కొవిడ్‌ టీకాల ప్రభావంపై అధ్యయనం

కొవిడ్‌ ప్రభావానికి గురైనవారిలో ఆరోగ్యపరమైన మార్పులు, టీకాల ప్రభావంపై భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనం చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

Updated : 05 Jun 2023 05:14 IST

నెలన్నరలో ఐసీఎంఆర్‌ నివేదిక
వైద్యసీట్లలో తెలంగాణపై వివక్ష లేదు
కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ ప్రభావానికి గురైనవారిలో ఆరోగ్యపరమైన మార్పులు, టీకాల ప్రభావంపై భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనం చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఈ ప్రత్యేక అధ్యయనం నెలన్నరలోపు పూర్తవుతుందన్నారు. హైదరాబాద్‌లో జీ-20 మూడో హెల్త్‌ వర్కింగ్‌ గ్రూపు సమావేశానికి హాజరైన ఆయన.. తమ శాఖ సహాయమంత్రులు ఎస్‌.పి.సింగ్‌ భగేల్‌, భారతీ పర్వీన్‌ పవార్‌తో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆయుష్మాన్‌భారత్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.64 వేల కోట్లు వ్యయం చేయనుందన్నారు. రాష్ట్రాల్లో వైద్య, ఆరోగ్య సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. కొత్త వైద్య కళాశాలల కేటాయింపులో తెలంగాణ సహా ఏ రాష్ట్రంపైనా కేంద్రం వివక్ష చూపలేదన్నారు. ‘జిల్లాకొకటి చొప్పున రెండో దశలో 157 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ముందుగా వచ్చిన దరఖాస్తుల ప్రాతిపదికన వీటిని మంజూరు చేసింది. రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు ముందుగా పంపితే ఆ రాష్ట్రానికి మంజూరు చేశాం. బిహార్‌లో అప్పట్లో భాజపా సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా ప్రతిపాదనలు రాకపోవడంతో కాలేజీలు మంజూరు చేయలేదు’ అని మన్‌సుఖ్‌ మండవీయ ఉదహరించారు.


అందరికీ వైద్య సేవలే లక్ష్యం: కిషన్‌రెడ్డి

2030 నాటికి దేశంలో అందరికీ వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జీ-20 మూడో హెల్త్‌ వర్కింగ్‌ గ్రూపులో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు నిర్వహించుకుంటున్న సమయంలో ఆరోగ్య సేవలకు కేంద్రం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆయన స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని