అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్‌ తొలగింపునకూ ఆదేశం

తండాలో చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించినందుకు ఓ వృద్ధురాలిపై ఆగ్రహం వ్యక్తంచేసిన డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌... ఆమె పింఛన్‌ను సైతం తీసేయాలని ఆదేశించారు.

Updated : 01 Jun 2023 03:43 IST

నర్సింహులపేట, న్యూస్‌టుడే: తండాలో చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించినందుకు ఓ వృద్ధురాలిపై ఆగ్రహం వ్యక్తంచేసిన డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌... ఆమె పింఛన్‌ను సైతం తీసేయాలని ఆదేశించారు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం గోపతండాలో బుధవారం చోటుచేసుకుంది. ఈ మండలంలోని గోపతండా, జగ్గుతండా, పెద్దనాగారం స్టేజీ పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గోపతండాలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తుండగా... వృద్ధురాలు మంగమ్మ స్థానికంగా అభివృద్ధి ఏమి చేశారంటూ ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే ఆమెపై మండిపడుతూ రోషం, నీతి, నిజాయతీలుంటే ఆసరా పింఛను, రూ.కిలో బియ్యం, రైతుబంధు తదితర పథకాల ద్వారా పొందిన లబ్ధిని వెనక్కివ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శిని పిలిచి మంగమ్మకు వస్తున్న వృద్ధాప్య పింఛన్‌ను తొలగించాలని ఆదేశించారు. ఇలాంటి వారు ప్రభుత్వపరంగా లబ్ధి పొందినా తమకు ఓటు వేయరంటూ అసహనం వ్యక్తంచేశారు. వెంటనే పోలీసులు వృద్ధురాలిని బయటికి తీసుకెళ్లారు. స్థానికులు కొంతమంది ఎస్సారెస్సీ డీబీఎం-60 కాలువపై వంతెన నిర్మించాలని కోరగా... తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే తప్పకుండా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. పెద్దనాగారంలో నిర్వహించిన సమావేశంలో పింఛను మంజూరుకు కొందరు అధికారులు డబ్బులు అడుగుతున్నారని స్థానికుడొకరు ఆరోపించగా... అలాంటి అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలంటూనే ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు