Bank fixed deposits: భద్రంగా ఉంచుకోవచ్చు.. తేలిగ్గా తీసుకోవచ్చు!

డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలతో ప్రజల పొదుపు అలవాట్లు మారుతున్నాయి. ఒకప్పుడు బ్యాంకుకెళ్లి కనీసం ఒక గంట సేపు దరఖాస్తు నింపి డబ్బు కడితే ‘ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌’(ఎఫ్‌డీ) పత్రం ఒకటి ఇచ్చేవారు.

Updated : 30 May 2023 10:02 IST

మొబైల్‌ యాప్‌లతో భారీగా పెరుగుతున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

ఈనాడు, హైదరాబాద్‌ : డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలతో ప్రజల పొదుపు అలవాట్లు మారుతున్నాయి. ఒకప్పుడు బ్యాంకుకెళ్లి కనీసం ఒక గంట సేపు దరఖాస్తు నింపి డబ్బు కడితే ‘ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌’(ఎఫ్‌డీ) పత్రం ఒకటి ఇచ్చేవారు. అది తెచ్చుకుని జాగ్రత్తగా సంవత్సరాల పాటు దాచుకుని తిరిగి దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తేనే సొమ్ము వెనక్కి వచ్చేది. అదంతా ఒక సుదీర్ఘ ప్రక్రియ. దీంతో రూ.5 వేలు లేదా 10 వేలు వంటి తక్కువ మొత్తాలను ఎఫ్‌డీ చేయడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపేవారుకాదు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. డిజిటల్‌ బ్యాంకింగ్‌తో ఖాతాలో డబ్బు ఉంటే చాలు... రూ.వెయ్యి నుంచి ఎన్ని లక్షల రూపాయలైనా సెల్‌ఫోన్‌లో ఉండే సదరు బ్యాంకు యాప్‌ద్వారా ఎఫ్‌డీ చేసెయ్యొచ్చు. డబ్బు అవసరమైతే అదే యాప్‌ ద్వారా అదే డిపాజిట్‌ను రద్దు చేసుకుని ఖాతాలోకి డబ్బును బదిలీ చేసి వాడేసుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా నిమిషాల్లోనే పూర్తవుతున్నందున బ్యాంకుల్లో ఎఫ్‌డీ వేసే అలవాటు గణనీయంగా పెరుగుతోందని ప్రధాన బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు.
ప్రస్తుతం దేశంలో అత్యధికంగా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వేస్తున్న తొలి పది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. గత మార్చి 31 నాటికి తెలంగాణలోని అన్ని బ్యాంకుల్లో కలిపి రూ.6.83 లక్షల కోట్లకు పైగా సొమ్మును ప్రజలు ఎఫ్‌డీ చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ.50,481 కోట్లు అదనం.  ప్రస్తుతం బ్యాంకులు సాధారణ ప్రజలకు 6.50, సీనియర్‌ సిటిజన్లకు 8 శాతం వరకూ డిపాజిట్లపై వడ్డీని ఇస్తున్నాయి. పైగా మొబైల్‌ యాప్‌లో డిపాజిట్‌ చేయడం, ఏ రోజు కావాలంటే అప్పుడే క్షణాల్లో దానిని రద్దు చేసుకుని డబ్బు తీసుకుని వాడుకోవడానికి అవకాశం ఉండడం వల్ల ప్రజల ఆలోచనా ధోరణి మారుతోంది. బయట అధిక వడ్డీ కోసం అప్పులిస్తే తిరిగి వస్తుందో రాదో అనే భయం కూడా కొందరిలో ఉంది. గతంలో బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వేస్తే నిర్ణీత కాలంలోగా తిరిగి తీసుకోకూడదని, అలా తీసుకుంటే నష్టమని అపోహలుండేవి. ఇప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, వారి నెట్‌ బ్యాంకింగ్‌ ఖాతాను తెరిచి మొబైల్‌లోనే చూస్తే ఎంత సొమ్ము తిరిగి వస్తుంది? ఎన్నిరోజులుంటే ఎంత వడ్డీ వస్తుందనే విషయం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. దీనికితోడు కొన్ని పథకాల్లో డిపాజిట్‌ చేసిన సొమ్మును పొదుపు ఖాతా మాదిరిగా రోజూ అవసరమైతే తీసుకునేందుకు... తిరిగి సొమ్ము జమ చేసేందుకు కూడా అవకాశాలున్నాయి. అటు భద్రంగా, ఇటు సులువుగా ఉండడంతో ఎఫ్‌డీల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు శాఖ మేనేజర్‌ సంతోష్‌రెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు