సిట్‌ నివేదిక వచ్చాకే ఫలితాలు!

రాతపరీక్షలు పూర్తయిన మూడు ఉద్యోగ నోటిఫికేషన్ల  తదుపరి ప్రక్రియలు.. ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తు తుది నివేదిక వచ్చేవరకు నిలిచిపోనున్నాయి.

Published : 30 May 2023 05:07 IST

ఎంపికలు ప్రారంభిస్తే న్యాయ ఇబ్బందులు?
పూర్తయిన 3 రాత పరీక్షల తదుపరి ప్రక్రియపై టీఎస్‌పీఎస్సీ యోచన
పరీక్ష రాసిన అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: రాతపరీక్షలు పూర్తయిన మూడు ఉద్యోగ నోటిఫికేషన్ల  తదుపరి ప్రక్రియలు.. ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తు తుది నివేదిక వచ్చేవరకు నిలిచిపోనున్నాయి. సిట్‌ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఫలితాలు వెల్లడించి, తుది ఎంపికలు చేపట్టడం న్యాయసూత్రాలకు విరుద్ధమని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. సాంకేతిక, న్యాయ ఇబ్బందులూ తలెత్తవచ్చని అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో  పూర్తివివరాలు వెల్లడయ్యేవరకు వేచిచూడాలని భావిస్తోంది. నిందితులు ఏయే ప్రశ్నపత్రాలు లీక్‌ చేశారు? ఎంతమంది కొనుగోలు చేశారనే విషయాలపై సిట్‌ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయా పరీక్షల ఫలితాల కోసం వేల మంది అభ్యర్థులు ఎదురుచూడాల్సి వస్తోంది.

* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లో 24 పోస్టులకు గత ఏడాది జులైలో టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. 16,381 మంది దరఖాస్తు చేయగా.. వారికి గత నవంబరులో రాతపరీక్ష నిర్వహించి, డిసెంబరులో మెరిట్‌ జాబితా ప్రకటించారు. ఈ పోస్టులకు 1:2 నిష్పత్తిలో తుదిఎంపిక జాబితా ప్రకటిస్తామని కమిషన్‌ వెల్లడించింది. తర్వాత గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసు శాఖలోనూ ఇదే విధానం అమలవుతున్నందున అన్ని నియామకాల్లోనూ ఈ పద్ధతి అవలంబించాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఐపీఎం పోస్టుల ఫలితాలు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పోస్టులకు తుది జాబితా ప్రకటన మరింత ఆలస్యమవుతోంది.

* మహిళా శిశు సంక్షేమశాఖలో సీడీపీవో, శిశుసంక్షేమాధికారులు, విస్తరణ అధికారుల (గ్రేడ్‌-1) పోస్టుల భర్తీకి గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో కమిషన్‌ రెండు ఉద్యోగ ప్రకటనలు జారీచేసింది. ఈ పోస్టులకు ఈ ఏడాది జనవరిలో రాత పరీక్షలు జరిగాయి. ఈ విభాగంలో 23 సీడీపీవో, శిశుసంక్షేమాధికారుల పోస్టులకు 19,184 మంది, 181 గ్రేడ్‌-1 విస్తరణ అధికారుల (సూపర్‌వైజర్‌) పోస్టులకు 26,752 మంది దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలకు ప్రాథమిక కీ కూడా వెల్లడైంది. తుది కీ జారీ చేసి, మెరిట్‌ జాబితా ప్రకటించాల్సి ఉంది.


వీలైనంత త్వరగా సీబీఆర్‌టీ పరీక్షల ఫలితాలు!

ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం నిర్వహిస్తున్న పునఃపరీక్షలు, రీషెడ్యూలు అయిన పరీక్షలకు కమిషన్‌ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు(సీబీఆర్‌టీ) నిర్వహిస్తోంది. పరీక్షల్లో మరింత పారదర్శకతతో పాటు వేగంగా ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తోంది. సిట్‌ దర్యాప్తుతో సంబంధం లేని రాత పరీక్షలకు సీబీఆర్‌టీ పరీక్షలు  పూర్తయిన నెల నుంచి 45 రోజుల్లోగా మెరిట్‌ జాబితాలు ప్రకటించేలా చర్యలు తీసుకుంటోంది. అనంతరం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించనుంది. ఈ పరిశీలన పూర్తయిన 15 రోజుల్లోగా తుది ఎంపిక జాబితాలు ప్రకటించాలని భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని