య నసీమ్‌ను తొలగించి ఆ స్థానంలో కనకయ్యను నియమించారు. ఆ తర్వాత నుంచి ఈసీ సభ్యులు, వీసీ మధ్య విభేదాల కారణంగా తరచూ రిజిస్ట్రార్లను మారుస్తూ వచ్చారు. గత నెల రోజుల్లోనే నిర్మలాదేవి, ఆ తర్వాత యాదగిరి, అనంతరం కనకయ్య.. అంటే ముగ్గురు మారారు. తాజాగా మరోసారి ‘రిజిస్ట్రార్‌ను నేనంటే.. నేను..’ అంటూ ఇద్దరు ఆచార్యులు యాదగిరి, కనకయ్యలు.. ఆ కుర్చీలో కూర్చోవడానికి వచ్చి వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది. వారికి విద్యార్థి, కుల సంఘాలు వేర్వేరుగా మద్దతు పలకడం.. వారు సైతం రిజిస్ట్రార్ ఛాంబర్‌లోకి రావడంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల వరకు వాగ్వాదాలు, అరుపులతో వర్సిటీ దద్దరిల్లింది. విశ్వవిద్యాలయం పరువు మరోసారి బజారున పడింది.
ఆర్డర్ కాపీ చూపించాలన్న కనకయ్య
వర్సిటీ రిజిస్ట్రార్‌గా యాదగిరిని పాలకమండలి(ఈసీ) నియమించగా.. కనకయ్యను ఉపకులపతి నియమించిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటలకు ఆచార్య యాదగిరి రిజిస్ట్రార్ ఛాంబర్‌కు వచ్చి కుర్చీలో కూర్చున్నారు. గంట తర్వాత కొందరు ఉద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులతో కలిసి ఆచార్య కనకయ్య ఛాంబర్‌లోకి వచ్చారు. ‘రిజిస్ట్రార్‌గా మీరు నియమితులైనట్లు ఆర్డర్ కాపీ ఉందా’ అంటూ యాదగిరిని ఆయన అడిగారు. తనను పాలకమండలి నియమించిందని, రిజిస్ట్రార్‌ను నియమించే అధికారం ఈసీకే ఉంటుందని.. ప్రత్యేకంగా ఆర్డరు కాపీ అవసరం లేదని యాదగిరి సమాధానమిచ్చారు. దీంతో సంతృప్తి చెందని కనకయ్య.. తనను నియమిస్తూ ఉపకులపతి ఇచ్చిన ఉత్తర్వు కాపీని చూపారు. ఆర్డర్ కాపీ లేనందున కుర్చీలో కూర్చోవడం సరికాదంటూ యాదగిరితో అన్నారు.
రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం
వాదోపవాదాల అనంతరం ఇరుపక్షాలు ఓ ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు రిజిస్ట్రార్, వీసీ కార్యాలయాలకు తాళం వేసి వర్సిటీ పాలనను స్తంభింపజేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. దీనికి అంగీకరించిన ఇరువర్గాలవారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రిజిస్ట్రార్ కార్యాలయానికి వర్సిటీ సిబ్బందే తాళం వేశారు. అయితే సోమవారం వీసీ రాకపోవటంతో ఆయన ఛాంబర్ తాళం తెరవలేదు.
ప్రభుత్వ హెచ్చరికలూ బేఖాతరు..
విశ్వవిద్యాలయ పాలకమండలి ఆదేశాలను ఉపకులపతి పాటించాల్సిందేనని, రిజిస్ట్రార్ నియామక అధికారం ఈసీదేనని స్పష్టం చేస్తూ ప్రభుత్వం లేఖ రాసినా.. ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించినా.. రవీందర్ గుప్తా బేఖాతరు చేస్తున్నారు. రిజిస్ట్రార్‌ను నియమించే అధికారం వీసీగా తనకే ఉందని, పాలకమండలి కేవలం ర్యాటిఫై మాత్రమే చేస్తుందని వాదిస్తున్నారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్‌పై ఆయన బహిరంగంగా విమర్శలు చేయడం కలకలం సృష్టించింది. మరోవైపు, ఉపకులపతి రవీందర్ గుప్తా పొరుగు సేవల కింద ఇష్టారాజ్యంగా వందల మంది సిబ్బందిని నియమించారని, పలు వస్తువుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. దానిపై ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిరుడు జూన్‌లో ఓ కమిటీని నియమించింది. విచారణ జరిపిన కమిటీ నివేదిక ఇచ్చింది.
నా విధులకు ఆటంకం కలిగింది: ఆచార్య యాదగిరి
ప్రభుత్వ ఆదేశాలతో పాలకమండలి(ఈసీ) నన్ను నియమించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యతలు చేపట్టి.. సోమవారం రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చున్నాను. ఆచార్య కనకయ్య కొందరితో కలిసి వచ్చి.. వాదనకు దిగారు. దీంతో నా విధులకు ఆటంకం కలిగింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.
దళితుడికి అవమానం: ఆచార్య కనకయ్య
నన్ను రిజిస్ట్రార్‌గా వీసీ నియమించారు. రెండు రోజులు ఆ హోదాలో కొనసాగాను. మూడు నెలల కాలం ఇన్‌ఛార్జిగా ఉంటాను. పాలకమండలి ఆమోదించకుంటే బాధ్యతల నుంచి తప్పుకొంటాను. ఈరోజు యాదగిరి వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నారు. ఇది దళితుడినైన నన్ను అవమానించటమే అవుతుంది. నాకు వీసీ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఉండగా ఆయన కూర్చోవడం సరికాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijay Antony: కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని!
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ