ముందే గుర్తిస్తే క్యాన్సర్‌ నివారణ సాధ్యమే

క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, దాన్ని ముందే గుర్తించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు.

Published : 04 Jun 2023 04:57 IST

నాకూ పెద్దపేగులో క్యాన్సర్‌ రహిత బుడిపెలుంటే తొలగించారు
స్టార్‌ క్యాన్సర్‌ సెంటర్‌ ప్రారంభంలో మెగాస్టార్‌ చిరంజీవి

ఈనాడు, హైదరాబాద్‌: క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, దాన్ని ముందే గుర్తించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని స్టార్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన స్టార్‌ క్యాన్సర్‌ సెంటర్‌ను శనివారం ఆయన ప్రారంభించి.. ప్రసంగించారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఇది గతంలో సంగతి. నేను నిత్యం వ్యాయామం చేస్తుంటాను. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాను. పొగతాగే అలవాటు లేదు. అయినా నేను నిర్లక్ష్యం చేయలేదు. 40-45 ఏళ్లు దాటిన తర్వాత చాలామందిలో సాధారణంగా పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యుల ద్వారా తెలుసుకున్నా. వెంటనే ఏఐజీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ నాగేశ్వరరెడ్డిని సంప్రదించాను. కొలనోస్కోపీ చేశారు. అందులో బినైన్‌ పాలిప్స్‌ (క్యాన్సర్‌ రహిత బుడిపెలు) ఉన్నట్లు గుర్తించారు. వీటిని ఇలాగే వదిలిస్తే 80 శాతం మ్యాలిగ్నైన్‌ (క్యాన్సర్‌) కింద మారే అవకాశం ఉందని.. చికిత్సతో వాటిని తొలగించారు. అలా ముందుగా పరీక్ష చేయించుకోకుండా ఉంటే కొన్నేళ్లకు అది క్యాన్సర్‌గా మారేదేమో. అందుకే అందరూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి’ అని వివరించారు. అభిమానులు, సినీ కార్మికులకు అన్ని జిల్లాల్లో క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేసే కార్యక్రమానికి సహకరించాలని, అందుకయ్యే ఖర్చును తాను భరిస్తానని చిరంజీవి కోరగా.. స్టార్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ గోపీచంద్‌ సానుకూలంగా స్పందించారు. ఇది మంచి ఆలోచన అని.. తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఇకపై ప్రతి నెలా ఒక ఉచిత క్యాన్సర్‌ పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. స్టార్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో ఏఐ సాంకేతికతతో కూడిన ట్రూబీమ్‌ రేడియేషన్‌ థెరపీ అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి జేఎండీ డాక్టర్‌ గూడపాటి రమేష్‌ చెప్పారు.

తప్పుడు సమాచారంపై చిరంజీవి ఖండన

గతంలో తనకు కొలనోస్కోపీలో నాన్‌ క్యాన్సర్‌ పాలిప్స్‌ ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించారని మాత్రమే తాను చెప్పగా.. ‘నాకు క్యాన్సర్‌ వచ్చిందని, చికిత్స వల్ల బతికానని చెప్పినట్లు మీడియాలో తప్పుగా ప్రచారం జరిగింది’ అని చిరంజీవి ఈ సమావేశం అనంతరం ట్విటర్‌లో ఖండించారు. ‘దీనివల్ల అనవసరమైన అయోమయం ఏర్పడింది. అనేకమంది నా ఆరోగ్యం గురించి మెసేజ్‌లు పంపిస్తున్నారు. అందుకే వివరణ ఇస్తున్నా’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని