పోలీస్‌ శిక్షణకు కసరత్తు

ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పరీక్షల తుది ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనుండటంతో శిక్షణ దిశగా పోలీస్‌శాఖ కసరత్తు చేస్తోంది.

Updated : 30 May 2023 05:43 IST

మైదానాల్ని తీర్చిదిద్దే పనిలో నిమగ్నం
జులైలో ప్రారంభించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పరీక్షల తుది ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనుండటంతో శిక్షణ దిశగా పోలీస్‌శాఖ కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆధ్వర్యంలో నిర్వహించిన అభ్యర్థుల రాత పరీక్షల తుది ఫలితాలు జూన్‌ మొదటివారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను నెలాఖరులోపు వెలువరించవచ్చని భావిస్తున్నారు. ఎస్సై శిక్షణ ఏడాదిపాటు రాజా బహుదూర్‌ వెంకట్రామారెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో.., కానిస్టేబుళ్ల శిక్షణ 9 నెలలపాటు టీఎస్‌ఎస్‌పీ (తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ పట్టాం) బెటాలియన్‌ శిక్షణ కేంద్రాలు(బీటీసీలు), పోలీస్‌ శిక్షణ కళాశాలలు(పీటీసీలు), నగర శిక్షణ కేంద్రాల(సీటీసీలు) మైదానాల్ని వినియోగించేందుకు పోలీస్‌శాఖ సన్నాహాలు చేస్తోంది. ఐజీ తరుణ్‌జోషి నేతృత్వంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో శిక్షణ విభాగం నిమగ్నమైంది. జులైలో శిక్షణ ప్రారంభించే అవకాశాలున్నాయి.

మూడొంతుల మంది శిక్షణకే అవకాశం

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మైదానాలను పరిగణనలోకి తీసుకుంటే మూడొంతుల మంది వరకే శిక్షణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి చేపట్టిన నియామకాల సరళిని పరిశీలిస్తే ఆబ్కారీ, అగ్నిమాపక, రవాణా, జైళ్లశాఖలవి పోను మొత్తం 17,516 పోలీస్‌ పోస్టులున్నాయి. వీటిల్లో 4,965 సివిల్‌, 4,423 సాయుధ విభాగం, 5,010 టీఎస్‌ఎస్‌పీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న మైదానాల్లో 12,000 మంది వరకు శిక్షణ ఇచ్చే సామర్థ్యముంది. ఇలాంటి పరిస్థితుల్లో శిక్షణ మైదానాల సామర్థ్యాన్ని పెంచాలని భావించారు. భవిష్యత్తులో ఇంత భారీ స్థాయిలో నోటిఫికేషన్లకు అవకాశం లేదనే అంచనాలున్నాయి. మైదానాల సామర్థ్యాన్ని పెంచడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు కనిపిస్తోంది. సివిల్‌, ఏఆర్‌ విభాగాలకు సంబంధించిన పోస్టుల ప్రాధాన్యం దృష్ట్యా గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఈ కేడెట్లకే తొలుత శిక్షణ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్‌ఎస్‌పీ ఆధ్వర్యంలోని బీటీసీల్లోనూ వీరికే శిక్షణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే టీఎస్‌ఎస్‌పీ కేడెట్ల శిక్షణ వచ్చేఏడాది ఆరంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 నోటిఫికేషన్‌లో భాగంగా టీఎస్‌ఎస్‌పీ కేడెట్ల శిక్షణా ఇలాగే ఆలస్యమైంది. అప్పట్లో సివిల్‌, ఏఆర్‌ కేడెట్ల శిక్షణ పూర్తయిన తర్వాతే 4816 మంది టీఎస్‌ఎస్‌పీ కేడెట్లకు శిక్షణ ఇచ్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని