గ్రూప్‌-1 ప్రిలిమినరీ హాల్‌టికెట్లు సిద్ధం

రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న  నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు సిద్ధమయ్యాయి. అభ్యర్థుల వివరాల ర్యాండమైజేషన్‌ తరువాత వీటిని వెబ్‌సైట్లో పొందుపరిచింది.

Published : 04 Jun 2023 04:58 IST

వెబ్‌సైట్‌లో పొందుపరిచిన టీఎస్‌పీఎస్సీ
నేటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న  నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు సిద్ధమయ్యాయి. అభ్యర్థుల వివరాల ర్యాండమైజేషన్‌ తరువాత వీటిని వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఆదివారం (ఈ నెల 4వతేదీ) నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కమిషన్‌ సూచించింది. 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపింది. అక్టోబరు 16 నాటి పరీక్ష కోసం డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లు ఇప్పుడు పనిచేయవని, తాజాగా మళ్లీ తీసుకోవాలని సూచించింది.

మరింత పకడ్బందీగా ఏర్పాట్లు

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై వారం రోజులుగా టీఎస్‌పీఎస్సీ బోర్డు సమాలోచనలు చేసి.. పలు నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 503 గ్రూపు-1 సర్వీసుల ఉద్యోగాలకు గత ఏడాది ఏప్రిల్‌లో కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది  దరఖాస్తు చేశారు. గత అక్టోబరు 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షను ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దు చేసి, జూన్‌ 11న నిర్వహించనున్నట్లు రెండున్నర నెలల క్రితం ప్రకటించింది. పరీక్షల్లో మరింత పారదర్శకత పెంచేందుకు ఇప్పటికే కమిషన్‌ పలు చర్యలు చేపట్టింది. పోలీసు కంప్యూటర్‌ సెల్‌, ఇతర సైబర్‌ నిపుణులు, వర్సిటీల ప్రొఫెసర్లతో కూడిన కమిటీలు చేసిన సిఫార్సుల మేరకు కమిషన్‌లోని సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థను పటిష్ఠం చేసింది. మరిన్ని ఫైర్‌వాల్స్‌ ఉపయోగించింది. యూపీఎస్సీ సిఫార్సుల మేరకు పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ పోస్టును సృష్టించింది. పరీక్షల విభాగం అంతా ఆ అధికారి నేతృత్వంలో నడుస్తుంది. యూపీఎస్సీ  సిఫార్సుల మేరకు రాష్ట్రేతర స్థానికత కలిగిన ఐఏఎస్‌ అధికారి నియామకం చేపట్టింది.

అభ్యర్థులకు రెండంచెల తనిఖీలు..

ప్రిలిమినరీ పరీక్షలో పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ  అభ్యర్థులను రెండంచెల్లో తనిఖీ చేయనుంది. మెటల్‌ డిటెక్టర్లు, ఇతర పద్ధతుల్లో అభ్యర్థుల్ని రెండుసార్లు.. రెండు బృందాలు పూర్తిగా పరిశీలించిన తరువాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనుంది. అభ్యర్థులంతా గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, తనిఖీల తరువాత అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయనుంది. లైవ్‌ ఫొటో తీసుకుని వచ్చిన అభ్యర్థి నిజమైన వ్యక్తి... అవునో కాదో.. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సహాయంతో గుర్తించనుంది. ఫొటోలు తీసుకునేప్పుడు గుర్తింపు కార్డుల వివరాలు పొందుపరచనుంది. అనంతరం పరీక్ష గదుల్లోకి అభ్యర్థులకు అనుమతించాలని నిర్ణయించింది. ప్రతి పరీక్ష కేంద్రంలో అదనపు భద్రతా సిబ్బందిని నియమించేందుకు అవసరమైన పోలీసు యంత్రాంగాన్ని సమకూర్చుకుంటోంది. పరీక్ష గదిలోకి వెళ్లిన తరువాత అక్కడి రోల్స్‌లోని అభ్యర్థుల ఫొటోతో ఇన్విజిలేటర్లు అభ్యర్థులను నిర్ధారించుకోనున్నారు. పరీక్ష కేంద్రంలోనూ ప్రభుత్వ గుర్తింపుకార్డును చూపించాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని అభ్యర్థులను బయటకు పంపించడంతో పాటు వారిపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని