సంక్షేమ స్వర్ణయుగం

ఇది దశాబ్ది ముంగిట నిలిచిన తెలంగాణ విప్లవాత్మక విజయ యాత్ర. ఉద్యమం నుంచి ఉజ్వల ప్రగతి దాకా సాగిన జయ పరంపరల జనగాథ.

Published : 03 Jun 2023 05:29 IST

నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ
అందుకోవాల్సిన అత్యున్నత శిఖరాలు మరెన్నో
సత్తువ ఉన్నంతవరకు రాష్ట్ర ప్రగతికి పరిశ్రమిస్తా
అమరుల ఆశయ సాధనకు మనసా వాచా కర్మణా అంకితం
రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌ పిలుపు
ఈనాడు - హైదరాబాద్‌

ఇది దశాబ్ది ముంగిట నిలిచిన తెలంగాణ విప్లవాత్మక విజయ యాత్ర. ఉద్యమం నుంచి ఉజ్వల ప్రగతి దాకా సాగిన జయ పరంపరల జనగాథ. నేడు నా రాష్ట్రం భారత వినీలాకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న ధృవతార అని ప్రతి తెలంగాణ పౌరుని ఛాతీ ఉప్పొంగేలా ఖ్యాతి పొందే స్థాయికి తెలంగాణను తీసుకురాగలిగినందుకు నా జీవితం ధన్యమైందని భావిస్తున్నాను. స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి, తెలంగాణ పునర్నిర్మాణానికీ సారథ్యం వహించే సువర్ణావకాశాన్ని, అదృష్టాన్ని, పాత్రను నాకు ప్రసాదించిన తెలంగాణ ప్రజానీకానికి నేను సర్వదా, శతధా, సహస్రధా కృతజ్ఞుడను.

ముఖ్యమంత్రి కేసీఆర్‌

‘సంపద పెంచుదాం.. ప్రజలకు పంచుదాం’ అనే నినాదంతో సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ప్రతిరంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ.. నేడు పదో వసంతంలోకి అడుగు పెట్టడం ఒక మైలురాయిగా అభివర్ణించారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకల్లో భాగంగా సీఎం శుక్రవారం ఉదయం తొలుత గన్‌పార్కులోని అమరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. నాకు ప్రాణ సమానమైన తెలంగాణ రాష్ట్రం చేరాల్సిన గమ్యాలు, అందుకోవాల్సిన అత్యున్నత శిఖరాలు మరెన్నో ఉన్నాయి. మీ అందరి దీవెనలతో నా శరీరంలో సత్తువ ఉన్నంతవరకు.. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం పరిశ్రమిస్తూనే ఉంటానని మాట ఇస్తున్నాను’ అని కేసీఆర్‌ అన్నారు. నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా వాసికెక్కిందని అభివర్ణించారు. ‘చరిత్రాత్మక ఉద్యమంలో మేధావులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు కులమత భేదాలకు అతీతంగా ఏకోన్ముఖులై కదిలారు. వారందరికీ నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నా. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నా. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారాస ప్రభుత్వం అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మణా అంకితమైంది’ అని   తెలిపారు. 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని ముఖ్యమంత్రి కోరారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...

కరెంటు కోతల్లేవు.. ఎటు చూసినా వరి కోతలే

‘రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు. ఇప్పుడు ఎటుచూసినా వరికోతలే కనిపించడం సంతోషకరం. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి, ప్రగతి బావుటాను సగర్వంగా ఎగురవేసింది. ఎత్తిపోతలతో తెలంగాణ బీడు భూములన్నీ తరిభూములయ్యాయి. తాగునీటి వ్యథలకు మిషన్‌ భగీరథ చరమగీతం పాడింది. వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణనివ్వడంతో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరింది. మన ఆదర్శ గ్రామాలు జాతీయస్థాయిలో అనేక అవార్డులందుకుంటున్నాయి. పట్టణాలు, నగరాలు పరిశుభ్రతకు, పచ్చదనానికి నిలయాలై ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నాయి.

దేశానికే తలమానికంగా..

తెలంగాణ రాక ముందు.. ఏ రంగంలో చూసినా విధ్వంసమే. గాఢాంధకారమే. అవరోధాలను అధిగమిస్తూ.. తెలంగాణ దేశంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదగడం చారిత్రక విజయం. తెలంగాణను దేశానికి తలమానికంగా తీర్చిదిద్దుతానని 2014 జూన్‌ 2న పరేడ్‌ మైదానంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రిగా నేను వాగ్దానం చేశాను. ఆ ఉక్కు సంకల్పాన్ని ఏనాడూ విస్మరించలేదు. తొమ్మిదేళ్లలోనే దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అధికారం చేపట్టిన వెంటనే నిర్దేశిత ప్రాజెక్టులను పూర్తి చేసిన ఫలితంగా.. వలసల జిల్లాగా పేరుపడిన ఉమ్మడి పాలమూరు పంట కాలువలతో, పచ్చని చేలతో కళకళలాడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. ఒకనాడు చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణ.. ఇప్పుడు 20కి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశంలా తొణికిసలాడుతోంది. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతోంది. ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని 2018లోనే ప్రారంభించుకున్నాం. తర్వాత కేంద్రం కూడా దీన్ని అనుసరించక తప్పలేదు. విధివశాత్తూ ఒక రైతన్న తనువు చాలిస్తే, ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందిస్తున్నాం.

జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ

దశాబ్ది ఉత్సవాల కానుకగా.. బీసీ కుల వృత్తుల కుటుంబాలకు.. రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నాం. గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభమవుతుంది. జూన్‌ 24 నుంచి పోడు పట్టాలు పంపిణీ చేస్తాం. ప్రభుత్వ భూముల్లో.. అర్హులకు ఇళ్ల స్థలాలిస్తాం. ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే పోషకాహార కిట్ల పంపిణీని ప్రారంభిస్తున్నాం. సొంతస్థలం ఉన్న కుటుంబాలకు ఇళ్లు అందించేందుకు ‘గృహలక్ష్మి’ పథకాన్ని జులైలో ప్రారంభిస్తున్నాం. రెండోవిడత దళితబంధు కింద 1.30 లక్షల మందికి ఆర్థిక చేయూత ఇవ్వనున్నాం. తెలంగాణ నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు.. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా కీర్తి గడించింది. రాష్ట్రంలోని 100 శాతం గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశంలోనే అగ్రస్థానాన నిలిచింది. ప్రపంచంలోని ఏ ప్రతిష్ఠాత్మక నగరానికీ తీసిపోని స్థాయిలో హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని విదేశాల నుంచి వచ్చిన వారంతా కితాబునిస్తుండటం మనందరికీ గర్వకారణం.

గురుకులాల అద్భుత ప్రతిభ

గురుకుల విద్యలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం మరొకటి లేదు. నాడు పీవీ నరసింహారావు దార్శనికతతో ప్రారంభమైన గురుకుల విద్యావ్యవస్థ, నేడు మా ప్రభుత్వ హయాంలో శిఖరాయమాన స్థాయికి చేరింది. ఏకంగా 1,002 గురుకుల జూనియర్‌ కళాశాలలు కొలువుదీరడం ప్రభుత్వం సృష్టించిన అద్భుత పరిణామం. మన గురుకుల విద్యార్థుల ప్రతిభ ఎవరెస్టు శిఖరాన్ని తాకేంత ఎత్తుకు ఎదిగింది. హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టి.. హరించుకుపోయిన వనాలను పునరుద్ధరించాం. రాష్ట్రంలో పచ్చదనాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించుకున్నాం. నాడు అంపశయ్య మీద ఉన్న వైద్యరంగం నేడు ప్రజలకు అత్యంత చేరువైంది. దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కేవలం 1400 ఆక్సిజన్‌ పడకలు ఉంటే, వాటి సంఖ్యను 27,966కు అంటే 20 రెట్లు పెంచుకున్నాం. రాష్ట్రం నలువైపుల నుంచీ వచ్చే రోగులకు సత్వరం కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడం కోసం హైదరాబాద్‌ నలువైపులా నాలుగు ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించుకుంటున్నాం. నిమ్స్‌ విస్తరణలో భాగంగా మరో 2000 పడకలతో ఏర్పాటు చేస్తున్న నూతన వైద్య భవనానికి ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే శంకుస్థాపన చేస్తా. వరంగల్‌లో రూ.1100 కోట్లతో 2000 పడకల సామర్థ్యం గల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. తొలి ఏడున్నర సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వం 12 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించింది. ఈ ఏడాది మరో 9 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.

మానవీయ దృక్పథం లేని ప్రగతి నిరర్థకం

మానవీయ దృక్పథం లేని ప్రగతి నిరర్థకమని నేను నమ్ముతాను. పేదల కన్నీరు తుడవని, కడుపు నింపని పాలన రాణించదు. అందుకే ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ‘తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, ప్రభుత్వ సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు’ అని ప్రజలు మాట్లాడుకోవడం ప్రభుత్వానికి దక్కిన సార్థకతగా భావిస్తున్నాను. నేతన్నల కోసం అనేక సంక్షేమ, సహాయ కార్యక్రమాలను చేపట్టాం. మత్స్య, గీత కార్మికులు, మైనారిటీలు, బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఆసరా పింఛన్లు అందుకుంటున్న వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తదితరులు ప్రభుత్వాన్ని నిండుగా దీవిస్తున్నారు. వీరందరి ప్రేమాభిమానాలే తెలంగాణ ప్రభుత్వానికి రక్షణ కవచాలై నిలుస్తున్నాయి. 

పారదర్శకంగా పాలన

పాలన పారదర్శకంగా ఉండేందుకు 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించుకున్నాం. సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయాలను నిర్మించుకుంటున్నాం. నేడు దేశంలో అనేక విభాగాల్లో అత్యధిక వేతనాలు పొందుతున్నది మన తెలంగాణ ఉద్యోగులేనని సగర్వంగా ప్రకటిస్తున్నాను. భారీగా ఉద్యోగ నియామకాలతోపాటు స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు లభించేలా చేయడం మనం సాధించిన మరో విజయం. టీఎస్‌ఐపాస్‌ చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఐటీ రంగంలోనూ తెలంగాణ మేటిగా నిలిచింది. ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నాం. శాంతిభద్రతల పరిరక్షణలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రోడ్లు గతుకులు పడి, కంకర తేలి ఉండటం వల్ల ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. స్వరాష్ట్రంలో రోడ్లు అద్భుతంగా అభివృద్ధి చెందాయి. రాష్ట్రంలోని రహదారుల నెట్‌వర్క్‌ 1.09 లక్షల కి.మీ.లకు పెరిగింది. 

అధునాతనంగా సచివాలయం

అధునాతన హంగులతో నూతన సచివాలయ సౌధాన్ని నిర్మించుకున్నాం. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. అమరవీరుల స్మారకం నిర్మించుకున్నాం. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాం. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవ ప్రతీకైన యాదగిరి దేవాలయ పునర్నిర్మాణం ఒక అద్భుతమని యావన్మందీ కొనియాడుతున్నారు. రాష్ట్రం నుంచి కాశీకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం 60 వేల చదరపు అడుగుల్లో అక్కడ వసతి గృహం నిర్మించబోతున్నాం. శబరిమలలోనూ మరో వసతిగృహం నిర్మిస్తున్నాం. తెలంగాణ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుంది.
సర్వజనులు సంక్షేమంతో, సంతోషంతో, సమత మమతలతో సమాన అవకాశాలతో వర్ధిల్లే శ్రేయోరాజ్యంగా భారతీయ సమాజాన్ని రూపుదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం త్రికరణశుద్ధితో పురోగమిస్తుంది. ధర్మస్య విజయోస్తు.. అధర్మస్య నాశోస్తు.. ప్రాణిషు సద్భావనాస్తు.. విశ్వస్య కల్యాణమస్తు.. జై తెలంగాణ.. జై భారత్‌’ అంటూ కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని