రాష్ట్రంలో 10 కోట్ల యూనిట్ల విద్యుత్తు వినియోగం తగ్గుదల

తెలంగాణలో వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉన్నా వ్యవసాయానికి కరెంటు వాడకం లేనందున రోజూవారీ గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ గణనీయంగా తగ్గింది.

Updated : 01 Jun 2023 04:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉన్నా వ్యవసాయానికి కరెంటు వాడకం లేనందున రోజూవారీ గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో 27.50 లక్షల వ్యవసాయ బోర్లకు విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. గత మార్చిలో యాసంగి పంటల సాగు సమయంలో బోర్ల వాడకం వల్ల రోజూవారీ కరెంటు వినియోగం అత్యధికంగా 28.30 కోట్ల యూనిట్లు నమోదైంది. తాజాగా మంగళవారం (మే 30న) రాష్ట్రంలో మొత్తం అన్ని రకాల కనెక్షన్లకు కలిపి కరెంటు వినియోగం 18.30 కోట్ల యూనిట్లే నమోదైంది. వాస్తవానికి మే 1న మొత్తం వినియోగం 13.60 కోట్ల యూనిట్లే ఉంది. ఆ తరవాత ఎండల తీవ్రతతో ఇళ్లలో, పరిశ్రమల్లో వాడకం పెరగడంతో మే నాటికి 18.30 కోట్ల యూనిట్లకు చేరింది. వర్షాలు మొదలైతే రోజుకు 15 కోట్ల యూనిట్ల లోపే వినియోగం ఉంటుందని డిస్కంల అంచనా. ప్రస్తుతం డిమాండ్‌, వినియోగం లేనందున రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపివేసి వాటిని వార్షిక మరమ్మతులు చేయిస్తున్నారు. తిరిగి వర్షాలు పడకపోతే ఆగస్టు దాకా విద్యుత్‌ డిమాండు పెరిగే అవకాశాలు లేవని డిస్కంలు  తెలిపాయి.

మధ్యప్రదేశ్‌నుంచి తీసుకున్న కరెంటు వెనక్కి

‘పవర్‌ బ్యాంకింగ్‌’ విధానం కింద మధ్యప్రదేశ్‌ నుంచి తీసుకున్న కరెంటును తిరిగి రాష్ట్రం వెనక్కు ఇచ్చేస్తోంది. ఒక రాష్ట్రానికి కొరత ఉన్నప్పుడు మిగులు కరెంటు ఉన్న రాష్ట్రం నుంచి వాడుకుని...తిరిగి ఇక్కడ మిగులు ఉన్నప్పుడు వెనక్కి ఇచ్చేయడాన్ని ‘పవర్‌ బ్యాంకింగ్‌’ విధానంగా వ్యవహరిస్తారు. తెలంగాణలో యాసంగి పంటల సాగు వ్యవసాయ బోర్ల కరెంటు వినియోగం సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో గరిష్ఠస్థాయిలోవిద్యుత్తు వినియోగంఉంటుంది. ఆ సమయంలో మధ్యప్రదేశ్‌లో అంతగా డిమాండ్‌ లేకపోవడంతో అక్కడి నుంచి తెలంగాణ డిస్కంలు విద్యుత్తును తీసుకుని వినియోగించుకున్నాయి. తాజాగా ఆ రాష్ట్రానికి ఇచ్చేస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు