వడగాలులు.. వర్షాలు.. రాష్ట్రంలో భిన్న వాతావరణం

రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు తీవ్రమైన ఎండలు.. ఇంకో వైపు వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు.

Updated : 05 Jun 2023 05:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు తీవ్రమైన ఎండలు.. ఇంకో వైపు వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. నాలుగు జిల్లాల్లో వడగాలులు నమోదయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 45.5 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 45.1, భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌లో 44.8, కరకగూడెంలో 44.5, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 44.4, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 44.1, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 43.5, కన్నాయిగూడెంలో 42.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్దలో అత్యధికంగా 6.7 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ జిల్లా తాండూరులో 5.1, నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 5, సంగారెడ్డిలో 4.8, వికారాబాద్‌ జిల్లా ధరూరులో 4.7, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర 3.9, కరీంనగర్‌ జిల్లా పెద్దేముల 3.6 సెం.మీటర్ల వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ పలుచోట్ల వర్షాలు కురిశాయి.

నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచించింది. వచ్చే వారం రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతాయని, హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాల్లో 38 నుంచి 41 డిగ్రీల వరకు ఉంటాయని పేర్కొంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది.


వడదెబ్బతో నలుగురి మృతి

సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామ పంచాయతీ కార్యాలయం మల్టీపర్పస్‌ వర్కర్‌ మాదాసు పెద్ద ముత్యాలు(46), మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లికి చెందిన ఈదురు చంద్రయ్య(58), జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన బాలుడు గాదెపాక సన్నీ(8), వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గర్‌చర్లకు చెందిన ఉపాధి కూలీ జుర్రు బీరయ్య(60) వడదెబ్బతో అస్వస్థతకు గురై చనిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు