తనిఖీల్లో లోపాల ‘నిర్ధారణ’

రాష్ట్రంలో లింగ నిర్ధారణ పరీక్షల పట్ల కఠినంగా వ్యవహరించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆడపిల్లల భ్రూణహత్యలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో తనిఖీలు విస్తృతం చేయడంతోపాటు పట్టుబడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Published : 02 Jun 2023 04:12 IST

పలు స్కానింగ్‌ సెంటర్లు, ఆసుపత్రుల్లో గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు
కఠిన చర్యలకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లింగ నిర్ధారణ పరీక్షల పట్ల కఠినంగా వ్యవహరించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆడపిల్లల భ్రూణహత్యలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో తనిఖీలు విస్తృతం చేయడంతోపాటు పట్టుబడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇటీవల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లల జననాలు గణనీయంగా తగ్గుతుండటాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ క్రమంలో జమ్మికుంట, హనుమకొండ తదితర చోట్ల తనిఖీలు చేయగా స్కానింగ్‌ సెంటర్లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు బయటపడింది. ఘటనలు వెలుగు చూసినప్పుడు హడావుడి చేయడం మినహా ఇతర సందర్భాల్లో వీటి గురించి పట్టించుకోవడంలేదు. డీఎంహెచ్‌ఓలు విధిగా తనిఖీలు చేయాల్సి ఉన్నా పూర్తి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఫిర్యాదులు వచ్చినా స్పందించడంలేదు. హైదరాబాద్‌ స్థాయిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చిన వాటిపైనే కొద్దోగొప్పో చర్యలు ఉంటున్నాయి. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న వైద్య, ఆరోగ్యశాఖ పటిష్ఠ చర్యలపై దృష్టిసారించింది. లింగ నిర్ధారణ పరీక్షలకు నిలయంగా మారిన స్కానింగ్‌ సెంటర్లను గుర్తించనున్నారు.

గ్రామాల్లో పర్యవేక్షణ

ఇప్పటి వరకు స్కానింగ్‌ సెంటర్లకు సంబంధించిన పక్కా సమాచారం వైద్య, ఆరోగ్యశాఖ వద్ద లేకపోవడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. వీటిపై పక్కాగా ఇన్వెంటరీ ఉండాలని, స్కానింగ్‌ల వివరాలు గుర్తించాలని డీఎంహెచ్‌ఓలను ఆదేశిస్తున్నారు. ప్రధానంగా పట్టణాలు, నగరాల్లో డీఎంహెచ్‌ఓ పరిధిలో ఉన్న స్కానింగ్‌ సెంటర్లలో అర్హులైన వైద్యులు, సిబ్బంది ఉన్నారా లేదా గుర్తించనున్నారు. పట్టణాలు, నగరాల్లోని కొన్ని ఆసుపత్రులు, స్కానింగ్‌ సెంటర్లు గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకొని లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు ప్రోత్సహిస్తున్నాయి. ఆసుపత్రుల నుంచి కమీషన్లు ముడుతుండటంతో కొందరు ఆర్‌ఎంపీలు ఇదే పనిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆశావర్కర్ల ద్వారా గ్రామాల్లో పర్యవేక్షణ పెంచనున్నారు. వారు గుర్తించిన వివరాలను ఉన్నతాధికారులకు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

చట్టం ఉన్నా ఉదాసీనం

ప్రొహిబిషన్‌ ఆఫ్‌ సెక్స్‌ సెలక్షన్‌ రూల్స్‌-1996 ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారిపై కఠిన చర్యలకు అవకాశం ఉన్నా ఆచరణలో కనిపించడం లేదు. గతంలో పట్టుబడినవారే మళ్లీ వేరే పేర్లతో స్కానింగ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఈ అంశాలపై రాష్ట్ర వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేకంగా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. పోలీసుల సహకారంతో చర్యలు పటిష్ఠంగా ఉండేలా చూడనున్నారు. రాష్ట్రంలో ప్రీ కన్సెప్షన్‌, ప్రీ నాటల్‌ డయాగ్నస్టిక్స్‌ టెక్నిక్స్‌ (పీసీ, పీఎన్‌డీటీ) చట్టం అమలుపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. పరీక్షలు చేయించే కుటుంబసభ్యులపైనా కఠిన చర్యలకు చట్టం అవకాశం కల్పిస్తోంది.


డాక్టర్లు లేదా ఆసుపత్రి యజమానులపై చర్యలు

* మొదటిసారి పట్టుబడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా

* రెండోసారి పట్టుబడితే అయిదేళ్లు జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా

* కేసు తేలే వరకు మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ సస్పెన్షన్‌

పరీక్షలు చేయించిన వారిపై..

* మొదటిసారైతే మూడేళ్ల జైలు, రూ.50 వేల జరిమానా

* రెండోసారైతే అయిదేళ్ల జైలు, రూ.లక్ష వరకు జరిమానా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని