రాష్ట్రమంతా భగభగలు

రాష్ట్రం శనివారం నిప్పుల కొలిమిలా భగభగ మండింది. 11 జిల్లాల్లో 45.4 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 23 మండలాల్లో వడగాలులు(హీట్‌ వేవ్స్‌) నమోదయ్యాయి.

Published : 04 Jun 2023 04:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రం శనివారం నిప్పుల కొలిమిలా భగభగ మండింది. 11 జిల్లాల్లో 45.4 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 23 మండలాల్లో వడగాలులు(హీట్‌ వేవ్స్‌) నమోదయ్యాయి. 22 మండలాల్లో సాధారణ ఉష్ణోగ్రత కన్నా 4.5 నుంచి 6.4 డిగ్రీల వరకు అధికంగా నమోదు కావడంతో వడగాలుల హెచ్చరికలు జారీచేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సాధారణం కన్నా 6.5 డిగ్రీలకుపైగా నమోదు కావడంతో తీవ్రమైన వడగాలులు(సివియర్‌ హీట్‌ వేవ్స్‌) నమోదైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఎక్కువ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. గరిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 46.4 డిగ్రీలు నమోదయింది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌, ములుగు జిల్లా తాడ్వాయి, భద్రాద్రి జిల్లా సీతారాంపురం, మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేటలలో 46 డిగ్రీలకుపైగా నమోదయింది. సూర్యాపేట, భద్రాద్రి, ములుగు, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉత్తర తెలంగాణ జిల్లాలు కుతకుత

ఈ ఏడాది ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయిదు రోజులుగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 46 డిగ్రీలను దాటడంతో వేడి భరించలేని పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఏడు రోజులు రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలున్నట్లు వాతావరణశాఖ శనివారం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సూచించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని