రూ.లక్ష లేక.. రూ.10 కోట్ల బిల్లుల పెండింగ్‌

పాఠశాల విద్యాశాఖ వార్షిక బడ్జెట్‌ రూ.16,050 కోట్లు. కానీ ఉపాధ్యాయుల మెడికల్‌ రీఇంబర్స్‌మెంట్‌ మంజూరు పత్రాలను పంపడానికి పోస్టు ఖర్చులకు ఆ శాఖ వద్ద రూ. లక్ష లేవట. ఒక్కో ఉపాధ్యాయుడికి సగటున రూ. లక్ష చొప్పున పరిగణించినా.. సుమారు వెయ్యి మందికి రూ. 10 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.

Updated : 05 Jun 2023 12:37 IST

టీచర్ల వైద్య పత్రాల బట్వాడాకు నిధుల కొరత
వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయుల ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ వార్షిక బడ్జెట్‌ రూ.16,050 కోట్లు. కానీ ఉపాధ్యాయుల మెడికల్‌ రీఇంబర్స్‌మెంట్‌ మంజూరు పత్రాలను పంపడానికి పోస్టు ఖర్చులకు ఆ శాఖ వద్ద రూ. లక్ష లేవట. ఒక్కో ఉపాధ్యాయుడికి సగటున రూ. లక్ష చొప్పున పరిగణించినా.. సుమారు వెయ్యి మందికి రూ. 10 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. వీటి తాలూకు దస్త్రాలు రెండు నెలలుగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో మగ్గుతున్నాయి. సొంత ఖర్చులతో వైద్య చికిత్సలు చేయించుకొని.. ప్రభుత్వం నుంచి సొమ్ము వస్తుందన్న ఆశతో ఉపాధ్యాయులు ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. వారు పంపిన బిల్లులు విద్యాశాఖ నుంచి వైద్యశాఖలోని మెడికల్‌ బోర్డుకు వెళ్లి ఆమోదం పొందడానికి సుమారు ఏడాది పట్టింది. తీరా ఆమోదం పొంది విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయానికి వచ్చాక.. వాటిని పోస్టు చేసే దిక్కు లేకుండా పోయింది.

నిధులు మంజూరు కాక..

వైద్య బిల్లుల మంజూరు పత్రాలను ఉపాధ్యాయులకు పంపితే.. వారు వాటిని ట్రెజరీల్లో సమర్పించి సొమ్ము పొందే అవకాశం ఉంటుంది. అందుకు సుమారు ఆరు నెలలు పడుతుంది. విద్యాశాఖ ఆ పత్రాలను పంపేందుకు తపాలాశాఖకు సుమారు రూ.లక్ష చెల్లించాలి. పోస్టల్‌, తాగునీరు, ఇతర నిర్వహణ ఖర్చుల గ్రాంటు ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవడంతో ఆ సొమ్ము చెల్లించలేకపోయారు.

డీఈఓ కార్యాలయ సిబ్బంది ద్వారా చేరవేత

పోస్టు చేసే వీలు లేకపోవడంతో అధికారులు ఇటీవల వందల సంఖ్యలో దస్త్రాలను.. హైదరాబాద్‌కు వివిధ సందర్భాల్లో వచ్చే డీఈఓ కార్యాలయాల సిబ్బందికి ఇచ్చి పంపిస్తున్నారు. కొన్నింటిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీసుకెళ్తున్నారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ కార్యాలయ అధికారులను వివరణ కోరగా.. ఇటీవలే తపాలాశాఖకు కొంత మొత్తాన్ని సర్దుబాటు చేశామని.. త్వరలోనే దస్త్రాలను పోస్టు చేస్తామని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు