అక్టోబరులోపు రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

భారాస తన ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన రెడ్డి కార్పొరేషన్‌ హమీని అక్టోబరులోగా నిలబెట్టుకోవాలని రెడ్డి సంఘాల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 02 Jun 2023 04:12 IST

వరంగల్‌ సమ్మేళనంలో ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి

మడికొండ, న్యూస్‌టుడే: భారాస తన ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన రెడ్డి కార్పొరేషన్‌ హమీని అక్టోబరులోగా నిలబెట్టుకోవాలని రెడ్డి సంఘాల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆలోపు ఏర్పాటు చేయకపోతే తడాఖా చూపిస్తామని, అందుకు రాజకీయాలకు అతీతంగా రెడ్లు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రెడ్డి కార్పొరేషన్‌ సాధనకై ఉమ్మడి వరంగల్‌ జిల్లా రెడ్ల ఆత్మీయ సమ్మేళనం గురువారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ రెడ్డి కన్వెన్షన్‌ మందిరంలో జరిగింది. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ పేద రెడ్డి బిడ్డల సంక్షేమానికి రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ మెనిఫెస్టోలో చేర్చి నాలుగున్నరేళ్లు దాటిందన్నారు. కార్పొరేషన్‌ సాధనకై ఉమ్మడి జిల్లాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి కొద్ది రోజుల్లోనే కార్పొరేషన్‌ ప్రకటన చేయించడానికి కృషి చేస్తానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చెప్పారు. రెడ్లలో సైతం పేదలను గుర్తించి ఒక బీసీ నేతగా ప్రధాని నరేంద్రమోదీ 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో కొర్రీలు పెడుతోందని భాజపా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి అన్నారు. అందరికీ అండగా ఉండే రెడ్డి బిడ్డలు తమ సామాజిక వర్గం కోసం శక్తిని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు, సబ్సీడీలు రెడ్డి పేదలకు వర్తింపు, విద్యా, ఉద్యోగాల్లో వయోపరిమితి, కటాఫ్‌ మార్కుల సడలింపు తదితర తీర్మానాలను ఐకాస ఆమోదించింది. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగుల రాకేష్‌రెడ్డి, ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్‌ బిల్లా సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని