ఇక హైడ్రోజన్‌ బ్యాటరీలతో రయ్‌రయ్‌!

హైడ్రోజన్‌ను వాహనాలకు ఇంధనంగా ఉపయోగించే స్వదేశీ పరిజ్ఞానం ఆవిష్కృతమైంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగిస్తుండగా భారత్‌లో ఇప్పటివరకు ఆ సాంకేతికత వినియోగంలో లేదు.

Published : 02 Jun 2023 04:12 IST

ఆవిష్కృతమైన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం
బాబా అణు పరిశోధన కేంద్రం... జేఎన్‌టీయూ సంయుక్త పరిశోధన

హైడ్రోజన్‌ను వాహనాలకు ఇంధనంగా ఉపయోగించే స్వదేశీ పరిజ్ఞానం ఆవిష్కృతమైంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగిస్తుండగా భారత్‌లో ఇప్పటివరకు ఆ సాంకేతికత వినియోగంలో లేదు. అతి తక్కువ ఖర్చుతో నీటిని ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ (ఉదజని)గా విడగొట్టి హైడ్రోజన్‌ను సెల్‌ రూపంలో తయారు చేసి ఇంధనంగా మార్చేందుకు బాబా అణు పరిశోధన కేంద్రం  (బార్క్‌), జేఎన్‌టీయూ హైదరాబాద్‌ సంయుక్తగా కృషి చేస్తున్నాయి. బార్క్‌ శాస్త్రవేత్తలు, జేఎన్‌టీయూలోని సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ విభాగంలోని ప్రొఫెసర్లు విజయలక్ష్మి, హిమబిందు ఆధ్వర్యంలో నాలుగేళ్ల పాటు పరిశోధనలు జరిగాయి. ఇవి పూర్తిస్థాయిలో ఫలితాలిచ్చాయి. వాహనాల్లో సీఎన్‌జీ సిలిండర్‌ తరహాలో హైడ్రోజన్‌ సిలిండర్‌ను అమర్చి ఇంధనంగా వినియోగించవచ్చు. ప్రైవేటు సంస్థలు, అంకుర సంస్థలకు తమ పరిశోధనల ఫలితాలు, పరిజ్ఞానాన్ని అవగాహన ఒప్పందాల ద్వారా ఇవ్వనున్నామని ప్రొఫెసర్‌ హిమబిందు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు, ఉత్తర్‌ప్రదేశ్‌ వచ్చే రెండేళ్లలో 40 శాతం బస్సులకు ఇంధనంగా హైడ్రోజన్‌ను వినియోగించనున్నాయని ఆమె పేర్కొన్నారు.


ప్రత్యామ్నాయ ఇంధనం

నీరు అంటే హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ అణువుల కలయిక. నీటితో జలవిద్యుత్‌ తయారు చేసినట్టే నీటిలోని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లను విడగొట్టి వాహనాలకు ఇంధనంగా మార్చేప్రక్రియ రెండున్నర దశాబ్దాల క్రితమే దేశంలో మొదలయ్యింది. ఇప్పటికే బాబా అణు పరిశోధన సంస్థ తన సొంత అవసరాలకు, దేశ రక్షణకు అవసరమైన ప్రాజెక్టుల్లో వినియోగించే వాహనాలకు ఇంధనంగా హైడ్రోజన్‌ను వినియోగించుకుంటోంది. నీటిని విడగొట్టాలంటే అది స్వచ్ఛంగా ఉండాలి. అందుకు విద్యుత్‌ అవసరం. ఆ ఖర్చుకంటే.. హైడ్రోజన్‌ వినియోగానికి అయ్యే ఖర్చు తక్కువగా ఉంటేనే వాహనదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు వందల సంఖ్యలో పరిశోధనలు చేసి ఉదజనిని ఇంధనంగా మార్చేందుకు తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఫార్ములాను రూపొందించారు. హైడ్రోజన్‌ బ్యాటరీ తయారు చేసేందుకు సౌరవిద్యుత్‌ను వినియోగిస్తున్నామని ప్రొఫెసర్‌ హిమబిందు తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని ఇంధనంగా వినియోగించుకోవచ్చని పలు ప్రయోగాల్లో నిరూపితమైందని వివరించారు.కేంద్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం ‘హైడ్రోజన్‌ వ్యాలీ ఇన్నోవేషన్‌ క్లస్టర్‌’ పేరుతో దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. తాగునీటితో పాటు ఆల్గే, వ్యర్థ జలాల్లోంచి ఉదజని, ప్రాణవాయువును వేరు చేయాలన్నది హైడ్రోజన్‌ వ్యాలీ లక్ష్యం.


పెట్రోలు, డీజిల్‌తో పోలిస్తే ఖర్చు తక్కువే..

బస్సులు, కార్లు, ఇతర భారీ వాహనాలకు వినియోగిస్తున్న పెట్రోలు, డీజిల్‌ ఖర్చుతో పోలిస్తే హైడ్రోజన్‌ ఇంధనం ఖర్చు తక్కువే. ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పుడు లీటర్‌ డీజిల్‌ 15 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తే..దాదాపు అదేఖర్చుతో లభించే హైడ్రోజన్‌ సెల్‌ ఒక యూనిట్‌ ఇంధనంతో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పుడు 45 కిలోమీటర్ల మైలేజ్‌ వస్తుంది. అంటే డీజిల్‌తో పోలిస్తే... మూడోవంతు మాత్రమే ఖర్చవుతుంది.

* విదేశాల్లో టయోటా, హ్యుందాయ్‌, హోండా కంపెనీలు హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే కార్లను ఏడేళ్ల నుంచి తయారు చేస్తున్నాయి. ఇందులో హోండా కంపెనీ సాంకేతిక కారణాలతో ఉత్పత్తిని తగ్గించుకోగా... హ్యుందాయ్‌, టయోటా కంపెనీలు కార్ల ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటికి పదిహేను వేల వాహనాలు హైడ్రోజన్‌తో నడుస్తున్నాయి.

* హైడ్రోజన్‌తో నడిచే టయోటా ‘మిరాయ్‌’ కారును కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కొద్దినెలల క్రితం పార్లమెంటుకు నడుపుకొంటూ వచ్చారు.

ఈనాడు, హైదరాబాద్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని