పోలీస్‌ శాఖలో వసూల్‌రాజా!

పోలీస్‌ శాఖలో ఆయనో కీలకాధికారి. ఎస్పీల కార్యకలాపాలను పర్యవేక్షించే ఉన్నత హోదాలో పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పదోన్నతి పొందడంతో ఆ కీలక బాధ్యతల్లో చేరారు.

Updated : 30 May 2023 06:29 IST

స్టేషన్ల నిర్వహణ నిధుల్లో వాటా
నాలుగు నెలల సొమ్ములో ఒక నెల ఇవ్వాలంటూ హకుం
కార్యాలయం మరమ్మతుల పేరిట ఠాణాల వారీగా వంతులు

ఈనాడు, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖలో ఆయనో కీలకాధికారి. ఎస్పీల కార్యకలాపాలను పర్యవేక్షించే ఉన్నత హోదాలో పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పదోన్నతి పొందడంతో ఆ కీలక బాధ్యతల్లో చేరారు. తాజా బాధ్యతల్లో చేరిన కొద్ది రోజుల నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపిన ఆయన తీరు శాఖలో చర్చనీయాంశంగా మారింది. పోలీస్‌ స్టేషన్ల నిర్వహణ నిధుల్లో వాటా తీసుకోవడంతోపాటు తన కార్యాలయం మరమ్మతుల కోసమంటూ ఠాణాల వారీగా వంతులేసి మరీ వసూళ్లకు పాల్పడటం విస్తుగొలుపుతోంది. వాస్తవానికి ఠాణాల నిర్వహణకు గతంలో నామమాత్రంగా నిధులుండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత నగర ఠాణాలకు రూ.75 వేల చొప్పున.. జిల్లా కేంద్రాల్లోని వాటికి రూ.50 వేలు.. గ్రామీణ ప్రాంత ఠాణాలకు రూ.25 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. ఇటీవలే నాలుగు నెలలకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. వాటిపై ఆ కీలకాధికారి కన్ను పడింది. నాలుగు నెలల సొమ్ములో నుంచి ఒక నెల తనకివ్వాలంటూ తన పరిధిలో 20కిపైగా ఠాణాలున్న ఓ జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ఇదే అదనుగా ఆ జిల్లా ఉన్నతాధికారులు ప్రతి ఠాణా నుంచి వసూళ్లకు తెరలేపారు. కేసులు ఎక్కువగా నమోదయ్యే పెద్ద ఠాణా నుంచి రూ.50 వేల చొప్పున, చిన్న ఠాణా నుంచి రూ.25 వేల చొప్పున వసూలు చేసి కొంత జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్‌ స్టేషన్ల నిర్వహణ నిధులు ప్రతినెలా సక్రమంగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎస్‌హెచ్‌వోలకు ఈ పరిణామం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఆ కీలకాధికారి తన హోదాను మరిచి మరీ ఎస్సైలను పిలిచి వివిధ కారణాలతో చివాట్లు పెడుతుండటం వెనక ఆంతర్యమేమిటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక్కో ఠాణా వంతు రూ.13,638

ఠాణా నిర్వహణ నిధుల్లో నుంచి వసూళ్ల పర్వానికి ముందే కీలకాధికారి మరో ఘనకార్యానికి తెరలేపారు. కొత్తగా ఏర్పాటు చేసుకున్న తన కార్యాలయానికి మరమ్మతులు చేయాలని ఆయన భావించారు. వాస్తవానికి ప్రభుత్వ నిధులతో మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఠాణాలకు వంతులేసేశారు. తన కార్యాలయానికి సుమారు రూ.10.5 లక్షలు వ్యయమైందని చెబుతూ.. వాటిని అన్ని ఠాణాల స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌(ఎస్‌హెచ్‌వో)లు చెల్లించాలని హుకుం జారీ చేశారు. సొమ్ము వసూలు చేసే బాధ్యతను ఓ డీఎస్పీకి అప్పగించారు. ఒక్కో ఠాణా నుంచి రూ.13,638 చొప్పున చెల్లించాలంటూ లెక్క తేల్చి అన్ని జిల్లాల ఠాణాలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఏ జిల్లాలో ఎన్ని ఠాణాలున్నాయి? మొత్తం కావాల్సిన సుమారు రూ.10.5 లక్షలు చెల్లించేందుకు ఒక్కో ఠాణా ఎస్‌హెచ్‌వో ఎంత చెల్లించాలి? అనే లెక్కలు సహా జిల్లాల్లోని కీలకాధికారులకు వాట్సప్‌లో వివరాలు షేర్‌ చేయడం గమనార్హం. ఓ జిల్లా ఎస్‌హెచ్‌వోలు దాదాపు రూ.3 లక్షలకుగాను రూ.2.5 లక్షల వరకు చెల్లించారు. అదే జిల్లా నుంచి తాజాగా ఠాణా నిర్వహణ నిధుల సొమ్ము నొక్కేయడం గమనార్హం. అప్పుడు తక్కువిచ్చారనే కారణంతో ఇప్పుడు ఇలా వసూలు చేసి ఉంటారని జిల్లా పోలీస్‌ యంత్రాంగంలో చర్చ జరుగుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు