ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో 37 మంది డిబార్‌

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది.

Published : 31 May 2023 04:39 IST

భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా నిషేధం
టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో ఓవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) దర్యాప్తు కొనసాగుతుండగానే కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్‌ ఇప్పటివరకు అరెస్ట్‌ చేసిన 37 మందిని డిబార్‌ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తమ నోటిఫికేషన్‌లోని నిబంధనలను అనుసరించి లీకేజీ కేసులో ప్రమేయమున్న వారు భవిష్యత్తులో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై నమోదైన క్రైమ్‌ నంబర్లు 64/2023, 95/2023 ఆధారంగా దర్యాప్తు క్రమంలో ఆయా అభ్యర్థుల ప్రమేయమున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతోపాటు వారిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం విషయంలో ఆయా అభ్యర్థులు ఏమైనా చెప్పదలుచుకుంటే రెండు రోజుల్లోగా తమను సంప్రదించి వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ చరిత్రలో ఇలా మూకుమ్మడి డిబార్‌ చేయడం ఇదే తొలిసారి.

మరింత మంది ఉండే అవకాశం!

ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ 37 మందిని డిబార్‌ చేసినట్లు ప్రకటించింది. అయితే సిట్‌ ఇప్పటికే 45 మందిని అరెస్ట్‌ చేసింది. దీనికితోడు అరెస్టుల సంఖ్య వంద దాటే అవకాశముందని హైదరాబాద్‌ నగర కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మంగళవారం పేర్కొనడం గమనార్హం. తొలుత రేణుక అనే ఉపాధ్యాయురాలు సహా తొమ్మిది మందిని అరెస్ట్‌ చేయడంతో లీకేజీ వ్యవహారం బహిర్గతమైంది. దర్యాప్తు క్రమంలో కమిషన్‌ ఉద్యోగులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి, షమీమ్‌, సురేశ్‌, రమేశ్‌ల పాత్ర ఉన్నట్లు తేలింది. ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు తేలిన అభ్యర్థిని సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుంటే కొత్త పేర్లు బయటికొస్తున్నాయి. ఇలా తీగలాగే కొద్దీ డొంక కదులుతుండటంతో సిట్‌ దర్యాప్తు ఎన్ని రోజులు సాగుతుందనేది అంతుచిక్కడం లేదు. లీకేజీకి పాల్పడినవారి సంఖ్య రెండు వందలకు చేరొచ్చని దర్యాప్తు అధికారులే అనధికారిక సంభాషణల్లో వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ వర్గాలు తాజా నిర్ణయం తీసుకునే సమయానికి తొలుత అరెస్టయిన 37 మంది జాబితాయే వారి వద్ద ఉండటంతో ఆమేరకే డిబార్‌ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. సిట్‌ తదుపరి చేసే అరెస్టుల ఆధారంగా వారందర్నీ డిబార్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని