ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి రాత పరీక్ష ఫలితాల వెల్లడి

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి తుది రాతపరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

Published : 31 May 2023 04:41 IST

84 శాతం మంది ఉత్తీర్ణత
సమాధానపత్రాల   పునఃమూల్యాంకనానికి అవకాశం
ధ్రువపత్రాల పరిశీలన అనంతరం  తుది మెరిట్‌ జాబితా ప్రకటిస్తామన్న నియామకమండలి

ఈనాడు, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి తుది రాతపరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 84.06 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మండలి వెల్లడించింది. మొత్తం 1,79,459 మంది అభ్యర్థులకుగాను 1,50,852 మంది అర్హులుగా నిలిచారు. అభ్యర్థుల సమాధానపత్రాల ఓఎంఆర్‌ షీట్లను మండలి వెబ్‌సైట్‌లోని వ్యక్తిగత లాగిన్‌లలో అందుబాటులో ఉంచనున్నట్లు మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు ప్రకటించారు. సమాధానపత్రాల మూల్యాంకనంలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా పటిష్ఠ విధానాలను అనుసరించినట్లు స్పష్టంచేశారు. అయినా రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పించామన్నారు. ఒక్కో సమాధానపత్రాన్ని పునఃపరిశీలించేందుకు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.2వేల చొప్పున.. ఇతర అభ్యర్థులు రూ.3వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం జూన్‌ 1న ఉదయం 8 గంటల నుంచి 3న రాత్రి 8 గంటల వరకు మండలి వెబ్‌సైట్‌లోని వ్యక్తిగత లాగిన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఒక్కో సమాధానపత్రం పునఃమూల్యాంకనానికి ప్రత్యేకంగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందన్నారు. తుది రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలన అనంతరమే తుది మెరిట్‌ జాబితా ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థుల దరఖాస్తు పత్రాల్లో ఇప్పటికీ ఏవైనా తప్పులున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... వాటిని సవరించుకునేందుకు ధ్రువీకరణపత్రాల పరిశీలన సమయంలో మరోసారి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు.


సివిల్‌ విభాగం కానిస్టేబుల్‌ అభ్యర్థుల సత్తా...

మొత్తం 17,516 పోస్టులు భర్తీ చేసేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ మొత్తం 8 విభాగాల్లో తుది రాతపరీక్షలు నిర్వహించింది. అన్ని విభాగాలతో పోల్చితే సివిల్‌ విభాగం పోలీస్‌/ఎక్సైజ్‌/రవాణా కానిస్టేబుళ్లు సత్తా చాటారు. వీరు అత్యధికంగా 90.9 శాతం మంది అర్హత సాధించడం విశేషం. అత్యల్పంగా ఐటీ కమ్యూనికేషన్‌ విభాగం ఎస్సై అభ్యర్థులు   కేవలం 23.4 శాతమే అర్హత సాధించగలిగారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని