దేశానికి సమర్థ నాయకత్వం అవసరం

ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు.

Published : 06 Jun 2023 05:12 IST

ఆ దిశగా సుపరిపాలనపై రాజనీతి, ఆర్థిక, సామాజికవేత్తలతో శిక్షణ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి
భారత్‌ భవన్‌కు శంకుస్థాపన

ఈనాడు, హైదరాబాద్‌- నార్సింగి, న్యూస్‌టుడే: ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారు చేసే దిశగా, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత సమర్థ నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరముందని ఆయన ఆకాంక్షించారు.  నగర శివారు కోకాపేటలో భారాసకు కేటాయించిన 11 ఎకరాల స్థలంలో ‘భారత్‌ భవన్‌’ పేరిట 15 అంతస్తుల్లో నిర్మిస్తున్న ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌’ భవనానికి ఆయన సోమవారం మధ్యాహ్నం  భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... ‘‘దేశ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ సుపరిపాలన కోసం పనిచేసే సమర్థ నాయకత్వం వర్తమాన భారతానికి అవసరముంది. ఈ దిశగా దేశవిదేశాల్లో  రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అనుభవజ్ఞులైన గొప్ప మేధావులను, నోబెల్‌ విజేతలను కూడా పిలిచి రేపటి పౌరులకు నాయకత్వ శిక్షణ ఇప్పిస్తాం.

తద్వారా భారత ప్రజాస్వామిక సౌధాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తాం. అందులో భాగంగానే ‘పొలిటికల్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ హెచ్‌ఆర్‌డీ’ కేంద్రాన్ని తీర్చిదిద్దాలనే నిర్ణయం తీసుకున్నాం. శిక్షణకు అనుగుణంగా తరగతి గదులు, ప్రొజెక్టర్‌తో కూడిన మినీ హాల్స్‌, విశాలమైన సమావేశ మందిరాలు, అత్యాధునిక డిజిటల్‌ లైబ్రరీలు, వసతి కోసం లగ్జరీ గదులు నిర్మిస్తాం. దేశ, విదేశాల వార్తా పత్రికలు, అంతర్జాతీయ మీడియా ఛానళ్లు అందుబాటులో ఉంటాయి. మీడియా రంగంలో రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా సీనియర్‌ టెక్నికల్‌ బృందాలు కూడా పనిచేస్తాయి. భారత్‌ భవన్‌కు కేటాయించిన స్థలంలో కొంతమేరకే భవన నిర్మాణం చేపడుతాం. మిగిలిన స్థలాన్నంతా పచ్చదనంతో నింపుతాం’’ అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ భవన నిర్మాణ స్థలంలో కొంత ఎత్తయిన ప్రదేశానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజకు సూచనలు చేశారు. ఇప్పటికే అక్కడ వెనుకబడిన కులసంఘాల ఆత్మగౌరవభవనాలకు కేటాయించిన స్థలాలు, పూర్తయిన భవనాలను అధికారులు చూపించారు.

భూ వరాహ హోమం

ఈ సందర్భంగా పండితులు నిర్వహించిన భూ వరాహ హోమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం  భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, భారాస సెక్రటరీ జనరల్‌, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, జోగినపల్లి సంతోష్‌కుమార్‌, బీబీ పాటిల్‌, రంజిత్‌రెడ్డి, దామోదర్‌రావు, బడుగుల లింగయ్యయాదవ్‌, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనాచారి, కల్వకుంట్ల కవిత, శేరి సుభాష్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు, వెంకట్రామిరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, గోరటి వెంకన్న, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, దానం నాగేందర్‌, కాలె యాదయ్య, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతిని పదిలంగా కాపాడుకోవాలి: సీఎం

సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్‌ తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోకాపేట్‌లోని హెచ్‌ఎండిఏ లేఅవుట్‌ నియోపోలీస్‌లో సోమవారం ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌, అర్బన్‌ ఫారెస్ట్‌ డైరెక్టర్‌ బి.ప్రభాకర్‌ అందించిన ‘పొన్న’ మొక్కను సీఎం నాటారు. పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ 7.70 శాతానికి పెరిగిందని ‘ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ నివేదిక వెల్లడించడం గొప్ప విషయమన్నారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో నిలవడం, బృహత్‌ ప్రకృతి వనాలపై నీతిఆయోగ్‌ ప్రశంసలు, హరితహారం ద్వారా 273 కోట్ల మొక్కలను నాటే ప్రక్రియ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నంగా రికార్డులకెక్కడం, ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ నివేదికలో పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కడం.. తదితర విజయాలన్నీ పర్యావరణ పరిరక్షణ పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు అద్దంపడుతున్నాయని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు