KTR: ఎంతో చేశాం.. ఇంకా చేస్తాం

‘దశాబ్దాలుగా పరిపాలించిన పార్టీలు చేయలేని ఎన్నో అభివృద్ధి పనులను మేం తొమ్మిదేళ్లలో చేసి చూపించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయాలి. ప్రజారవాణాను మెరుగుపరచాలి.

Updated : 02 Jun 2023 09:52 IST

ఈ సారీ అధికారం మాదే.. ముఖ్యమంత్రి కేసీఆరే
కాంగ్రెస్‌, భాజపాల సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా?
ప్రధాని మోదీని అధికారం నుంచి సాగనంపాల్సిందే
దేశంలో విపక్షాలన్నీ ఒకతాటిపైకి రావాలి
ఒకవ్యక్తిపై విద్వేషంతో కాదు... మెరుగైన పాలన కోసం
దేశం ముంగిట తెలంగాణ అభివృద్ధి నమూనా
పెద్దనోట్ల రద్దుకు మద్దతిచ్చినందుకు పశ్చాత్తాపపడుతున్నాం
రాహుల్‌గాంధీ స్వచ్ఛంద సంస్థ నడుపుకోవడం మంచిది
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

2024 ఎన్నికల తరువాత నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండరని అంచనా వేస్తున్నాను. సరికొత్త రాష్ట్రమైన తెలంగాణలో అపార ప్రగతి జరిగినప్పుడు దేశమంతటా ఎందుకు సాధ్యం కాదు? అందుకోసం ఏకమవుదాం. ఇంతటి అసమర్థ ప్రధాని దేశ చరిత్రలో లేరు.

ఈనాడు, హైదరాబాద్‌: ‘దశాబ్దాలుగా పరిపాలించిన పార్టీలు చేయలేని ఎన్నో అభివృద్ధి పనులను మేం తొమ్మిదేళ్లలో చేసి చూపించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయాలి. ప్రజారవాణాను మెరుగుపరచాలి. మెట్రో రైలు 250 కిలోమీటర్లకు విస్తరించాలి. నాలాలు, వరద నీటి కాల్వలను చక్కదిద్దాలి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆయన గురువారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. ‘వచ్చే ఎన్నికల్లో మేం 90 నుంచి 100 సీట్లు గెలుస్తాం. మా ముఖ్యమంత్రి మళ్లీ కేసీఆరే. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు దమ్ముంటే వాళ్ల సీఎం అభ్యర్థిని ప్రకటించమనండి. ప్రభుత్వం అన్నీ చేస్తుండటంతో పనిలేక.. ప్రతిపక్షాల నాయకులు  నోటికొచ్చినట్లు వాగుతూనే ఉన్నారు. భాజపా, కాంగ్రెస్‌లు మరుగుజ్జు పార్టీలు. దివాలాకోరుతనంతో వ్యవహరిస్తున్నాయి’ అని కేటీఆర్‌ దుయ్యబట్టారు. ప్రధాని మోదీని అధికారం నుంచి సాగనంపాల్సిందేనని, అందుకు ఆయన అన్ని విధాలా అర్హులేనని మంత్రి అన్నారు. ఒక వ్యక్తిపై విద్వేషంతో కాకుండా.. కేంద్రంలో భాజపా ఎలా విఫలమైందో చెప్పేందుకు, మెరుగైన పరిపాలన కోసం ఏం చేద్దామో చెప్పేందుకు దేశంలోని ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి నమూనా ఎలా ఉండాలో తెలంగాణ దేశం ముందు ఉంచిందని మంత్రి అన్నారు. ‘అవుటర్‌ రింగు రోడ్డు టెండరును జాతీయ రహదారుల నిబంధనల మేరకు ఇచ్చాం. ప్రతిపక్ష నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అందుకే హెచ్‌ఎండీఏ పరువు నష్టం దావా వేసింది. సచివాలయం కడితే అవినీతి అంటారు. ప్రతిదానికీ విమర్శలే. ఇకపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావాలు వేయాలని నిర్ణయించాం’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇంకా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

ఎంత పండిస్తే అంత కొంటున్నాం..

తాము అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు దీటైన పథకాలు ఉన్నాయేమో కాంగ్రెస్‌ను చెప్పమనండి. ఛత్తీస్‌గఢ్‌లో ఎకరాకు 12 క్వింటాళ్లకు మించి ధాన్యం కొనటం లేదు. తెలంగాణలో ఎంత పండిస్తే అంతా కొంటున్నాం. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో చెప్పమనండి. తెలంగాణ సంక్షేమ పథకాలను ఆచరిస్తుంటే ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. మహారాష్ట్రలో రైతుబంధు ప్రవేశపెట్టారు. టి-హబ్‌ మాదిరిగా ఎం-హబ్‌ పెడుతున్నారు. మాతో పోటీపడే పరిస్థితి ప్రతిపక్షాలకు లేదు. రాష్ట్రంలో భాజపా సోషల్‌ మీడియాలోనే ఉంది. అధికారంలోకి వస్తామనే కాంగ్రెస్‌ భ్రమల్లో ఉంటే వాళ్ల ఇష్టం. షర్మిల, కేఏ పాల్‌ కూడా అధికారంలోకి వస్తామని చెప్పుకొంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీది గెలుపు కాదు. అధికారంలో ఉన్న భాజపాపై ప్రజల తిరస్కారం. అక్కడ ప్రధాని, హోం మంత్రి, ఎనిమిది రాష్ట్రాల సీఎంలు విస్తృతంగా ప్రచారం చేసినా వారికి విజయం దక్కలేదు. భారాస అన్ని రాష్ట్రాల్లాగే ఆంధ్రప్రదేశ్‌కూ ప్రాధాన్యమిస్తుంది. ఇటీవలే అక్కడ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించాం.

వైఫల్యాలకు మోదీనే కారణం

ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వంటగ్యాస్‌ ధరలు పెరగటానికి మోదీనే కారణం. రూపాయి విలువ ఇంతగా క్షీణించడం ఆయన వైఫల్యమే. పెద్ద నోట్ల రద్దు ఘోర తప్పిదం. దానికి అప్పట్లో మేమూ మద్దతిచ్చాం. అందుకు ఇప్పటికీ పశ్చాత్తాపపడుతున్నాం. తాజాగా రెండు వేల నోట్ల ఉపసంహరణ లాంటి అంశాలు చాలా ఉన్నాయి. రాహుల్‌గాంధీ రాజకీయ పార్టీ కన్నా స్వచ్ఛంద సంస్థను నడుపుకోవటం మంచిది. రాజకీయాలంటే సైద్ధాంతిక కొట్లాటలుంటాయి. పారిపోతానంటే ఎలా? ఎన్నికల సమయంలో ఆయన గుజరాత్‌లో ఎందుకు పాదయాత్ర చేయలేదు? దేశంలో సమర్థ ప్రధాని ఎవరంటే.. ముందువరుసలో పీవీ నరసింహారావు పేరే చెబుతా.

దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదు

ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాలకు సమానావకాశాలు ఉండాలి. పునర్విభజనలోనూ అలానే ఉండాలి. అప్పటి కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను అమలు చేయటంతో జనాభా తగ్గింది. జనాభా నియంత్రణను అమలు చేసిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నదే నా వాదన. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం పరిపాలన పరంగా ఒక దేశమంత ఉంటుంది. ఆ రాష్ట్రంలో జనాభా ఎక్కువ. జనాభా ప్రకారం సీట్లు నిర్ణయిస్తామంటే దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగేవాటి కన్నా ఎక్కువగా ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే పెరుగుతాయి. దేశ ప్రగతికి దోహదపడుతున్న దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదు. లోక్‌సభ సీట్ల విషయంలో హేతుబద్ధీకరణ ఉండాలన్నది నా వాదన. సీట్ల పెంపుపై ఆరోగ్యవంతమైన చర్చ జరగటం కోసమే మాట్లాడుతున్నా. దీనికి నూతన విధానాన్ని తీసుకురావాలి. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి. సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చిన కేంద్రం రాజ్యాంగాన్ని సవరించలేదా?

ఒవైసీ తెలంగాణను పొగుడుతున్నారుగా..

రాష్ట్రంలో మైనారిటీలకు న్యాయం జరగటం లేదని అసదుద్దీన్‌ ఒవైసీ ఎందుకు అంటున్నారో ఆయనకే తెలియాలి. ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో.. మైనారిటీల అభివృద్ధి తెలంగాణలో బాగుందని ఆయన పొగుడుతున్నారు. ఏది నిజమో.. ఆయనే తేల్చుకోవాలి. ఎంఐఎం ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నది ఆయన ఇష్టం. మత ప్రాతిపదికన ప్రజలు ఓట్లు వేస్తారనుకోవటం లేదు. పదో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సమయంలో ప్రజలను ఒకటే కోరుతున్నా. జేబులో ఉన్న రూపాయిని పారేసుకుని రోడ్డుపై కనిపించే చిల్లరను ఏరుకోవద్దు. చిల్లర రాజకీయాలు చేసే నాయకులను, పార్టీలను ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం ఉంది. మరో దఫా మమ్మల్నే ఆశీర్వదించాలని కోరుతున్నా’ అని కేటీఆర్‌ అన్నారు.


నీళ్లు.. నిధులు.. నియామకాల్లో మెరుగ్గా..

‘నీళ్లు, నిధులు, నియామకాలు.. అనే నినాదంతో ఉద్యమించిన మేం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాం. సాగునీటి లభ్యతను పెంచాం. సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాది కన్నా అదనంగా 12 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశాం. ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నాం. రూ. 3.08 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. సంపద సృష్టించి.. అన్ని వర్గాలకు అందిస్తున్నాం. ప్రభుత్వ రంగంలో 1.32 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాం. మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోంది. ప్రైవేటు రంగంలో ప్రత్యక్షంగా 24 లక్షల ఉద్యోగాలు కల్పించాం. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ 26 వేల ఉద్యోగాలిస్తే తొమ్మిదేళ్లలో అంతకంటే 800 శాతం అధికంగా ఇచ్చాం. వైద్యవిద్యలో దేశంలోనే మూడో స్థానానికి ఎగబాకిన విషయాన్ని నీతి ఆయోగే చెప్పింది’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని