అంతస్తులు పైపైకి.. పన్ను చెల్లింపులు గాలికి..
రాష్ట్రంలో రాజధానితో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆధ్వర్యంలో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
నిర్మాణాల లెక్కల్లో నిలువెత్తు లొసుగులు!
రెరా, రిజిస్ట్రేషన్, మున్సిపల్ కార్యాలయాల వివరాలతో పోల్చి చూడాలి
రూ.300 కోట్ల జీఎస్టీ అదనంగా రాబట్టాలి
ప్రభుత్వానికి వాణిజ్య పన్నులశాఖ నివేదిక
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో రాజధానితో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆధ్వర్యంలో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అంతస్తులైతే పైపైకి లేస్తున్నా.. వాటి విక్రయంపై ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీ మాత్రం పూర్తిస్థాయిలో వసూలు కావడంలేదు. నిర్మాణాలు, విక్రయాల వివరాలపై సంబంధిత శాఖల సమన్వయంతో కూడిన నిఘా లేకపోవడమే దీనికి కారణం. ఈ విషయంపై దృష్టి సారించాలని వాణిజ్య పన్నులశాఖ తాజాగా నిర్ణయించింది. గత ఏడాది (2022-23)లో రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థల నుంచి రూ.970 కోట్ల జీఎస్టీ వసూలైంది. అంతకుముందు ఏడాది (2021-22)తో పోలిస్తే ఇది 20 శాతం అధికమని తేలింది. కానీ నిర్మాణ సంస్థల బోగస్ లెక్కల కారణంగా మరో రూ.300 కోట్ల దాకా జీఎస్టీ ఆదాయం చేజారుతున్నట్లు తాజా అంచనా. పకడ్బందీ తనిఖీ చర్యల ద్వారా ఆ మొత్తాన్ని కూడా రాబట్టాలని వాణిజ్య పన్నులశాఖ నిపుణుల బృందం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.
ఆదాయం పెరగాలంటే..
ప్రతి రియల్ ఎస్టేట్ సంస్థకు ‘జీఎస్టీ గుర్తింపు సంఖ్య’ (జీఎస్‌టీఐఎన్) ఉండాలి. బిల్డర్ లేదా రియల్ ఎస్టేట్ సంస్థ అపార్టుమెంటు లేదా ఇంటిని విక్రయించినప్పుడు ఆ సంస్థ జీఎస్టీ నంబరును రిజిస్ట్రేషన్ శాఖ నమోదు చేయాలి. భవన నిర్మాణానికి ముందు సంబంధిత సంస్థ ‘రెరా’ కార్యాలయంలో నమోదు చేయించుకోవాలి. ఆ సమయంలో బిల్డర్ ఇస్తున్న జీఎస్టీ నంబరును వాణిజ్య పన్నులశాఖ తీసుకోవాలి. నిర్మాణం పూర్తయిన తరువాత బిల్డర్ మున్సిపల్ కార్యాలయం నుంచి ‘ఆక్యుపెన్సీ సర్టిఫికెట్’ (ఓసీ) తీసుకుంటారు. ఆ సమయంలో మున్సిపల్ కార్యాలయంలో జీఎస్టీ నంబరు ఇవ్వాలి. ఇలా రిజిస్ట్రేషన్, రెరా, మున్సిపల్ కార్యాలయాల్లో రియల్ ఎస్టేట్ సంస్థ ఇచ్చే జీఎస్టీ నంబరు ఆధారంగా విక్రయ వివరాలను వాణిజ్య పన్నుల శాఖ పోల్చిచూస్తే జీఎస్టీ ఎంత కట్టారనేది పక్కాగా తేలుతుంది. కానీ ఇది జరగడం లేదు. మున్సిపల్ కార్యాలయం నుంచి బిల్డర్ ఓసీ తీసుకునే సమయానికి మిగిలిపోయిన ఫ్లాట్లు లేదా ఇళ్లను ఆ తరువాత అమ్ముకున్నా జీఎస్టీ చెల్లించడంలేదు. ఉదాహరణకు ఇటీవల హైదరాబాద్‌లో ఒక బిల్డర్ 70 ఫ్లాట్లతో పెద్ద అపార్టుమెంటు నిర్మించారు. అందులో భూమి యజమానికి వాటా కింద 35 ఫ్లాట్లు ఇచ్చారు. నిర్మాణం పూర్తయిన తరువాత బిల్డర్ మున్సిపల్ కార్యాలయం నుంచి ఓసీ తీసుకుని భూ యజమానికి 35 ఫ్లాట్లు అప్పగించి వెళ్లిపోయారు. ఆ తరువాత భూమి యజమాని తాపీగా ధరలు పెంచుతూ తన వాటా 35 ఫ్లాట్లను అమ్ముకుంటూ జీఎస్టీ కట్టలేదు. ఇలాంటివి తనిఖీలు చేస్తే తప్ప బయటపడవు.
తనిఖీలే లేవు
2017 నుంచి ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ విక్రయాల్లో జీఎస్టీ వసూళ్లపై వాణిజ్య పన్నులశాఖ తనిఖీలు చేయలేదు. మున్సిపల్, సబ్ రిజిస్ట్రార్, రెరా కార్యాలయాల్లో నమోదయ్యే వివరాలను సేకరించడంలేదు. కొందరు బిల్డర్లు రెరా అనుమతులే తీసుకోవడంలేదని.. ఇక వివరాలు ఎక్కడి నుంచి వస్తాయని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ప్రతి దశలో బిల్డర్ ఇచ్చే జీఎస్టీ నంబరు సేకరించి వాణిజ్య పన్నుల శాఖ రిజిస్ట్రేషన్, రెరా, మున్సిపల్ కార్యాలయాల వివరాలను పోల్చి చూస్తే ఎంత పన్ను ఎగవేస్తున్నారో స్పష్టంగా తేలిపోతుందని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్