సీఆర్‌ఎస్‌ నివేదిక అత్యంత కీలకం

‘‘ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం మాటలకందని విషాదాన్ని నింపింది. గతంతో పోలిస్తే దేశంలో రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గినా... ఈ ఘటన అత్యంత దురదృష్టకరమైంది.

Published : 04 Jun 2023 04:17 IST

‘ఈనాడు’తో ద.మ.రైల్వే మాజీ జీఎం స్టాన్లీబాబు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం మాటలకందని విషాదాన్ని నింపింది. గతంతో పోలిస్తే దేశంలో రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గినా... ఈ ఘటన అత్యంత దురదృష్టకరమైంది. ప్రమాదానికి కారణాలు కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్‌) ఇచ్చే నివేదికతోనే వెల్లడవుతాయి. అందుకే ఆ నివేదిక అత్యంత కీలకమైంది. ప్రమాదాల నివారణకు నివేదికలో ఇచ్చే సలహాలను రైల్వేశాఖ దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంటుంది’’ అని రైల్వే నిపుణుడు, ద.మ.రైల్వే మాజీ జనరల్‌ మేనేజర్‌ స్టాన్లీ బాబు వివరించారు. ఒడిశాలో రైలు ప్రమాద నేపథ్యంలో ‘ఈనాడు’తో ఆయన మాట్లాడారు.

ప్రమాదం వెనుక టెక్నాలజీ లోపం ఉండొచ్చా?

రైల్వేలో ప్రస్తుతం ఉత్తమ టెక్నాలజీ వినియోగంలో ఉంది. మానవ తప్పిదాల్లేకుండా పరిజ్ఞానాన్ని ఉపయోగించినప్పుడే ప్రమాదాలను నివారించగలం.

తీవ్రత ఇంతగా ఉండటానికి కారణాలేంటి?

రైలు వేగాన్ని బట్టి ప్రమాద తీవ్రత ఉంటుంది. తాజా ప్రమాదం జరిగింది హైస్పీడ్‌ రైళ్లకు. వాటిలో మంచి పరిజ్ఞానం ఉంటుంది. ప్రమాదానికి రెండు, మూడు కారణాలు ఉండొచ్చు. సిగ్నల్‌ ఎక్కడ ఉందన్నదీ కీలకమే. అది మలుపులో ఉంటే లోకోపైలట్‌కు సరిగా కనిపించదు.

ప్రాథమిక నివేదికలో సిగ్నలింగ్‌ లోపమని చెప్పింది..

ఆ నివేదికను నేను చూడలేదు. ప్రమాదం ఎలా జరిగిందో మాత్రమే రైల్వే బోర్డు చెబుతుంది. ఎందుకు జరిగిందన్నది పూర్తిస్థాయిలో చెప్పగలిగేది కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్‌)నే. ఆ నివేదికతోనే పూర్తి స్పష్టత వస్తుంది. టెక్నాలజీ లోపమా? మానవ వైఫల్యమా? అన్నది తెలుస్తుంది. సీఆర్‌ఎస్‌ రైల్వే ఉద్యోగే. అయినా ఆయనకు ఈ శాఖతో సంబంధం ఉండదు. విమానయాన శాఖ పరిధిలో పని చేస్తారు. భారీ ప్రమాదాలు జరిగినప్పుడు తటస్థంగా వ్యవహరించి నిష్పక్షపాత విచారణ చేసేందుకు వీలుగా మంచి అనుభవమున్న అధికారిని సీఆర్‌ఎస్‌గా నియమిస్తారు.

ఎల్‌హెచ్‌బీ బోగీలున్నా ఇంత ప్రాణనష్టం జరగడానికి కారణాలేంటి?

ఈ మధ్యకాలంలో ఇంతమంది మరణించిన ప్రమాదం ఇదే. ఇతర బోగీలు, ఎల్‌హెచ్‌బీ బోగీల్లో చక్రాలు, బ్రేకుల పరంగా పెద్దగా తేడా ఉండదు. అయితే... ప్రమాద తీవ్రతపై వేగం ప్రభావం చూపుతుంది.

రైళ్లలోనూ బ్లాక్‌బాక్స్‌ తరహా ఏర్పాట్లు ఉంటాయా?

రైల్లోని ఇంజిన్‌లో స్పీడో మీటర్‌ ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో రైలు ఎంత వేగంతో వెళ్లిందో అందులో నమోదవుతుంది. స్టేషన్‌లోకి వచ్చే సమయంలో సాధారణంగా రైలు వేగాన్ని తగ్గిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు