వేద పండితుల గౌరవ భృతి పెంపు

బ్రాహ్మణ పరిషత్‌ ద్వారా వేదపండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నామని, అర్హత వయసును 75 ఏళ్ల నుంచి 65కు తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

Updated : 01 Jun 2023 04:36 IST

అర్హత వయసు 65కు తగ్గింపు
మరో 2,796 దేవాలయాలకు ధూప, దీప నైవేద్య పథకం వర్తింపు
బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌ వెల్లడి
అనువంశిక అర్చకుల సమస్యల పరిష్కారానికి హామీ

ఈనాడు, హైదరాబాద్‌: బ్రాహ్మణ పరిషత్‌ ద్వారా వేదపండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నామని, అర్హత వయసును 75 ఏళ్ల నుంచి 65కు తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గోపన్‌పల్లిలో తొమ్మిది ఎకరాల్లో నిర్మించిన ‘విప్రహిత’ బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని సీఎం బుధవారం ప్రారంభించారు. ప్రగతి భవన్‌ నుంచి నేరుగా యాగశాలకు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. తొలుత పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆసీనులైన పీఠాధిపతుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు వేదపండితులు కిరీటం ధరింపజేసి, శాలువాలు కప్పి సంప్రదాయ పద్ధతిలో శంఖారావం, వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం అక్కడి  సభలో సీఎం ప్రసంగించారు. బ్రహ్మజ్ఞానం పొందిన వారెవరికైనా బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని పెద్దలు చెప్పారని, వేదవాజ్ఞ్మయ విజ్ఞానాన్ని సమాజానికి అదించేవారే విప్రులని అన్నారు. బ్రాహ్మణుల మనసు, మాట, పని లోకహితం కోసమే అన్నారు.

ఏటా రూ.100 కోట్లతో సంక్షేమం

పేదబ్రాహ్మణులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును 2017 ఫిబ్రవరి 1న ఏర్పాటు చేసి ఏడాదికి రూ.100 కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. వివేకానంద స్కాలర్‌షిప్‌ ద్వారా 780 మంది విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. పేద బ్రాహ్మణుల జీవనోపాధి కోసం బ్రాహ్మిణ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ స్కీమ్‌ ఆఫ్‌ తెలంగాణ (బెస్ట్‌) ద్వారా పెట్టుబడి సాయంగా గరిష్ఠంగా రూ.5 లక్షల గ్రాంటు ఇస్తుండగా.. ఇప్పటివరకు రూ.150 కోట్లు ఖర్చు చేశామన్నారు. రూ.12 కోట్లతో బ్రాహ్మణ సదనం నిర్మించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ సదనం సనాతన సంస్కృతి కేంద్రంగా, ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రానికి వచ్చే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా, పేద బ్రాహ్మణుల కల్యాణాలకు ఉచిత వేదికగా ఉపయోగపడుతుందన్నారు. కులమతాలకతీతంగా పేదవారి ఇళ్లలో జరిగే శుభాశుభ కార్యాలకు పురోహితుల సేవలు కోరితే.. ఇక్కడి నుంచి వెళ్లి కార్యక్రమాలు జరిపించి రావాలని సీఎం కోరారు. ‘విప్రహిత’.. సకల జనహితగా విఖ్యాతి పొందాలన్నదే తన అభిమతమన్నారు. దేవతా ప్రతిష్ఠలు, వివిధ క్రతువులు, ఆలయాల నిర్మాణాలు, ఆగమశాస్త్ర నియమాలకు సంబంధించిన ప్రత్యేక లైబ్రరీని సదనంలో ఏర్పాటు చేయాలని, అరుదైన పుస్తకాలు, డిజిటల్‌ వీడియోలు ఏర్పాటు చేయాలన్నారు.

కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం

సూర్యాపేట జిల్లాలో డాక్టర్‌ ఎ.రామయ్య ఇచ్చిన ఎకరా స్థలంలో నిర్మించిన బ్రాహ్మణ పరిషత్‌ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఖమ్మం, మధిర, బీచుపల్లి ప్రాంతాల్లో బ్రాహ్మణ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. మెదక్‌ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ధూప, దీప నైవేద్య పథకం వర్తిస్తుండగా.. మరో 2,796 దేవాలయాలకు విస్తరిస్తామని సీఎం వెల్లడించారు. దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ.6 వేల చొప్పున అందిస్తున్న మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నామని ప్రకటించారు.

బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌

వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న రూ.2 లక్షలను ఇకపై వార్షిక గ్రాంటుగా విడుదల చేస్తామని తెలిపారు. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వర్తింపజేసేలా నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలో కేబినెట్‌లో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, మాజీ ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ డీజీపీలు అనురాగ్‌శర్మ, అరవిందరావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, దేవీప్రసాద్‌, జస్టిస్‌ భాస్కర్‌రావు, వివిధ పీఠాధిపతులు, ఆల్‌ ఇండియా బ్రాహ్మిణ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ప్రదీప్‌, స్థానిక ప్రజా ప్రతినిధులు, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల నుంచి అర్చకులు పాల్గొన్నారు.


స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసిన సీఎం

చందానగర్‌, న్యూస్‌టుడే: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని సీఎం కేసీఆర్‌ కలిశారు. బుధవారం చందానగర్‌ వేంకటేశ్వర దేవాలయంలోని గురునిలయానికి సీఎం కేసీఆర్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ విచ్చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. సుమారు గంటసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తర్వాత మరో గంటసేపు ఆధ్యాత్మిక విషయాలపై స్వాములతో సీఎం కేసీఆర్‌ ఏకాంతంగా మాట్లాడారు. సార్వత్రిక భారతదేశం ఎలా ఉండాలి, నదులు ఎక్కడెక్కడ పుట్టాయి, వాటి పుట్టుక నేపథ్యం, నేటి ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక అంశాలపై పిల్లల్లో పరివర్తన ఎలా రావాలన్న అంశాలపై సీఎం కేసీఆర్‌ చర్చించారని స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు.


 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని