అంజన్‌కుమార్‌ను విచారించిన ఈడీ

యంగ్‌ ఇండియా ఫౌండేషన్‌కు విరాళాలిచ్చిన కేసులో మాజీ ఎంపీ, తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ను ఈడీ అధికారులు బుధవారం దిల్లీలోని కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు విచారించారు.

Published : 01 Jun 2023 07:16 IST

యంగ్‌ ఇండియా ఫౌండేషన్‌కు విరాళంపై ఆరా

ఈనాడు, దిల్లీ: యంగ్‌ ఇండియా ఫౌండేషన్‌కు విరాళాలిచ్చిన కేసులో మాజీ ఎంపీ, తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ను ఈడీ అధికారులు బుధవారం దిల్లీలోని కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు విచారించారు. ఫౌండేషన్‌కు అంజన్‌కుమార్‌ యాదవ్‌ గతంలో రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు ఇవ్వమంటే ఇచ్చారనే అంశంపై అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. గతంలోనూ అంజన్‌కుమార్‌ యాదవ్‌ను ఈడీ అధికారులు విచారించారు. నాడు విచారించిన అంశాలపై బుధవారం మరోమారు క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసినట్లు తెలిసింది. విచారణ అనంతరం అంజన్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. రెండుసార్లు ఎంపీగా పనిచేసిన తనకు పింఛను వస్తుందని, దీంతోపాటు తనకున్న ఆదాయ మార్గాలు, విరాళం ఇచ్చిన అంశంపై స్పష్టత ఇచ్చానని తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన పత్రాలను ఈ-మెయిల్‌ ద్వారా పంపుతానని పేర్కొన్నారు. దేశంలో రూ.వందల కోట్లు ఎగ్గొట్టినవారిని వదిలేసి బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారిపై దర్యాప్తు సంస్థలు కక్ష సాధిస్తున్నాయని ఆయన విమర్శించారు. రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. తానూ ఓ రెజ్లర్‌నని, కుస్తీ ఆటగాళ్ల పోరాటానికి మద్దతు ఇస్తున్నానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని