నాసిరకం విత్తనాలకు నష్టపరిహారం చెల్లించాల్సిందే

నాసిరకం విత్తనాల కారణంగా పంట దిగుబడి కోల్పోయిన రైతుకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ స్పష్టం చేసింది.

Published : 04 Jun 2023 04:25 IST

రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: నాసిరకం విత్తనాల కారణంగా పంట దిగుబడి కోల్పోయిన రైతుకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ స్పష్టం చేసింది. విత్తనాల నాణ్యతకు సంబంధించి ఎలాంటి నివేదికలు అందజేయకుండా సరైన పద్ధతుల్లో సాగు చేయకపోవడం వల్లే పంట దెబ్బతిందని చెప్పడం సరికాదంది. నాసిరకం విత్తనాల ద్వారా నష్టపోయిన రైతు బానోతు హేమ్లాకు రూ.76,443 నష్టపరిహారంతోపాటు ఖర్చుల కింద రూ.వెయ్యి చెల్లించాలని ఖమ్మంలోని విత్తన విక్రయ సంస్థ శ్రీసాయి పరమేశ్వరి ట్రేడర్స్‌, నల్గొండలోని విత్తన తయారీ సంస్థ గోదావరి సీడ్స్‌ని ఆదేశించింది. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలానికి చెందిన హేమ్లా శ్రీసాయి పరమేశ్వరి ట్రేడర్స్‌ నుంచి రూ.750కి వరి విత్తనాలు కొనుగోలు చేసి 2.10 ఎకరాల్లో వేశారు. పంట ఎదుగుదల లేకపోవడంతో విత్తన విక్రేతతోపాటు మండల వ్యవసాయాధికారి దృష్టికి తీసుకెళ్లారు. మండల వ్యవసాయాధికారి పరిశీలించి.. నాసిరకం విత్తనాల వల్ల రెమ్మలు పెరగలేదని తేల్చిచెప్పారు. దుక్కి, విత్తనాలు, నాట్లు, ఎరువులు, పురుగుమందులు, నీరు, కూలీలు తదితరాలకు రూ.50 వేల దాకా పెట్టుబడి పెట్టానని, దిగుబడి రాకపోవడంతో మరో రూ.1.35 లక్షలు నష్టం వాటిల్లిందంటూ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో హేమ్లా ఫిర్యాదు చేశారు. ఆధారాలను పరిశీలించిన కమిషన్‌ పరిహారం కింద రూ.76,443 వేలు చెల్లించాలని ఆదేశించగా.. శ్రీసాయి పరమేశ్వరి ట్రేడర్స్‌, విత్తన కంపెనీ గోదావరి సీడ్స్‌లు రాష్ట్ర కమిషన్‌లో అప్పీలు దాఖలు చేశాయి. దీనిపై విచారించిన రాష్ట్ర కమిషన్‌ ఇటీవల తీర్పు వెలువరిస్తూ.. కంపెనీ, విక్రేతలు విత్తనాల నాణ్యతకు సంబంధించిన ల్యాబ్‌ నివేదిక లాంటి ఆధారాలేవీ సమర్పించలేదంది. విత్తన చట్టం ప్రకారం వ్యవసాయాధికారి నిపుణుల పరిధిలోకి వస్తారని, ఆయన నివేదిక ప్రకారం నాసిరకం విత్తనాల ద్వారా పంట నష్టం జరిగిందని తేలిందని పేర్కొంది. అందువల్ల పంట నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. రైతుకు రూ.76,443 చెల్లించాలన్న జిల్లా కమిషన్‌ తీర్పును సమర్థిస్తూ.. అప్పీలును కొట్టివేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని