వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు అవాంతరాలు

గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌ఏ) క్రమబద్ధీకరణ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడినట్లు తెలుస్తోంది.

Published : 31 May 2023 02:55 IST

జిల్లాల నుంచి అందిన సమాచారంలో లోపాలు  

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌ఏ) క్రమబద్ధీకరణ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న రాష్ట్ర మంత్రివర్గం క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకుని, అన్ని జిల్లాల నుంచి వీఆర్‌ఏల సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించాలని రెవెన్యూశాఖను ఆదేశించింది. అయితే చాలా జిల్లాల్లో గౌరవ వేతనంపై విధులు నిర్వర్తిస్తున్న వారి సమాచారం అస్తవ్యస్తంగా ఉన్నట్లు గుర్తించారు. దానిని సరిచేసి ఈ నెల 25 వరకు సీసీఎల్‌ఏ సూచించిన నమూనా ప్రకారం పంపాలని జిల్లా కలెక్టర్లు తహసీల్దార్లకు ఆదేశించారు. అయినప్పటికీ రికార్డుల నిర్వహణలో లోపాలు, కొన్నిచోట్ల వీఆర్‌ఏలు వంతుల వారీగా పనిచేస్తుండటం, మరణించిన వారి స్థానాల్లో ప్రత్యామ్నాయంగా నియామకాలు చేపట్టకపోవడంతోపాటు మృతుల రికార్డే కొనసాగుతుండటం లాంటి సమస్యలు వెలుగు చూశాయి. ఇవన్నీ రికార్డుల్లో కొనసాగడంతో వాటిని సరిచేయడానికి ఎక్కువ సమయం పడుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని కొన్ని రెవెన్యూ డివిజన్లలో రికార్డులు సిద్ధం చేయడంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి సమాచారం క్రోడీకరణ పూర్తయినా.. విద్యార్హతలు, వారసత్వ బదిలీకి ఉన్న అనుకూలతలు, న్యాయపరమైన చిక్కులు వంటివి గుర్తించే ప్రక్రియ చేపట్టాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని