15 ఎకరాలను అప్పనంగా అప్పగించినట్లుంది
హెటిరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు లీజు ప్రాతిపదికన జరిపిన భూకేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.
ప్రజాప్రయోజనాలకే ప్రభుత్వంపెద్దపీట వేయాలి
30 ఏళ్లనాటి నిబంధనలు ప్రామాణికమా?
హెటిరో గ్రూపు సాయిసింధు ఫౌండేషన్‌కు భూకేటాయింపు రాజ్యాంగవిరుద్ధం
రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు
ప్రభుత్వ విధానాన్నిపునఃపరిశీలించాలని ఆదేశం
ఈనాడు - హైదరాబాద్
హెటిరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు లీజు ప్రాతిపదికన జరిపిన భూకేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో 15 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం 2018లో జారీ చేసిన జీవో 59, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదే ఏడాది ఆగస్టులో జారీ చేసిన మెమోను కొట్టివేసింది. వ్యక్తులు, సంస్థలు చేసే దరఖాస్తుల ఆధారంగా ప్రభుత్వ విధానాన్ని మార్చుకోరాదని స్పష్టం చేసింది. 30 ఏళ్ల నాటి మార్కెట్ విలువను ఆధారంగా చేసుకుని హెటిరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు భూకేటాయింపు జరిగిన విధానాన్ని చూస్తే అప్పనంగా పళ్లెంలో పెట్టి అప్పగించినట్లుందని వ్యాఖ్యానించింది. ఈ కేటాయింపు చెల్లదని.. 2012, 2015లలో జారీ చేసిన 571, 218 జీవోలకు అనుగుణంగా పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాయిసింధు ఫౌండేషన్‌కు 15 ఎకరాల భూమి కేటాయించడాన్ని సవాలు చేస్తూ డాక్టర్ ఊర్మిళా పింగ్లే తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి సోమవారం 125 పేజీల తీర్పును వెలువరించింది.
కలెక్టర్ చేసిన ప్రతిపాదనలకు, భూకేటాయింపు అథారిటీ ఆమోదించినదానికి, జీవో 571లోని లీజు మార్గదర్శకాలకు విరుద్ధంగా భూమి కేటాయించినట్లు ఉందని పేర్కొంది. మార్కెట్ విలువను అథారిటీ చదరపు గజానికి రూ.75 వేలుగా నిర్ణయించిందని, అయితే ప్రభుత్వం బసవతారకం ఆసుపత్రికి 1989లో జరిపిన 7.5 ఎకరాల కేటాయింపునే ఇందుకు ప్రాతిపదికగా తీసుకుందని తెలిపింది. కలెక్టర్, అథారిటీల సిఫారసులను, ప్రభుత్వ విధానాన్ని పక్కనపెట్టి భూమి కేటాయించడానికి ఎలాంటి కారణాలు పేర్కొనలేదంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని భూకేటాయింపుపై నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో లేదంది. బసవతారకం ఆసుపత్రికి 1989లో భూమి కేటాయించినప్పుడు భూకేటాయింపుపై ఎలాంటి విధానం లేదంది. అప్పటి లీజు నిబంధనలనే సాయిసింధు ఫౌండేషన్ విషయంలో యథాతథంగా ఏడాదికి రూ.50 వేలు, మూడేళ్లకోసారి 5 శాతం పెంచేలా నిర్ణయించే ముందు హైదరాబాద్‌లో 30 ఏళ్ల తరువాత పెరిగిన భూముల విలువను పట్టించుకోలేదంది. విద్య, వైద్య సంస్థల ఏర్పాటుకు బహిరంగ వేలం, టెండరు విధానం అవసరం లేకపోయినా కనీసం ప్రభుత్వం రూపొందించిన విధానాన్నయినా అనుసరించాల్సి ఉందని తెలిపింది. ప్రస్తుతం సాయిసింధు ఫౌండేషన్‌కు భూకేటాయింపులో అథారిటీ వాణిజ్య అవసరాల భూమి విలువ చదరపు అడుగుకు రూ.70 వేల నుంచి 80 వేలుగా ఉందని పేర్కొందని తెలిపింది.
ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాలు చాలని అథారిటీ సిఫారసు చేసినా ప్రభుత్వం 15 ఎకరాలను ఏడాదికి కేవలం రూ.1.47 లక్షలకే అంటే నామమాత్రపు విలువకే లీజుకు కేటాయించిందని పేర్కొంది. ఇదేం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కాదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర వనరులకు ధర్మకర్త లాంటి ప్రభుత్వం ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా పెట్టుకుని కేటాయింపులు జరపాల్సి ఉందని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ప్రభుత్వం, అధికారులు తమకు నచ్చిన వ్యక్తి, సంస్థలకు కేటాయించడానికి వీల్లేదని.. ప్రతి కేటాయింపూ పారదర్శకంగా, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందని తెలిపింది. పెద్దమొత్తంలో భూమి కేటాయించే ముందు పారదర్శకత, సమన్యాయం పాటించాలని.. వ్యక్తులు, సంస్థలు పెట్టుకునే దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర విధానాలను తిరస్కరించేలా ఉండరాదంది. వ్యక్తులు, సంస్థలు పెద్దమొత్తంలో భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నపుడు.. అర్హత ఉండి పోటీకి వచ్చేవారిని మినహాయించడం సరికాదంది. ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఏకపక్షంగా కేటాయించడం, మరొకరిపై వివక్ష చూపడం రాజ్యాంగంలోని అధికరణ 14కు విరుద్ధమని పేర్కొంది. విద్య, వైద్య సంస్థలకు భూమిని కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. అయితే సమానత్వ సిద్ధాంతానికి అనుగుణంగా కేటాయించేలా కసరత్తు జరగాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొందని తెలిపింది. ప్రస్తుత భూకేటాయింపు ఏకపక్షం, అసమంజసమని.. ఇది ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
భూకేటాయింపును సమర్థిస్తూ అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ ప్రస్తావించిన తీర్పులు ఇక్కడ వర్తించవని, వాటితో ఏకీభవించలేమంది. ఆసుపత్రి నిర్మాణం 2023 సెప్టెంబరుకల్లా పూర్తవుతున్న దృష్ట్యా భూకేటాయింపుపై జోక్యం చేసుకోరాదంటూ హెటిరో ఛైర్మన్ పార్థసారథిరెడ్డి, సాయిసింధు ఫౌండేషన్ తరఫు సీనియర్ న్యాయవాది, వైకాపా ఎంపీ ఎస్.నిరంజన్‌రెడ్డి చేసిన వాదనతో ఏకీభవించడం లేదంది. 2021 ఫిబ్రవరి 11న ఈ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఏ నిర్మాణం జరిగినా తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. నిర్మాణం జరిగిందన్న కారణంగా చట్ట ఉల్లంఘనలను విస్మరించలేమని, మధ్యంతర ఉత్తర్వులు ఫౌండేషన్‌కు ఎలాంటి అదనపు హక్కులు సృష్టించవని తేల్చిచెప్పింది. నిర్మాణం జరిగిందన్న కారణంగా మినహాయింపులు కుదరవంది. ఈ నేపథ్యంలో భూమి కేటాయిస్తూ జారీ చేసిన జీవో 59ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ విధానం ప్రకారం పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mexico: మెక్సికోలో ట్రక్కు బోల్తా: 10 మంది వలసవాదులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు