ఐటీలో తెలంగాణ ఠీవి

రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ వదులుకోబోరని, మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని.. ఈ విషయం ప్రతిపక్షాలకూ తెలుసని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Updated : 06 Jun 2023 06:24 IST

2022-23లో కొత్తగా 1,26,894 మందికి ఉద్యోగాలు
రూ.2.41 లక్షల కోట్లకు చేరిన ఎగుమతులు
దేశంలో ప్రతి రెండు ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలో..
తొమ్మిదేళ్లలో గణనీయ వృద్ధి
హైదరాబాద్‌ ఇక నుంచి అంతర్జాతీయ నగరం
పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ వదులుకోరు: కేటీఆర్‌
2022-23 ఐటీ వార్షిక ప్రగతి నివేదిక విడుదల
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ వదులుకోబోరని, మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని.. ఈ విషయం ప్రతిపక్షాలకూ తెలుసని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఇక మెట్రోపాలిటన్‌ నగరం కాదని.. అంతర్జాతీయ నగరమని పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో గణనీయ వృద్ధి నమోదైందని.. దేశానికి కొత్తగా వచ్చిన ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణకు ఒకటి దక్కుతోందని అన్నారు. ఐటీ ఎగుమతులు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో ప్రస్తుత వృద్ధి రేటు కేవలం ఆరంభం మాత్రమే అని.. భవిష్యత్తులో టీహబ్‌, ఇతర ఆవిష్కరణల్లో మరిన్ని యూనికార్న్‌లు వస్తాయని, ఇతర రంగాల్లో భారీ పెట్టుబడులతో కొత్త ఉద్యోగాలు వస్తాయని వివరించారు. జాతీయస్థాయిలో ఐటీ వృద్ధిరేటు 9.36 శాతం ఉండగా.. తెలంగాణ వృద్ధిరేటు 31.44 శాతం నమోదైందని వెల్లడించారు. 2021-22తో పోల్చితే 2022-23 సంవత్సరానికి ఐటీ ఎగుమతులు రూ.57,706 కోట్లు పెరిగి రూ.2,41,275 కోట్లుగా నమోదైందని, ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 1,26,894 పెరగడంతో (16.2 శాతం) మొత్తం ఉద్యోగుల సంఖ్య 9,05,715కి చేరిందని తెలిపారు. ఐటీ వృద్ధిరేటులో ఆర్థిక సేవల రంగం కీలకంగా వ్యవహరించిందని, ఫార్మా రంగం నుంచి వృద్ధిరేటు పెరుగుతోందని వెల్లడించారు. సోమవారం టీ-హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఐటీశాఖ 2022-23 వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

అభివృద్ధి లక్ష్యాలు పెంచుకుంటాం..

‘‘తెలంగాణ ఏర్పాటైనప్పుడు ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇప్పుడు ప్రభుత్వ పనితీరుతో గణనీయ వృద్ధి నమోదైంది. కరోనా తరువాత మారిన పరిస్థితుల్ని అధిగమించాం. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్‌ను నిలిపాం. తొమ్మిదేళ్ల క్రితం ఐటీశాఖ ఎగుమతుల విలువ రూ.57 వేల కోట్లుగా ఉండేది. గడిచిన ఏడాదిలోనే రూ.57 వేల కోట్లు వృద్ధి చెందింది. 2022-23లో దేశంలో కొత్తగా 2.9 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. వీటిలో 36 శాతం డిజిటల్‌ నైపుణ్య ఉద్యోగాలున్నాయి. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 80 బిలియన్‌ డాలర్ల లక్ష్యానికి చేరువలో ఉన్నాం. ఈ నేపథ్యంలో 2030 నాటికి లక్ష్యం 250 బిలియన్‌ డాలర్లుగా పెట్టుకుంటున్నాం. 2012లో ఐటీఐఆర్‌ ప్రాజెక్టు నివేదిక రూపొందించినప్పుడు 2032 ఏడాదికి రూ.2.5 లక్షల కోట్ల ఐటీ ఎగుమతుల లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తరువాత ఐటీఐఆర్‌ను కేంద్రం రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిరంతర పనితీరుతో తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతుల్ని రూ.2.5 లక్షల కోట్లకు చేర్చింది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉద్యోగాల సంఖ్య 13 వేలకు చేరుకుంది. రాష్ట్రంలో ఒక్క ఫాక్స్‌కాన్‌ తొలిదశ యూనిట్‌తో 35 వేల మందికి ఉపాధి లభించనుంది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణలో భాగంగా ఈ నెల 15న సిద్దిపేటలో ఐటీ టవర్‌, జులైలో నిజామాబాద్‌, ఆగస్టులో నల్గొండలో ఐటీ టవర్లు ప్రారంభిస్తాం. వరంగల్‌లో టెక్‌ మహీంద్రా, సైయెంట్‌, జెన్‌పాక్ట్‌ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. హనుమకొండకు ఎల్‌టీఐ, జెన్‌పాక్ట్‌, హెచ్‌ఆర్‌హెచ్‌ నెక్స్ట్‌, హెక్సాడ్‌ సొల్యూషన్స్‌ సంస్థలు వచ్చాయి. నిజామాబాద్‌, సిద్దిపేట, నల్గొండలలో ఉద్యోగాల కల్పనకు ఇప్పటికే అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

దేశానికి దిక్సూచిగా హైదరాబాద్‌

కరోనా, ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ఐటీఐఆర్‌ను రద్దు చేసింది. ప్రత్యేక ఐటీ అభివృద్ధికి ఎలాంటి ఆలోచన చేయలేదు. కొన్ని విషయాల్లో మాటసాయం తప్ప ఆర్థిక సహకారం అందించలేదు. మరో రెండు ఈఎంసీలు(ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లు) ఇవ్వాలన్నా పట్టించుకోలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో ఐటీ రంగం దేశానికి దిక్సూచిగా నిలిచింది. భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సంస్థ రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ ఏర్పాటు చేయనున్న మూడు డేటా కేంద్రాలు త్వరలోనే ప్రారంభించనున్నాం. మైక్రోసాఫ్ట్‌ మూడు బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో అదనంగా మరో మూడు డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో డేటా రక్షణ, సైబర్‌ నేరాల నియంత్రణ కోసం ఐటీ శాఖ, నల్సార్‌ యూనివర్సిటీలు కలిసి దేశంలో తొలిసారిగా సైబర్‌ క్రైమ్‌ రెగ్యులేషన్‌ను ఆగస్టులో తీసుకురానున్నాయి. దిల్లీలో భారాస కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్‌ దూరమంటూ అందరూ ప్రచారం చేశారు. ఆ రోజున బాష్‌ గ్లోబల్‌ టెక్నాలజీ సంస్థతో ఒప్పందం కుదిరింది. ఆ సంస్థ 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2025 నాటికి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. జడ్‌ఎఫ్‌ సంస్థ జర్మనీ ఆవతల ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుంది. గూగుల్‌ సంస్థ అమెరికా ఆవతల 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనున్న ప్రధాన కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నాం. క్వాల్‌కామ్‌ సంస్థ వచ్చే ఐదేళ్లలో రూ.4 వేల కోట్లతో కార్యకలాపాలు విస్తరించనుంది. ఇజ్రాయెల్‌కు చెందిన అయేరార్క్‌ సంస్థ హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పుతోంది. లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి చెందిన టెక్నాలజీ కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది’’అని కేటీఆర్‌ వివరించారు.


2014లో దేశంలో ఐటీ ఉద్యోగాలు 32.90 లక్షలు ఉండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాటా 3,23,396 ఉద్యోగాలతో 9.8 శాతంగా ఉంది. గడిచిన తొమ్మిదేళ్లలో దేశవ్యాప్తంగా 21.10 లక్షల కొత్త ఉద్యోగాలు లభించగా.. అందులో తెలంగాణ వాటాగా 5,82,319 (27.6 శాతం) ఉద్యోగాలు ఉన్నాయి.

ఐటీ నివేదికలో వెల్లడి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని