కాళేళ్వర గంగ.. ఎల్లంపల్లికి నిరంతరంగా

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయిలో ఫలాలివ్వడం ప్రారంభించింది. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి జలాశయం వేసవి వచ్చిందంటే నీటి వినియోగం పెరిగి అడుగంటేది.

Published : 30 May 2023 05:06 IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయిలో ఫలాలివ్వడం ప్రారంభించింది. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి జలాశయం వేసవి వచ్చిందంటే నీటి వినియోగం పెరిగి అడుగంటేది. చరిత్రలో తొలిసారిగా మే నెలలో 13.29 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం మొత్తం నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. కాళేశ్వరం జలాలను ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎత్తిపోయడం ద్వారా మండు వేసవిలోనూ జలకళ సంతరించుకుంది.


సాగు.. తాగునీటికి తీరిన బెంగ

ఈ ఏడాది పెద్దపల్లి జిల్లాలో సుందిళ్ల వద్ద ఉన్న పార్వతి ఎత్తిపోతల ద్వారా శ్రీపాద ఎల్లంపల్లిలోకి 28.83 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. వీటిని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు సాగు, తాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు, రామగుండంలోని ఎన్టీపీసీ(నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌) అవసరాలకు నిరంతరాయంగా సరఫరా చేశారు. అయినప్పటికీ ఇంకా 13.29 టీఎంసీలు నిల్వ ఉండటం గమనార్హం. మరోవైపు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపుహౌస్‌ ద్వారా 30.94 టీఎంసీల నీటిని అనుబంధ జలాశయాలకు తరలించారు.


అన్ని కాలాల్లో కళకళ

* ఎల్లంపల్లి జలాశయానికి కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోస్తుండటంతో ఏడాది పొడవునా జలకళ సంతరించుకుంటోంది. దీంతో మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని మత్స్యకారులకు అన్ని కాలాల్లో జీవనోపాధి లభిస్తోంది. గతంలో వానాకాలం నుంచి డిసెంబరు వరకు మాత్రమే చేపలు పట్టడానికి అవకాశముండేది. ప్రస్తుతం మండు వేసవిలోనూ మంచిర్యాల జిల్లాలోని గుడిపేట నుంచి జగిత్యాల జిల్లా ధర్మపురి వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర నీరు నిలిచి చేపలు పుష్కలంగా లభ్యమవుతున్నాయి. 

* కాళేశ్వరం ప్రాజెక్టును ఎల్లంపల్లికి అనుసంధానం చేయక ముందు మే నాటికి డెడ్‌ స్టోరేజీకి చేరేది. దీంతో ఎన్టీపీసీకి 194 క్యూసెక్కులు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 331 క్యూసెక్కులు అందించడమే కష్టంగా ఉండేది. ప్రస్తుతం కాళేశ్వరం నీటిని పూర్తిస్థాయిలో వాడుకునే వెసులుబాటు ఉండటంతో జనవరి నుంచి ఎల్లంపల్లి నీటిని నంది పంపు ద్వారా అనుబంధ జలాశయాలకు పంపుతున్నారు. వాటి పరిధిలో వర్షాలు ఆలస్యంగా ప్రారంభమైనా వరి నాట్లు వేసుకునేందుకు అవకాశం ఉంటోంది.

* మిషన్‌ భగీరథ పథకం కింద నిత్యం పెద్దపల్లి జిల్లాకు 58, మంచిర్యాల జిల్లాకు 23 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ః మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లోని కడెం ఆయకట్టు కింద యాసంగిలో సుమారు 30 వేల ఎకరాల స్థిరీకరణకు అవకాశం లభించింది. వర్షాలు ఆలస్యమై కడెం జలాశయం ద్వారా సాగునీరు అందకున్నా ఆయా మండలాల్లో వానాకాలం సాగు పనులు ప్రారంభించుకునే వెసులుబాటు కలిగింది.

 న్యూస్‌టుడే, లక్షెట్టిపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని