తెలంగాణ వచ్చాకే సర్కారు ఆసుపత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే ప్రభుత్వాసుపత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 31 May 2023 05:38 IST

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి   హరీశ్‌రావు
అచ్చంపేటలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభం

అచ్చంపేట, అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే ప్రభుత్వాసుపత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూర్‌ గ్రామంలో మంగళవారం ఆయన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అచ్చంపేట పట్టణంలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. అనంతరం వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించి మాట్లాడారు. ‘‘నల్లమల ప్రాంతంలోని బడుగు బలహీనవర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఆకాంక్షతో సీఎం కేసీఆర్‌ అచ్చంపేటకు వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేశారు. రూ.20 కోట్ల నిధులు కేటాయించి ఆసుపత్రిని 10 ఐసీయూ, 5 డయాలసిస్‌, 25 అత్యవసర సేవల పడకలతో మొత్తం 140 పడకలకు విస్తరించాం. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు సర్కారు దవాఖానాకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లేవారు. భారాస తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అయిదు వైద్య కళాశాలలు, నియోజకవర్గానికి ఒక వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో వైద్య సేవలు మరింత చేరువయ్యాయి.

ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ, వసతుల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. రాష్ట్రంలోని వైద్యశాఖలో ఇప్పటికే 31,484 ఖాళీలు భర్తీ చేశాం. ఇటీవల తెలంగాణకు వచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌సింగ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన తీసుకొస్తాననడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, రైతుబీమా, మిషన్‌ భగీరథ, దళితబంధు వంటి పథకాలు ఎందుకు అమలు చేయలేదు’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అనంతరం సాయంత్రం రైతుల పక్షాన ఏర్పాటు చేసిన ధన్యవాద సభలో ఆయన పాల్గొన్నారు. భాజపాలో చేరికల కమిటీ అధ్యక్షుడు ఇటీవల కొందరు నేతలతో భేటీ జరిపి చేతులెత్తేసిన ఘటన విడ్డూరంగా ఉందన్నారు. అసత్య ప్రచారాలు చేస్తూ విషం చిమ్ముతున్న ప్రతిపక్షాలను నమ్ముకుంటే ప్రజలకు ఆత్మహత్యలు తప్పవని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాల్‌రాజు, నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ శాంతాకుమారి, వైస్‌ ఛైర్మన్‌ బాలాజీ సింగ్‌, కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, పురఛైర్మన్‌ నర్సింహగౌడ్‌, వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని