మూడేళ్లకు మించి ఒకేచోట పనిచేసే అధికారులను బదిలీ చేయండి

అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములయ్యే ఉద్యోగులు మూడేళ్లకు మించి ఒకేచోట పని చేయకూడదని, అలాంటి అధికారులు/ఉద్యోగులను గుర్తించి బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

Published : 03 Jun 2023 05:28 IST

తెలంగాణ సహా అయిదు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు
జులై 31వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తిచేయాలి
ఎన్నికల్లో భాగస్వాములయ్యే వారికే వర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములయ్యే ఉద్యోగులు మూడేళ్లకు మించి ఒకేచోట పని చేయకూడదని, అలాంటి అధికారులు/ఉద్యోగులను గుర్తించి బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. సొంత జిల్లా/నియోజకవర్గాల్లో అలాంటి అధికారులెవరూ విధులు నిర్వహించకూడదని, అలా ఎవరైనా ఉంటే వారినీ బదిలీ చేయాలని నిర్దేశించింది. జులై 31వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేసి, ఆ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించింది.  ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కొలువుదీరిన తేదీలను ప్రామాణికంగా తీసుకుని మూడేళ్ల సర్వీసును లెక్కించాలని స్పష్టంచేసింది. తెలంగాణలో మూడేళ్ల వ్యవధిని లెక్కించేందుకు 2024 జనవరి 31వతేదీని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఒకే జిల్లాలో మూడేళ్లుగా పనిచేస్తున్న, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారులు/ఉద్యోగులకు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించకూడదనే విధాన నిర్ణయం మేరకు తాజా ఆదేశాలు జారీచేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. బదిలీల ప్రక్రియపై ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు తక్షణం లేఖలు రాయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులకు మార్గదర్శనం చేసింది. ఆ ప్రకారం..

* రెవెన్యూ విభాగంలో జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఉప ఎన్నికల అధికారులు, నియోజకవర్గ ఎన్నికల అధికారులు, ఏఆర్వోలు, ఈఆర్వోలు, నోడల్‌ అధికారులు, తహసీల్దార్లు.. అందుకు సమానమైన అధికారులు మూడేళ్లు ఒకేచోట పనిచేసి ఉండకూడదు.
* పోలీసుశాఖలో రేంజి ఐజీ, డీఐజీలు, రాష్ట్ర సాయుధ పోలీసు విభాగ కమాండెంట్లు, జిల్లా ఎస్పీ నుంచి ఆర్‌ఎస్‌ఐల వరకు బదిలీ చేయాలి.
* ఎస్‌ఐలను ఎట్టిపరిస్థితుల్లో సొంత జిల్లాలో నియమించకూడదు. ఇటీవల పదోన్నతి పొంది..అదే ప్రాంతంలో పనిచేస్తున్నా స్థాన చలనం కల్పించాలి.
* ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఇప్పటికే భాగస్వాములైన అధికారులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముందస్తు అనుమతి తీసుకుని, ఆ ప్రక్రియ పూర్తయిన తరవాత బదిలీ చేయాలి.
* ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బదిలీ అయిన అధికారులు తక్షణం ఆ ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాలి.
* తమ బంధువులు ఎవరూ ఆ నియోజకవర్గం/జిల్లా పరిధిలో ఎన్నికల్లో పోటీచేయడం లేదని, తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు న్యాయస్థానంలో పెండింగ్‌లో లేవని ఆయా అధికారులు నామినేషన్ల దాఖలు గడువుకు రెండు రోజుల ముందు నిర్ధారిత నమూనాలో ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని