సంక్షిప్త వార్తలు (5)

ఓ వైపు తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవం.. మరోవైపు వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్‌రావు జన్మదినం.

Updated : 04 Jun 2023 07:06 IST

హరీశ్‌ జన్మదినం.. రైతు సంబురం

ఓ వైపు తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవం.. మరోవైపు వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్‌రావు జన్మదినం.. శనివారం ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సభ్యులు, రైతులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట పత్తి మార్కెట్‌ యార్డులో నవధాన్యాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్రాలను 34 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో భారీగా తీర్చిదిద్దారు. దీని కోసం దాదాపు 8 గంటలపాటు శ్రమించారు. ఆరు క్వింటాళ్ల నవధాన్యాలు వినియోగించినట్లు కమిటీ అధ్యక్షురాలు మచ్చ విజిత, భారాస నాయకుడు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.   

- న్యూస్‌టుడే, సిద్దిపేట


19 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి  

ఈనాడు, హైదరాబాద్‌: అడ్‌హాక్‌ పద్ధతిలో 19 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా రెవెన్యూశాఖ పదోన్నతులు కల్పించింది. 2020 నాటి సవరించిన వేతనాలు అమలు చేస్తూ రూపొందించిన పదోన్నతుల ఉత్తర్వులను రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ శనివారం విడుదల చేశారు. పదోన్నతులు పొందిన వారంతా భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించారు.  


గిరిజన సంక్షేమశాఖ దశాబ్ది ఉత్సవాల్లో ప్రదర్శనలు

ఈనాడు, హైదరాబాద్‌: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని బంజారాభవన్‌లో ఈ నెల 22 వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 5, 6 తేదీల్లో కోయ, నాయక్‌పోడ్‌, 8, 9 తేదీల్లో తోటి, కొలామ్‌, కొండారెడ్డి, చెంచు, 12, 13 తేదీల్లో గోండ్‌, పర్ధాన్‌, ఆంధ్‌ ఆదిమజాతుల హస్తకళలు, నృత్యాల ప్రదర్శన ఉంటుందని వివరించారు. ఈ నెల 14, 15 తేదీల్లో సదస్సులు, 21, 22 తేదీల్లో భాష, సంస్కృతి, ఆహార అలవాట్లు, సంప్రదాయ వైద్యంపై ప్రదర్శనలు కొనసాగుతాయని పేర్కొన్నారు.


వ్యవసాయ వ్యాపార కేంద్రాలపై ఉచిత శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ వ్యాపార కేంద్రాలు, అగ్రిక్లినిక్‌ల స్థాపనపై జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య నిర్వహణ సంస్థ (మేనేజ్‌) సహకారంతో హైదరాబాద్‌లో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రం ప్రకటించింది. వ్యవసాయం, పశువైద్య విజ్ఞానం, పట్టు పరిశ్రమలు, చేపల పెంపకం, విత్తన, బయో టెక్నాలజీలో డిగ్రీ, డిప్లొమా, పీజీ చేసిన వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు సమన్వయకర్త చంద్రకిరణ్‌ (ఫోన్‌ నంబరు 7036666425)ను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సీఈడీ కోరింది. శిక్షణ పొందిన వారికి మేనేజ్‌ నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని తెలిపింది.


బోధన తీరు స్వరూపం మారాలి

సైయెంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: బోధన తీరు స్వరూపం మారాలని సైయెంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, ఐఐటీ కాన్పుర్‌ బోర్డు సభ్యుడు బి.వి.ఆర్‌.మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. విద్యారంగం సాంకేతికత ఆధారంగా మారినందున అధ్యాపకులు పాఠాలు చెబుతాం..వినండి అని కాకుండా.. ప్రశ్నలు, జవాబుల రూపంలో బోధన సాగిస్తే...విద్యార్థుల్లో నైపుణ్యాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విజయవాడలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోహన్‌రెడ్డి మాట్లాడారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా బోధన రంగంలోనూ మార్పులు తెచ్చేందుకు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు కృషి చేయాలని సూచించారు. రానున్న పదేళ్లలో పది కోట్ల మంది చదువులు ముగించుకొని వస్తారని...వీరికి ఉద్యోగాలు లభించాలంటే...ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్య బాగా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ డాక్టర్‌ వినోద్‌కుమార్‌, నాగార్జున వర్సిటీ వీసీ వేణుగోపాలరెడ్డి, ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రేమచంద్రారెడ్డి, విద్యాశాఖ సలహాదారు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని