సంక్షిప్త వార్తలు (10)
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3వ తేదీన రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.
3న ఘనంగా రైతు దినోత్సవం: పల్లా
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3వ తేదీన రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై బుధవారం తన కార్యాలయంలో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రైతుబంధు సమితి జిల్లా సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ఘనతను దశాబ్ది ఉత్సవాల్లో చాటుతామని చెప్పారు. ఈ సందర్భంగా రైతు దినోత్సవం గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.
ట్రిపుల్‌ఆర్ బాధిత రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు
భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: యాదాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద మంత్రి జగదీశ్‌రెడ్డి కాన్వాయ్ ఎదుట మంగళవారం ఆందోళన చేసిన ఆరుగురు రైతులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు భువనగిరి గ్రామీణ ఎస్.ఐ. దిలీప్‌కుమార్ తెలిపారు. రాయగిరికి చెందిన ట్రిపుల్‌ఆర్ బాధిత రైతులు గడ్డమీది మల్లేశ్, పల్లెర్ల యాదగిరి, అవిశెట్టి నిఖిల్, మల్లెబోయిన బాలును రాత్రి 11 గంటల సమయంలో రిమాండ్‌కు పంపించామన్నారు. కేసు నమోదైన వారిలో తంగెళ్లపల్లి రవికుమార్, గూడూరు నారాయణరెడ్డి పరారీలో ఉన్నట్లు చెప్పారు.
ప్రతిభా పురస్కారాలకు ఆర్యవైశ్య విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
కాచిగూడ, న్యూస్‌టుడే: అవోపా బ్యాంక్‌మెన్ చాప్టర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 2023లో తెలంగాణలో ఎంసెట్, నీట్, జేఈఈ(అడ్వాన్స్), సివిల్స్‌లో వెయ్యిలోపు ర్యాంకులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థుల నుంచి ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్ట్ కన్వీనర్లు టీఎల్‌వీ రావు, డాక్టర్ కొత్త రామానందం, అధ్యక్షుడు పీవీ రమణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలోని వైశ్యా హాస్టల్ ఆడిటోరియంలో జూన్ 18న జరిగే కార్యక్రమంలో వారిని బంగారు పతకాలతో సన్మానిస్తామని పేర్కొన్నారు. అర్హులైనవారు పూర్తి వివరాలతో వాట్సప్ నంబర్లు 9014087055, 9550903770లకు జూన్ 11లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు మొబైల్ నంబర్లు 9290529133, 9441928528లలో సంప్రదించాలని సూచించారు.
దశాబ్ది వెలుగులు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాన కార్యాలయాలను ముస్తాబు చేస్తున్నారు. రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని నూతన సచివాలయ భవనం రాత్రిపూట ఇలా కాంతులీనుతూ జిగేల్‌మంటోంది..
ఈనాడు, హైదరాబాద్
గోశాలకు పశుగ్రాసం వితరణ
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సేకరించిన 150 ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని బుధవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలోని 11 గోశాలలకు వితరణగా అందజేశారు. అంతకుముందు ఖమ్మంలోని టేకులపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న గోశాల వద్ద ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అదనపు కలెక్టర్ మధుసూదన్, సండ్ర దంపతులు గోపూజ చేశారు.
న్యూస్‌టుడే, ఖానాపురం హవేలి
ఇలా ఎక్కించారు.. అలా పడేశారు..!
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు లారీల కొరత వేధిస్తోందనడానికి ఈ చిత్రమే నిదర్శనం. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తూకమైన వరి ధాన్యాన్ని తరలించాలంటూ రైతులు బుధవారం నర్సాపూర్-తూప్రాన్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారులు అటుగా ఖాళీగా వస్తున్న లారీని ఆపి శభాష్‌పల్లికి పంపించారు. కొన్ని సంచులను అందులోకి ఎక్కించిన తర్వాత లారీ యజమాని వచ్చి తనకు గిట్టుబాటు కాదంటూ వాటిని కిందపడేసి వెళ్లిపోయాడు.
న్యూస్‌టుడే, శివ్వంపేట
ఎఫ్‌ఎంజీలకు రూ.5,000 స్టైపెండ్
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్న్‌షిప్ కోసం రాష్ట్రంలో వైద్య కళాశాలల్లో చేరిన.. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన గ్రాడ్యుయేట్ (ఎఫ్‌ఎంజీ)లకు నెలకు రూ.5,000 స్టైపెండ్‌ను నిర్ణయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎఫ్‌ఎంజీలకు ఇచ్చే స్టైపెండ్ మన దేశంలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన వైద్య విద్యార్థులతో సమానంగా ఉండేది. తాజాగా ఆ ఉత్తర్వులను సవరిస్తూ ఎఫ్‌ఎంజీలకు నెలకు రూ.5,000 ఇవ్వాలని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల కొరత తీర్చాలి
టీఎస్‌యూటీఎఫ్
ఈనాడు, హైదరాబాద్: బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పాల్గొనాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులుగా తమవంతు కృషి చేస్తామని, అయితే టీచర్ల కొరతను తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని అన్ని పాఠశాలలకు విస్తరింపజేసి త్వరగా పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
శిక్షణ పూర్తిచేసిన వారికి పోస్టింగులు
ఈనాడు, హైదరాబాద్: పదోన్నతి శిక్షణపూర్తి చేసి కూడా ఖాళీగా ఉంటున్న వారికి పోస్టింగులు ఇస్తున్న డీజీపీ అంజనీకుమార్‌కు పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు గోపిరెడ్డి ఆధ్వర్యంలో బృందం బుధవారం డీజీపీని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చింది. పోలీసుశాఖలో పదోన్నతి శిక్షణ పూర్తిచేసినా చాలామందికి రకరకాల కారణాలతో పోస్టింగులు దక్కలేదు. పోలీసు అధికారుల సంఘం విజ్ఞప్తిని పరిశీలించిన డీజీపీ శిక్షణ పూర్తిచేసిన వారందరికీ పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. రాచకొండ జోన్‌లో 14 మంది ఎస్సైలకు కూడా ఇలానే పోస్టింగులు ఇచ్చారు. మిగతా అన్ని జోన్లలలోనూ ఖాళీలను ఇలానే భర్తీ చేయాలని ఆదేశించారు. యాదాద్రి, ఛార్మినార్ జోన్లలో 243 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ పోలీసుశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి
తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ వినతి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో పనిచేస్తున్న 1335 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితకు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ సంఘం విన్నవించింది. మంత్రిని కలిసినవారిలో సంఘం ప్రతినిధులు రామేశ్వరరావు, రేష్మరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేష్ ఖన్నా తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్
-
Apply Now: సీబీఎస్ఈ ‘సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)