అయ్యో.. అన్నదాత

మరోసారి అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేశాయి. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం ఉదయం ఈదురుగాలులతో కురిసిన వానలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.

Published : 31 May 2023 04:41 IST

రైతన్నపై మళ్లీ వరుణుడి ప్రతాపం
పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
వివిధ ప్రాంతాల్లో అన్నదాతల రాస్తారోకోలు

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే యంత్రాంగం: మరోసారి అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేశాయి. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం ఉదయం ఈదురుగాలులతో కురిసిన వానలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఆ ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ అకాల వర్షాలతో అవస్థలు పడుతున్నామని.. కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అన్నదాతలు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్డెక్కారు. లారీలు అందుబాటులో ఉండేలా చూడాలంటూ రాస్తారోకోలు చేశారు.  

పెద్దపల్లి జిల్లా ఓదెల ఐకేపీ కేంద్రంలో అమ్మకానికి పోసిన ధాన్యం వరద తాకిడికి కొట్టుకుపోయింది. కొమిరలో పలువురు రైతులు ఆరబోసుకున్న మొక్కజొన్న పంట నీటి పాలైంది. జగిత్యాల జిల్లా కోరుట్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో తూకం వేసిన సుమారు 2 వేల బస్తాల ధాన్యంతో పాటు తూకం వేయని ధాన్యం కుప్పలు తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.  

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలోని ధాన్యం, మక్కల రాశులు, కాంటాలు వేసిన బస్తాలు తడిసి ముద్దయ్యాయి. నర్సంపేట మార్కెట్‌లో మక్కలు వరదకు కొట్టుకుపోయాయి. నెక్కొండ మార్కెట్‌ యార్డులో వర్షపు నీరు నిలిచింది. జనగామ, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో పిడుగుపాట్లకు ఒక పాడిగేదె, మూడు కాడెద్దులు మృతి చెందాయి. పర్వతగిరి మండలం కొంకపాకలో విద్యుదాఘాతంతో రెండు పాడి గేదెలు చనిపోయాయి.

మంచిర్యాల జిల్లా భీమారం, జైపూర్‌, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌, నెన్నెల, భీమిని మండలాలు, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌, కడెం, సోన్‌, కుంటాల, లక్ష్మణచాంద తదితర మండలాల్లో వర్షం పడింది. పలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాల పక్కన నీరు నిలిచింది.  


రైతుల ఆగ్రహం..

మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం నవాబ్‌పేటలో రైతులు.. లారీల కొరత తీర్చాలంటూ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం బస్తాలను రోడ్డుపై పెట్టి ఆందోళన నిర్వహించారు. చేగుంట మండలం వడియారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రహదారిపై రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం మునిగడపలో రైతులు రోడ్డుఫై బైఠాయించారు.

హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్‌ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళనకు దిగారు. కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలంటూ సంగెం, కమలాపూర్‌, చెన్నారావుపేట, నెక్కొండ తదితర ప్రాంతాల్లోని అన్నదాతలు రోడ్డెక్కి నిరసన తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో ఏర్పాటుచేసిన కేంద్రంలో నెల రోజుల నుంచి కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు. వేగవంతం కాకపోవడంతో రైతులు భూదాన్‌పోచంపల్లి రహదారిపై బైఠాయించారు.

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌, కడెం మండలాల్లో రైతులు ధర్నా చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని